Wednesday, May 25, 2005

Chapter 34

అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో విసిరేసినట్టుగా పెద్ద ఆంబోతు ఎముకలు, పుఱ్రెలు ఉన్నాయి। ఒక పుఱ్రెకయితే వొంపులు తిరిగిన పెద్ద కొమ్ములు వుండి మరీ భయంకలిగిస్తోంది। అంతలో సీత ఒక్కసారి అరవబోయి, తన నోటిని తనే నొక్కి పట్టుకుని అందరినీ మధ్యలోకి చూడమని సంజ్ఞ చేసింది।

అక్కడ ఒక బాగా బలిసిన ముంగీస, ఒక పొడుగాటి త్రాచుపాము పోట్లాడుకుంటున్నాయి। అందరూ వాటిని కన్నార్పకుండా చూస్తున్నారు। ఆ పాము బుసలు కొడుతూ అప్పుడప్పుడు ముంగీసని కాటేస్తొంది। ముంగీసేమో చాకచక్యంతో తప్పించుకుంటూనే, పాముని తన కాళ్లతో రక్కాలాని ప్రయత్నిస్తోంది।

సీత తన ఆవేశాన్ని ఆపుకోలేక, "ఇక్కడేదో మంత్ర రక్ష వున్నట్టుంది.... నాగదేవత అంశగా ఈ నాగు పాము నిధిని రక్షింస్తోందేమో!!!!! నీలక్కా... నాగమ్మ సీరియల్ లో కూడా ఇలానే జరుగుతుందే... మనం వెళ్లిపోవడం మంచిది" అని అంది।

అంతా ఒక్కసారి సీతవైపు చూసారు। సీత ఇంకా అమాయకంగానే మొహం పెట్టింది।

విజయ్ కి రోషం వచ్చింది। "సమ సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయి గురూ ఈ తెలుగు సీరియళ్లు। నాగాస్త్రం, నాగమ్మ లాంటి సీరియళ్లు చూసి యువత ఎలా చెడిపోతోందో చూడండి।" అంతలో మధు "సర్లేరా, ఇప్పుడు అంత ఘాటయిన dialogue అవసరమా?"
లోకేష్ ముందుకొచ్చి, అవసరమే మధు। "పాము, ముంగీస కొట్టుకుంటున్న scene చూడగానే ఏ NGC నో, లేకపోతే Animal Planet గుర్తుకురావాలి కానీ, నాగస్త్రం... నాగమ్మ nonsense ఏమిటి...."
"ఆ అందరూ నీలా పురుగులు, బొద్దింకలూ, తేళ్లు, జెఱ్రులు ఉండే programmes పొద్దున్న, రాత్రి, అన్నం తినేటప్పుడూ చూస్తారనుకున్నావా...." దీపక్ లోకేష్ ని ఎక్కిరించాడు।
"అబ్బ కాస్త ఈ అనవసర మాటలు ఆపి, అసలు విషయానికి వస్తారా...." నీలు గట్టిగా అంది।

అందరూ మళ్లి ఖాళీ స్థలంవైపు చూసారు। అక్కడ పామూ లేదు, ముంగీసా లేదు। "మనం చేసిన హడవుడికి అవికూడా జడిసి పారిపోయాయి" అంది గాయత్రి

"ముందుగా ఇక్కడ ఏమయినా నిధి వుండే సూచనలు కనిపిస్తాయేమో వెదకండి" అందరినీ పనికి పురమాయించింది గాయత్రి
అందరూ తలా ఓ దిక్కూ వెదుకుతున్నారు।
"ఇన్ని చెట్ల మధ్యలో ఈ ఖాళీ స్థలం ఎందుకుంద్దబ్బా.." ఆలోచించసాగాడు దీపక్
పక్కకి వచ్చిన మధుతో తన ఆలోచన చెప్పాడు।
"కింద ఏదయినా కట్టడం వుంటే, అది పూడుకుపోయి, దాని పయిన కొద్దిగా మట్టి ఉందేమో?" మధు అన్నాడు।
కొంచెం దూరంగా గాయత్రి దృష్టిని ఒక రాయి ఆకర్షించింది। అది ఆ ప్రదేశంలో ఉండే రాయిలా లేదు। ఎవరో తెచ్చి పెట్టినట్టుగా ఉంది। గాయత్రి అందరినీ పిలిచి చూపించింది। పైగా ఆ రాయి పైభాగం మాత్రమే కనిపిస్తొంది। అందరికీ ఆ రాయి వెంటే ఏదయినా దొరుకుతుందనే నమ్మకం కలిగింది। ఇప్పుడు ఆ రాయిని ఏదో విధంగా పైకితీయాలి
--------------------------------------------------------------------
అక్కడ మండపం దగ్గర ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, ఉత్సవం హడావుడి ఎప్పుడు సర్దుమణుగుతుందా అని ఎదురుచూస్తున్నారు।
గోపాల్ సెల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు॥॥
"ఏరా ఇంకేదయినా యిసయం తెలిందేంట్రా"
"లేదెహే, ఇంక నాకేటి పన్లేదనుకున్నావేటి.... అసలే రంగితో తగువయి అది బెట్టు చేస్తోంది। మధ్యలో నీ గోలేంటెహే"
"రంగితోటి తగువెందుకొచ్చింద్రా?"
"ఇదిగో ఈ ఫోన్ వల్లే। ఇదెక్కడదనడిగింది? నువ్విచ్చావని సెప్పాను। నమ్మలేదు। ఏక్కడో లేపుకొచ్చానని తగువెట్టుకుంది।"
"వార్ని, ఎవరికీ సూపించద్దన్నానా?"
"ఎళ్లెహే, రంగికి నేనేసుకున్నా మొల్తాడు కూడ తెసుస్తుంది। ఇది ఎలా దాచగలను।"
"సర్లే, అయ్యిందేదో అయ్యిందికాని... నేను రేపు రామాపురం మామిడి తాండ్రట్టుకొస్తాలే, నువ్వు దానికిచ్చి మచ్చిక చేస్కోవచ్చు।"
"నిజంగా తెస్తావా.."
"ఓరి బాబూ తెస్తాన్రా.. మరి యిసయం సెప్పు.. మన చినబాబు గారూ ఆళ్ల మంద ఎక్కడయినా కనపడ్డారేటి?"
"ఆ ఇందాకళ కనపడ్డారు। ఓ గంట క్రితం మనూరికి ఉత్తరంగా ముళ్ల చెట్ల అడివి ఉంది సూడు..."
"ఆ ఆ..."
"అటేపెళ్తూ కనిపించారు. అయినా ఆళ్ల మీద ఎందుకురా నీ కన్ను?"
"నీకు తరువాత సెప్తాన్లేరా। రేపు నీకు తాండ్ర అట్టుకొస్తా, మరుంటాను.."
ఫొను పెట్టేసాడు।

"వాళ్లు ఊరికి ఉత్తరంగా వున్న చిన్న అడివి వైపు వెళ్ళారట.." చెప్పాడు గోపలం।
"మరయితే ఇక్కడేం ఉన్నట్టు?" నర్సింగ్ గట్టిగా అన్నాడు
"ఏమో, అదే నాకు అర్థమవ్వట్లేదు।"
"ఇప్పుడిక్కడ మండపం లో వెదకడమా? వాళ్లని ఫాలో చేయడమా? తొందరగా తేల్చాలి, అసలే సాయంత్రం కూడా అయిపోతోంది" నర్సింగ్ ఎటు తేల్చుకోలేకపోతున్నాడు।
"ఖాన్ ని అడుగుతే?" సలహా పారేసాడు గోపాలం
"తొందరగా, తొందరగా" నర్సింగ్ కి ఆవేశం ఎక్కువవుతోంది।
గోపాలం ఖాన్ కి ఫోన్ కలిపాడు।

----------------------------------------------------------------
"తొందరగా తవ్వండి... చీకటి పడకుండా ఏదోఒకటి తేలిపోవాలి" తవ్వేకొద్ది ఆ రాయి ఏదో ముత లాగా కనపట్టంతో, ఉత్సాహంతో గాయత్రి అంటోంది॥॥
"ఏదయినా గునపంలాంటి, గట్టిదుంటే కొంచం తొందరగా పనవుతుంది।" చెమట తుడుచుకుంటూ దీపక్॥

4 Comments:

Blogger Vamsi Krishna said...

ఇలా ఐతే కథ ఎప్పటికీ అవ్వదు :-)

January 19, 2006 at 7:08 AM  
Blogger పవన్‌_Pavan said...

This comment has been removed by a blog administrator.

February 3, 2006 at 2:06 PM  
Blogger పవన్‌_Pavan said...

చాలా బాగుంది కానీ త్వరగా కథని కదిలించండి , లేకపోతే ప్రొడక్షన్‌లో లేట్ అయిన సినిమా లాగానో, తెలుగు సీరియల్స్ లాగానో కథ గ్రిప్ పోయి సాగుతుంది. :-)

February 3, 2006 at 2:10 PM  
Blogger simplyme said...

cool undi asalu..chala rojulaindi chadivi.. so updates anni chadivithe bhalega anipinchindi.
nagamma..vijay..madhu episode aithe too good :))

February 11, 2006 at 12:01 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home