Friday, May 27, 2005

Chapter 32

క్లూస్ అన్నీ కలిపి కాగితం పై రాశాడు విజయ్,


ధర ధరణిలొ ధరియించెను -- విలువైనది భూమిలో ఉంది
ధర మర్మము తెరిపించును - రహస్యం వల్ల అది బయటపడుతుంది
వేదములు ఎన్నుండును - నాలుగు ??
నరసింహుడు ఉదయించును - స్తంభం వల్ల బయట పడుతుంది ?
ధను రాశిని మెరిపించెను - ఈశాన్యం మూల
నిటలాక్షుడు జరిపించును - శివలింగం జరపాలి ?
ధర మర్మము కనిపించును - తర్కం వల్ల కనిపిస్తుంది


"ఇప్పటివరకు మనం అనుకున్నది సరైనదైతే, ఈశాన్యంలో ఉన్న శివలింగం జరపడం వల్ల ఏదైన బయట పడచ్చు !" చెప్పాడు విజయ్.
నెమ్మదిగా ఈశాన్యం మూలకి చేరుకున్నారంతా,పైకి చూశారు,స్తంభానికి పైన ఉన్న శివలింగాన్ని.
"పాతాళభైరవి సినిమాలోలా భూమి రెండుగా విడిపోతుందా ? మంటలూ, పొగలూ వస్తాయా ?" భయం భయంగా అడిగాడు దీపక్
"చూద్దాం" అంటూ దీపక్ భుజాల పైకి ఎక్కాడు లోకేష్.
ఒక్కసారి దేవుడిని తలచుకుని శివలింగాన్ని కదపడానికి ప్రయత్నించాడు.
ఎంతో బలంగా ఉంటుందనుకున్న శివలింగం చాల సునాయసంగా కదిలింది.
"హమ్మయ్య" అనుకున్నాడు లోకేష్।
చెవులు రిక్కించి,ఉత్కంఠగా చూస్తున్నారంతా!
                     *            *              *            *  

"హలో కృష్ణమూర్తి గారు..."
"ఎవరూ మాట్లాడేది ?"
"నేను జేపీకి కావల్సిన వాడిని"
"అయ్యా, తెలిసో తెలీకో తప్పులు చేశాను,ఇక నన్ను వదిలెయ్యండి!!"
"అది చెబుదామనే ఫోన్ చేసాను,ఆ రాతిమండపం మాకు ఇప్పించెయ్యి,అది అందరికీ మంచిది"
"ప్రయత్నిస్తాను, ఎవరికి ఇవ్వాలి ? "
"చెన్నై నించి ఒకతను వస్తాడు, జేపీ పేరు చెప్తాడు, అతనికి అందేలా చేయి, ఏం చెస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం!
సర్వే సాధు జనా సుఖినో భవంతు !" ఫోన్ కట్ అయ్యింది.
లోకేష్ తెచ్చిన కొత్త సెల్ ఫొన్ టేబిల్ మీద పెడుతూ అవతలి వ్యక్తి చాల సున్నితంగా మాట్లాడాడనుకున్నారు కృష్ణమూర్తి గారు.
cell లో display ఐన message గమనించలేదు,
"The conversation has been recorded by spycall."

                     *            *              *            *  

అనుకున్నట్టుగా ఏమీ జరగ లేదు,దాదాపు పదినిమిషాలు అన్ని పక్కలా అందరూ చూశారు,గమనించదగ్గ
మార్పు ఏమీ కనపడలేదు,
గాయత్రి మాట్లాడింది "చాలా సులువుగా శివలింగం తిరగడం బట్టి, మనం కరక్ట్ గానే అలోచించాం అనిపిస్తోంది"
విజయ్ అలోచిస్తున్నాడు " ఏమన్నా వదిలేశామా ?"
దీపక్ చెప్పాడు "అవును, మనం తెచ్చిన విందు భోజనాలని, నా ఆకలిని !"
"కాసేపు ఆపరా, నీ తిండి గోల" లోకేష్ అన్నాడు.
"కడుపులో ఎలుకలు పరిగెడుతున్నై" బాధగా అన్నాడు దీపక్.
"ఎన్నుంటాయేమిటి ,ఎలుకలు ?" వెటకారంగా అంది నీలు.
"నాలుగు ఉన్నై ఇప్పుడు, నలభై అవ్వచ్చు, కాసేపాగితే ! " నెమ్మదిగా అన్నాడు దీపక్.
"హే, మనం వేదములు యెన్నుండును అన్న క్లూని వదిలేశాం,నాలుగు అది", కాగితం మీద నాలుగు చూస్తూ అన్నాడు విజయ్!
"కాని నాలుగు ఏం కావచ్చు ? నాలుగో తారీకున తిప్పాలా ? నాలుగో జామున తిప్పాలా ? నలుగురు తిప్పాలా ? ఏం చెయ్యాలి ?" మధు అన్నాడు !
"అయ్యో! మీరు ఎక్కువ అలోచిస్తున్నారు, నాలుగు సార్లు తిప్పండి", కళ్ళు తిప్పుతూ అంది సీత.
"కరెక్ట్" అందరూ ఒకేసారి అన్నారు !

చకా చకా పైకి ఎక్కి 3 సార్లు శివలింగాన్ని తిప్పాడు లోకేష్,
ఏ మాత్రం హడావిడి లేకుండా, స్తంభం కింద చిన్న తలుపు తెరుచుకుంది, రాగి పలక కనిపించింది, దాని మీద ఇలా రాసి ఉంది.

"మంత్రాలమర్రికి ఈశాన్యంగా తలకాయలో రావిచెట్టు, దానికి అగ్నేయంగా కాలయములో చింత చెట్టు,
దానికి సరసన తూర్పుగా, మరల ఉత్తరంగా"

ఇదేదో పిశాచాల భాషలా కనపడింది, "తలకాయలో రావిచెట్టు అంటాడేమిటి నా తలకాయ" వెంటనే అనేశాడు దీపక్,
'"కాలయములో చింత చెట్టు" అంటే ఏమిటి బావా ' అడిగింది సీత,
"అంటే మిగతా అంతా నీకు అర్థం అయ్యిందా ? "
"ఉండు, దీని కింద ఏదో చిత్రమైన రాత కనిపిస్తోంది" పరిశీలనగా చూసిన గాయత్రి అంది,



"ఇదేదో భాగాహారంలా ఉంది, ఒక ఐదు అంకెల సంఖ్యను రెండు అంకెల సంఖ్యతో భాగిస్తే , మూడు అంకెల సంఖ్య వచ్చిందని అర్థం అవుతోంది" చాలా సులువుగా వివరించాడు మధు.
"అంటే మనం ఈ division satisfy చేసే numbers కనిపెడితే చాలు" నవ్వుతూ అన్నాడు విజయ్.
"అవును, ఇంకెందుకు ఆలస్యం ? మొదలు పెట్టండి" అన్నాడు లోకేష్,
[ఇంకెందుకు ఆలస్యం ? మొదలు పెట్టండి, మీరు కూడా !! ]

సశేషం - కళ్యాణ్ ,కాకినాడ
Credits & Copyrights : The puzzle has been taken from the book "మెదడుకి పదును" written by Dr.Mahidara Nalini Mohan.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home