Monday, July 11, 2005

Chapter 13

" సూర్యం గారూ , మీ అన్నయ్య గారికి కబురు చేశారా! ఎన్నింటికి వస్తున్నారు.."
" చేశానండి , ముందు కబురు చేయకూడదు అని అనుకున్నాను. కానీ అమ్మాయి పెళ్ళి సంబంధం గురించి కూడా మాట్లాడాల్సి వుండటంతో కబురు చేయాల్సి వచ్చింది. ఇంతకీ మా నీలు కోలుకోవటానికి ఎన్నాళ్ళు పట్టచ్చు డాక్టరు గారూ"
" నీలుకి పెళ్ళా!!!... నేను కూడా దాని గురించే మాట్లాడదామని అనుకున్నాను. ఎందుకంటే నీలు ఆరోగ్యము గురించి కొన్ని విషయాలు మీకు తెలియాలి.."
" ఏమిటండీ మీరనేది .... నీలు ఆరోగ్యానికి ఇప్పుడు ఏమైందని .....ఏమన్నా serious కాదు కదా", ఆందోళనగా అడిగారు సుర్యం.
" నిన్న పిడుగు పడినప్పుడు షాకు బాగా తగిలింది నీలుకి. దీని వల్ల Dementia వచ్చే అవకాశము చాలా ఎక్కువ.....ఇది కేవలము నా అనుమానము మాత్రమే అనుకోండి...కాని నా అనుమానమే నిజమైతే అమ్మాయి పెళ్ళి విషయములో కొంచెము ఆలోచించి నిర్ణయము తీసుకోవటము మంచిది అని నా అభిప్రాయము. "
"Dementia నా ,, ...అంటే ఏమిటి డాక్టరు గారూ "
" పిడుగు పడటము వల్ల అమ్మాయి మెదడు లో కొన్ని కణాలు దెబ్బతిన్నాయి. మన అదృష్టము బావుండటము వల్ల అవి కొద్దిగానే పాడై వుంటాయి.. అమ్మాయి మనల్ని గుర్తించింది కాబట్టి పెద్ద ప్రమాదమేమీ జరగనట్టే . ఈ Dementia వల్ల ఇబ్బందులు ఏమీ వుండవు గానీ కొంచెము మతిమరపు, ఏదైనా నేర్చుకొనేటప్పుడు ఏకాగ్రత కొరవడటము లాంటివి జరగవచ్చు. ప్రస్తుతము దీనికి మన దేశము లో నయము చేయగల డాక్టరు ఎవరూ లేరు "
" అవునా ఈ మాయదారి రోగము మా అమ్మాయికే రావాలా!! ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. మా చిట్టి తల్లికి నయమవ్వాలంటే , ఏ దేశానికి అయినా వెళ్తాము. చెప్పండి డాక్టరు గారు.."
" చూడండి సుర్యం గారు.. మీ బాధని అర్థము చేసుకోగలను , కానీ నేను డాక్టర్ని మాత్రమే.. . నీలు అంటే మీకు , మీ అన్నయ్య గారి కి ఎంత ఇష్టమో నాకు తెలియంది కాదు.. ఈ వ్యాధి వైద్యము కోసము అమెరికాలో ఒక ఇంస్టిట్యూట్ వారు రిసెర్చు చేస్తున్నారని ఎక్కడో చదివాను.. వాళ్ళు చెప్పటము ప్రకారము దీనిని 5 నుండి 10 సంవత్సరాలలో పూర్తి గా తగ్గించ వచ్చట. పెద్దగా ఖర్చేమి వుండదు. పైగా రిసెర్చు కాబట్టి వీసా కూడా తేలికే. కాకపోతే, ఓపిక ఎక్కువ అవసరమైన వైద్యము ఇది. ఎటూ, మీ అమ్మాయికి సంబంధము చూస్తున్నారు కాబట్టి , ఒక మంచి అమెరికా అబ్బాయిని చూడండి. స్వామి కార్యము , స్వకార్యము కలసి వస్తాయి... సలక్షణమైన పిల్ల , ఎవరు చేసుకోరు..? చెప్పండి...? పైగా ఈ కాలము అమ్మాయిలు మన వాళ్ళ కంటే అమెరికా సంబంధము చేసుకోవటానికే ఎక్కువ ఇష్ట పడతారు లేండి.."

" మీరు చెప్పింది నిజమే కానీ,,,,,"......... " మన వేంకట్రామయ్య గారు తెలుసు కదా , ఆయనతో నిన్న సాయంత్రమే, సంబంధం గురించి మాట్లాడాను .. వాళ్ళ మనమడు మధుకి అడిగాము..ఆయన కూడా ఒప్పు కున్నట్లు గానే అన్నారు.. ఇదిగో ఈ వర్షం ఇంత గొడవ చెయ్యకపోతే మా అన్నయ్య వాళ్ళని పెళ్ళిమాటలకే పిలిపించే వాడిని..ఇప్పుడేమో ఇలా అయ్యింది .. మనము ఊహించినవి అన్నీ సరిగ్గా జరుగుతాయా చెప్పండి!...."
" ఏది ఏమైనా బాగా ఆలోచించి నిర్ణయము తీసుకోండి. అమ్మాయి ఆరోగ్యము కూడా ముఖ్యము కదా" డాక్టరు గారు లేస్తూ అనటంతో, సూర్యం డాక్టరు గారి పెట్టె తీసుకొని " నేను మీతో వస్తాను వుండండి రచ్చబండ దగ్గరకి.. మా అన్నయ్య , వదిన వచ్చే వేళ అయ్యింది..కాస్త మీరు కూడా వాళ్ళకి నాలుగు ముక్కలు ధైర్యము చెప్తే కుదుటపడతారు.. పదండి నడుస్తూ మాట్లాడుకుందాము.. "

" మా ప్రభాకరం అన్నయ్యకి అమెరికా సంబంధాలు అసలు ఇష్టం లేదు డాక్టరు గారు.. నాకు కూడా లేదనుకోండి . మా రెండు కుటుంబాలకి ఒక్కతే నలుసు... నీలు అమెరికా వెళితే మేము ఇక్కడ వుండలేమనుకోండి.. . ఇప్పుడీ పరిస్థితుల్లో, మావాడు దాని అనారోగ్యము గురించి తెలిస్తే తట్టుకోలేడు ...ఏమి చెయ్యాలో అర్ధం కావటం లేదు డాక్టరు గారూ .."

' ఆడపిల్ల అంటే "ఆడ" పిల్ల .. ఎప్పటికైనా పంపవలసినదే కదా. అమెరికా అయితే కాస్త బావుంటుంది ..ఆలోచించండి. కాకపోతే కట్నము కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చు .. "
" మా అమ్మాయిని కట్నం తీసుకొనే వాళ్ళకి ఇవ్వమండీ." అంత బాధలోనూ కోపం కనిపించింది సూర్యం మొహం లో
" ఈ రోజుల్లో కట్నము తీసుకోని సంబంధము అంటే కాస్త కష్టమేమో"
" చదువుకున్న మీరు కూడా అలా అంటే ఎలాగండీ డాక్టరు గారూ " సూర్యం మాటలు తూటాల్లా తగిలాయి డాక్టరు గారికి ..

( వంశీ - విజయవాడ - 04/Jul/05)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home