Thursday, May 26, 2005

Chapter 33

/******************************************************/

"లెక్క నేను చేస్తాను", సీత ప్రకటించింది.
"ఇదిగో పెన్నూ, పేపరూ", గాయత్రి అందించింది.
"న*న = న అవుతోంది కాబట్టి అది ఒకటికానీ, ఐదుకానీ, ఆరుకానీ అవ్వాలి", దీపక్ మొదలెట్టాడు.
"కాన * య = మరల కాబట్టి న ఒకటయ్యే ఛాన్స్ లేదు", నీలు అందుకుంది.
"త - ల = త అని ఉంది కాబట్టి ల అంటే సున్నా", అన్నాడు విజయ్.
"ఇంకేం, న ఐదన్నమాట", మధు కలిపాడు.
"కా5 * 5య5", అని రాసింది సీత.
"య*న = ల కాబట్టి య సరిసంఖ్య అవుతుంది", అంది గాయత్రి.
"అంటే 5య5 - 525, 545, 565, 585 లలో ఒకటి కావాలి", అంది నీలు.
"ఇదిగో 35 * 565 సరిపోతోంది, ఇవీ అంకెలు", ఆనందంగా లెక్క చూపింది సీత.
"గ్రేట్. మంత్రాల మర్రికి ఈశాన్యంగా 7036లో రావి చెట్టు, దానికి ఆగ్నేయంగా 3062లో చింత చెట్టు, దానికి 9195తూర్పుగా , 210 ఉత్తరంగా. ఈ 7036, 3062

ఇవన్నీ అడుగులే అయుంటాయా?"
"అవును దీపక్, అడుగులో గజాలో అయితేనే బాగుంటుంది. పెద్ద యూనిట్స్ అయితే మళ్లీ కష్టపడాలి", అంది నీలు.
"కానీ ఆ మిస్టరీ వెంట వెళ్లేముందు మనం జేపీ మనుషులను వదిలించుకోవాలి. వాళ్లు ఈ మండపం కింద ఏదో ఉందనుకోవటం మనకి హెల్ప్ చేస్తుంది", అన్నాడు విజయ్.
"అంతా ఈ రాగిరేకులో ఉంది కాబట్టి అది కనపడకుండా చేస్తే చాలు"
"నిజమే లోకేష్ కానీ వాళ్లు కూడా మనం చేసినవన్నీ చేయగలరు కదా. ఈ శివలింగాన్ని తిప్పిచూసినప్పుడు అక్కడ ఏమీ లేకపోతే వాళ్లకి అనుమానం రాదా?", అడిగింది గాయత్రి.
"అయితే ట్రాక్ ఇంకొంచెం ముందే కవర్ చేస్తే సరి. మా బాబాయికి చెప్పి సాయంత్రానికల్లా ఈ మండపంలో ఒక ఉత్సవాన్ని మొదలుపెట్టిద్దాం. సీతకి కనిపించిన inscription పైనే విగ్రహాన్ని పెడదాం. అలా వాళ్లను కొంచెం డిలే చేయవచ్చు", అంది నీలు.
"వేసిన ఐడియాలు చాలు. దాణాకి టైమ్ అవుతోంది. ఇక లేవండి", తిండివైపు దారితీశాడు దీపక్. అందరికీ ఆకలి గుర్తొచ్చింది.

/******************************************************/

గోపాలుడు ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చాడు.
"ఐగోరూ, చినబాబు ఎన్ని రోజులుంటారు?"
"తెలీదురా, వాడసలు ఇక్కడికి వస్తాడనే నాకు చెప్పలేదు", కృష్ణమూర్తి తన చెప్పులని చూస్తూ జాగ్రత్తగా సమాధానం చెప్పాడు.
"రేయ్, వెళ్లి పొలానికి నీరు పెట్టిరా", వేంకట్రామయ్యగారు పురమాయించారు. గోపాలుడు తలదించుకుని వెళ్లిపోయాడు. కృష్ణమూర్తి కొంచెం కుదుటపడ్డాడు.
గోపాలుడు ఇంటిగుమ్మం దాటిన కొంతసేపటికి సూర్యం అటువైపు వచ్చాడు.
"రావయ్యా సూర్యం రా, ఎలా ఉన్నారు పిల్లలు?", వేంకట్రామయ్యగారు అడిగారు.
"ఈరోజు వనభోజనాలని వెళ్లారండీ. అన్నయ్యా మద్రాసు నుండి నీకోసం చంద్రశేఖర్ అని ఎవరో వచ్చారు. ఇంట్లో ఉండమని చెప్పాను"
కృష్ణమూర్తి మళ్లీ చెప్పుల పరిశీలన మొదలుపెట్టాడు.

/******************************************************/

మండపం చూడముచ్చటగా ఉంది. అలంకరణ అందంగా ఉంది.
అప్పుడే పూజకూడా మొదలైంది. జనం వచ్చి మండపంలో శ్రద్ధగా కూర్చొని ఉన్నారు.
సాయంత్రం హరికథ చెప్పేందుకు హరిదాసుగారు తయారవుతున్నారు.

ఇదంతా దూరం నుంచి చూస్తున్న నర్సింగ్ కి సహనం నశిస్తోంది.
"ఇప్పుడా రావడం?", వడివడిగా వస్తున్న గోపాల్ ని కేకలు వేశాడు.
"ఏమైంది? పొలానికి నీరు పెట్టేసరికి మధ్యాహ్నం రెండైంది. తర్వాత పోలవరానికి వెళ్లి ఖాన్ ని కలిసివస్తున్నాను. మండపాన్ని జాగ్రత్తగా గమనించమన్నాడు. ఈరోజు రాత్రే.."
"ఆపుతావా? ఒకసారి అటుచూడు. రాత్రికి పూజలూ పునస్కరాలు జరగబోతున్నాయి. ఇక మనం విషయం తెలుసుకున్నట్లే."
గోపాల్ పళ్లుకొరుకుతూ సెల్ ఫోన్ బయటికి తీశాడు.

/******************************************************/

"ఇక ఉత్తరంగా 210 అడుగులు అంతే", కంపాస్ చూస్తూ అన్నాడు దీపక్.
అందరి నడకల వేగం పెరిగింది.
"ఎప్పుడూ ఈ దారుల్లో రాలేదు. వేరేవాళ్లు కూడా ఇక్కడ నడిచిన గుర్తులు లేవు", అంది నీలు.
"ఇన్ని ముళ్లచెట్లు ఇక్కడ ఉన్నాయని నాకు కూడా తెలియదు", అన్నాడు మధు.
"అక్కడేదో కొంచెం ఖాళీ స్థలం ఉంది, అక్కడికి వెళ్దాం పదండి", ముందుకు వెళ్లాడు లోకేష్.
చెట్లమధ్యలోంచి బయటికి వచ్చిన వాళ్లు ఎదురుగా ఉన్నవి చూసి ఊపిరి తీసుకోవడం ఒక్క క్షణం మర్చిపోయి ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోయారు.

/******************************************************/

(విజయ్ - తిరుపతి - 12/26/5 - సశేషం)

1 Comments:

Blogger చేతన said...

I'm eagerly waiting for the next update..!!

January 11, 2006 at 8:51 AM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

Links to this post:

Create a Link

<< Home