Saturday, May 28, 2005

Chapter 31

అందరూ ఉత్తరం వైపున ఉన్న స్తంభం దగ్గరకు చేరారు.
"ఓకే, ఇక్కడ 1000 బొమ్మలు ఉన్నాయి. మిగతా వాటికన్నా వేరుగా ఉన్నవాటి కోసం చూద్దాం."
"సరే విజయ్, నేను ఇటు సైడ్ ఉన్నవి చూస్తాను", అంటూ గాయత్రి స్తంభం వెనక్కి వెళ్లింది.
దీపక్ కూడా అదృశ్యమయ్యాడు.
స్తంభానికి ఉన్న ఎనిమిది వైపుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కరు తీసుకుని జాగ్రత్తగా చూడసాగారు.
పది నిముషాలు గడిచాయి.
అందరూ నేలమీద పడుకుని కింది వరుసలో ఉన్న ఆఖరి బొమ్మలు చూస్తున్నారు.

"నా వైపు చెప్పుకోదగ్గ చిత్రమేమీ కనపడలేదు"
"ఇక్కడ కూడా అంతే మధూ", నీలూ లేచి నిల్చుంది.
"నీకేమన్నా దొరికిందా లోకేష్?"
"లేదు విజయ్"
వాళ్ల స్తంభాల్ని ముందే పూర్తి చేసిన దీపక్, సీత, గాయత్రి మిగిలిన ఎనిమిదో స్తంభాన్ని చూడటం కూడా పూర్తిచేశారు.
"ఏమీ లేదన్న మాట", నీలూ చతికిలపడింది.

/********************************/

"క్లూ ప్రకారం ఇదేనే", లోకేష్ ఆలోచించటం మొదలుపెట్టాడు.
"ఇంకోసారి చదివొద్దామా", సీత సజెషన్ అందరికీ నచ్చింది.

అక్కడికి వెళ్లి పద్యాన్ని మళ్లీ మనసులో చదువుకున్నారు ఏడుగురూ.
"వేదాలూ, స్తంభాలూ, లింగాలూ ఓకే గానీ మధూ, మరి నక్షత్రాలు సరిగ్గానే చెప్పావా?"
"సరిగానే చెప్పుంటాడులే విజయ్, ఏం మధూ?", నీలూ అందుకుంది.
"రేయ్, 2015 లో జరగబోయే నా రెండో పెళ్లి మీద ఆన, నక్షత్రాల విషయం లో డౌటే లేదు. వేదాలేమన్నా తప్పు లెక్కెట్టారేమో, అసలే భారతాన్ని పంచమవేదం అంటారు"
"అడ్డంగా ఆలోచించటం అంటే ఏమిటని అడిగావుగా, ఇదే నీలూ", విజయ్ నీలూని కదిపాడు.
"నేను Lateral Thinking అంటే ఏమిటని అడిగాను."
"అదే కదా, అడ్డంగా ఆలోచించటం గురించి వేరొకర్ని అడిగే ఖర్మ నీలూకి ఏమిటా అని ఒక్క క్షణం కంగారు పడ్డాను"
"ఖలుడికి ఒళ్లంతా విషమే అని పెద్దలు పద్యాలు రాసేటప్పుడు నువ్వా చుట్టుపక్కలే ఉండుంటావు బావా నీ పూర్వజన్మలో", సీత నీలూని ఓదార్చింది.

"మధూ, ఆ నక్షత్రాల పేర్లు ఒకసారి చెప్పు", విజయ్ కి ఒక అనుమానమొచ్చింది.
"మూల, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ"
"ఒక విషయం అయ్యుండొచ్చు. 'పూర్వం' అంటే తూర్పు అని ఒక అర్థం ఉంది. మనం వెతకాల్సింది తూర్పు + ఉత్తరం లో ఉండే మూలలోనేమో?"
"ఈశాన్యం! కూల్ రా! అక్కడ వెతుకుదాం పదండి."

/***************************/

1 Comments:

Blogger simplyme said...

Eesanyam....whoa...

September 28, 2005 at 6:28 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home