Saturday, July 23, 2005

Chapter 1 - "మా" లోకం - ఒక గొలుసు కథ

"మనం కలిసి రెండు సంవత్సరాలు అయిపోయింది కదా "అన్న మధు మాటలకి ఉలిక్కి పడి లేచాడు విజయ్‌.
అసలే వేసవి కాలం, పైగా ఎర్ర బస్సు ప్రయాణం కావటం చేత చాలా అలసటగా వుంది విజయ్‌కి. సెలవలకి మధు తాతయ్య గారి ఇంటికి వెళ్లటానికి ఎందుకు ఒప్పుకున్నానా అని మనసులోనే అనుకున్నా, బయటకి మాత్రం ఒక రకమైన నవ్వు నవ్వి మళ్లీ నిద్ర లోకి జారుకున్నాడు.

"కాస్తంత చోటు ఇవ్వండయ్యా! మా చిన్నోడు గొడవ చేస్తున్నాడు"
"కనిపించటం లేదా. ఇద్దరు పట్టే సీటు లో ముగ్గురం సర్దుకున్నాం. వెనుక వెళ్లి అడుగు"
"పొనీ మీరు జరగండి బాబు..."
"గంట నుంచుంటే దొరికింది సీటు. కొంచెం ఆగి లేస్తాను"

" టికెట్ టికెట్...."
" హోల్డాన్‌...పోలవరం వాళ్ళు దిగండి. "
" రయ్ ...రయ్ ..."

బస్సు అంతా కోలాహలం గా వుంది. చల్లటి యేరు గాలి తగలటంతో బస్సు లో ఒక్క సారి నిట్టూర్పులు వినిపించాయి.
" అమ్మా ..ఏమి తాపం రా బాబు" అని ఒక పెద్దాయన చెవి దగ్గర అరవటం తో మెలకువ వచ్చింది విజయ్‌ కి. ఏదో వింత ప్రదేశం లో వున్న అనుభూతి కలిగింది. పక్కన మధు లేక పోవటం గమనించిన విజయ్‌ కి ఒక్క క్షణం గుండె జల్లుమంది. ఊరు కాని ఊరు. పైగా జాగ్రత్త తక్కువ అవటం చేత వున్న డబ్బులు మధు జేబులో పెట్టాడు. మధు దిగిపోయాడా అన్న ఆలోచన వచ్చినా ,
" ఛ! మన వాడు అంత మతి మరపు కాదు లే" అని సర్ది చెప్పుకొని ప్రక్కన కూర్చున్న ఆవిడ ని అడుగుదామని తిరిగాడు. ఆవిడ మంచి నిద్ర లో వుంది. బయట చల్ల గాలి కంటే ఎండే ఎక్కువగా తెలుస్తోంది విజయ్‌ కి. అసహనంగా వున్న వాడి కోసమే అన్నట్లు ఆవిడ కదలటంతో అడగటానికి మొహమాట పడుతూనే అడిగాడు.
" మా వాడిని ఏమన్నా చూశారా?"
"ఎవరు బాబూ. లావుగా, చామన చాయగా వున్న ఆయనేనా?"
"చామన చాయనా ", బొగ్గు కంటె కొంచెం తెల్లగా వుండే కృష్ణ నీలం గుర్తుకు వచ్చి ఇక్కడ వారి నలుపు స్థాయి గురించి నవ్వు కొని , కష్టంగా తమాయించుకొని
" అవును వాడే అనుకుంటానమ్మా....కాదు వాడేనమ్మా!"
" ఆయనే సీటు ఇచ్చారు బాబూ. అక్కడ కండక్టరు గారి పక్కన మెట్ల మీద వున్నారు" ఆవిడ మాటలు పూర్తి అవ్వక ముందే అటు తిరిగి చూశాడు విజయ్‌. జనం లో కనిపించటం లేదు. మనసులోనే మధు ని అభినందించి,
"ఉండక చస్తాడా. ఉండకపోతే చస్తాడు!" ప్రకృతి ని ఆస్వాదించటం మొదలు పెట్టేడు విజయ్. పల్లె టూరికి రావటం ఇదే మొదటి సారి. పుస్తకాల్లో చదవటమేగాని ఎప్పుడు చూసే అవకాశం రాలేదు. ఏరు గాలి కొంచెం మంద పడటం మొదలయ్యింది. ప్రచండుడు ఆడుకుంటున్నాడు. రోహిణి కార్తె గురించి బామ్మ చెప్తూ వుండేది. చిన్నప్పుడు క్రి క్కెట్టు ఆట పైన వున్న మక్కువ తో ఎండ పట్టించుకోకుండా ఎలా ఆడామా అని ఆశ్చర్యం ఇప్పుడు కలుగుతోంది విజయ్‌కి.

( వంశీ - విజయవాడ - 6/17/5 - సశేషం)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home