Thursday, June 30, 2005

Chapter 25

మధు, విజయ్ మిద్దె పైకి వెళ్ళారు। అప్పటికే అక్కడ లోకేష్, దీపక్ ఉన్నారు। వీళ్ల వెంబడే ప్రభాకరం, శశికళ కూడా పైకి చేరారు। సూర్యం ఓ పక్కగా ఏదో అలోచనలో నిమగ్నమయ్యున్నాడు। అందరి చూపులూ మిద్దె పైనున్న అందరినీ ఒక్కక్కరిగా పరికించాయి। కొందరి చూపులో అయోమయం, కొందరి చూపులో జాలి, కొందరి చూపులో బాధ, కొందరి చూపులో బెదురు, కొందరి చూపులో తప్పుచేశామన్న వేదన॥॥ ఎవ్వరికీ ఏమిటీ అర్థం కావటం లేదు। అసలు అక్కడ ఎందుకు చేరారో, ఎవరు రమ్మన్నారో కూడా తెలియదు। అందరినీ అక్కడికి రమ్మని చెప్పింది మాత్రం సీత। ఇంతలో సీత చలాకీగా మధ్యలో కి వచ్చింది। చేతిలోని వార్తా పత్రికని గట్టిగా చదవటం మొదలెట్టింది। హెడ్ లైన్స్ కింద ఏదో రోడ్డు ప్రమాదం గురించిన వార్త ఉంది।

"నిన్న అర్థ రాత్రి ఒంటిగంటన్నరకు రాజమండ్రి నుంచి ఊలపల్లి వచ్చేదారిలో ఒక జీపుని, ఇసుక లారీ ఢీకొని ఘోర ప్రమాదం సంభవించింది। జీపు పూర్తిగా దెబ్బతింది। ప్రమాదంలో ఒక ప్రాణ నష్టం జరిగింది। మిగిలినవారు కొన ఊపిరితో రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు। చనిపోయిన వ్యక్తి, పలు చీటింగ్ కేసులలో నిందితుడు, real estate మాఫియా లీడర్ గా చెలామణి అవుతున్న "జెలగలపూడి పిచ్చయ్య" అలియాస్ "జెపి" అని తెలిసింది"


ఇంతలో కృష్ణమూర్తి గారు పెద్ద పెద్ద అడుగులతో అందరి మధ్యకీ వచ్చాడు। ఆయన ముఖంలో అదో తెలియని భావం కనిపించింది। పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, ఏదో పెద్ద బరువుని దింపుతున్నట్టుగా ఆయన మాట్లాడ్డం మొదలెట్టారు


"మీ అందరికీ ఇవాళ నేనో విషయం చెప్పాలి। గత కొన్ని రోజులుగా మీరందరూ గురైన మనోవేదనకు ముఖ్య కారకుడిని నేనే !!!!!"


అందరి ముఖాల్లో ఆశ్చర్యం॥॥। ఆ వెంటనే అది కోపంగా మారబోతోంది। ఆయన మాటలు ముందుకు సాగాయి।

"అయితే, ఎన్నో రోజులుగా నేను కూడా ఇంతకన్నా ఎక్కువగా రగిలిపోయాను। అది ఒక విధంగా స్వయంగా కొని తెచ్చుకున్నదే। ఇందాక సీత చదివిన వార్తతో దీనికి సంబంధం ఉంది। చనిపోయిన ఆ జెపి చేతిలో నేను నరకయాతనకు గురయ్యాను। నేను రెండేళ్ల క్రితం చేసిన ఒక తప్పుకి తగిన ఫలం అనుభవించాను। నా ఆసుపత్రి విషయంలో స్వార్థం కోసం, డబ్బు కోసం శరీర అవయవాల వ్యాపారం చేశాను। మా ఆసుపత్రి ఉన్న స్థలానికి సరైన కాయితాలు లేకపోతే, వాటిని కప్పిపుచ్చటానికి జెపి ని ఆశ్రయించాను। ఆ సమస్య గట్టెక్కినా, నా వ్యాపారంలో వస్తున్న డబ్బు చూసి, జెపి నన్ను black mail చేయడం మొదలుపెట్టాడు। వాడి కన్ను మనూరిలోని రాతిస్తంభం ఆ చుట్టు పక్కల స్థలాల మీద పడింది। ఇక్కడ మొన్న తవ్వకాలలో బయట పడిన కొన్ని పురాతన వస్తువులే దానికి కారణం। వాటిని ఇతరదేశాలలో అమ్మి చాలా డబ్బు చేసుకుందామని, ఆ స్థలాలు చాలా మట్టుకు ప్రభాకరం గారి కుటుంబం ఆస్తి అని తెలుసుకుని, నా చేత ఇంత నాటకం ఆడించాడు। ఇది ఇంతవరకూ రావడం నా తప్పే। అయితే ఇప్పుడు వాడి పీడ విరగడయ్యింది। నీలూకి ఏ జబ్బూ లేదు। మా వాడు అమెరికా నుంచి రావడం కూడా నా మూలంగానే। అయితే, ఈ దీపక్ సంగతి మాత్రం నాకు తెలియదు। " అని భోరుమన్నాడు కృష్ణమూర్తి।


అందరికీ ఇప్పుడిప్పుడే పరిస్థితి కొద్ది కొద్దిగా అర్థమవుతోంది। లోకేష్ అందుకుని,"మా నాన్న నీలుకి dementia అని చెప్పినప్పుడే నేను ఏదో తేడా ఉందని గ్రహించి, దీపక్ తో ఇక్కడికి వచ్చి ఈ పెళ్లి హడావుడి చేశాను। ఇందులో మీ మనసుల్ని కష్ట పెట్టుంటే క్షమించండి"।


"అవును, లోకేష్ నాతో, ఏదో తిరకాసు ఉంది, కాస్త సహకరించమంటే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను" అని లోకేష్ ని సమర్ధించింది నీలు।

విజయ్ ఒక్కసారి "హమ్మయ్య" అనుకున్నాడు।

శశికళ "నా కూతురే దొరికిందా ఈ నాటకాలకి, ఇప్పుడు దానికి పెళ్లెలా అవుతుంది?" అన్నారు ఆవేదనగా॥॥॥।


"నువ్వూరుకోవే, మనమ్మాయికి ఏ రోగం లేదని, గండం గడిచిందని ఆనందించక, పెళ్ళో అని మళ్లీ ఆ ఏడుపు మొదలెట్టకు॥॥॥" ప్రభాకరం ఓదార్చారు।


"అమ్మా॥॥॥। మళ్లీ పెళ్లి మాటేమిటే, ఇంకో సంవత్సరం దాకా అసలా మాటే ఎత్తొద్దు నాతోటి" అని మెట్లు దిగి వెళ్లి పోయింది నీలు।


విజయ్, మధు ఒకరినొకరు చూసుకున్నారు।
లోకేశ్, దీపక్ కూడా ఒకరినొకరు చూసుకున్నారు।


(శ్రీహర్ష , 17/08/05, సశేషం)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home