Saturday, July 09, 2005

Chapter 15


"అవునా, ఈ సంగతి నేను గమనించలేదే? పరవాలేదులే బాబూ, కొంచెం ఆలస్యంగానైనా విషయం తెలిసినందుకు
సంతోషం. కానీ వాళ్లిద్దరూ దీని గురించి మాట్లాడుకోలేదన్నావు కాబట్టి నేనూ సూర్యంతో ఇప్పుడే ఏమీ అనను. నీలూ
తల్లిదండ్రులు వచ్చేవరకూ దాటవేద్దాం. నువ్వు వీలైతే విజయ్ ని ఒకసారి కదిలించి చూడు."
"నిజమే తాతయ్యా, ఇంకా అడగకుండా ఉండడం మంచిది కాదు. నేను తప్పకుండా విజయ్ తో మాట్లాడుతాను."

* * * * * * * * * * *

"మీరేమీ భయపడకండన్నయ్యా, నీలూ కోలుకుంది", శశికళ దగ్గరనుంచి సూట్ కేసు తీసుకుంటూ చెప్పాడు
సూర్యం.
"త్వరగా వెళ్దాం పదరా", అంటూ బస్సుదిగి, వడివడిగా బయలుదేరాడు ప్రభాకరం.

మూడు నిముషాల్లో ఇల్లు చేరారు ముగ్గురూ.

"డాక్టరు గారూ, మా అన్నయ్య ప్రభాకరం..."
"నమస్కారమండీ, నీలూకేమీ ప్రమాదం లేదుకదా?"
"భయపడకమ్మా, నీలూకు ప్రాణప్రమాదమైతే తప్పింది. అంతవరకూ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ,
సూర్యంగారికి మీకు చెప్పే సమయం ఉండిందో లేదో నాకు తెలియదు కాబట్టి నేనే చెప్తాను, ఆమెకి తర్వాత్తర్వాత కొన్ని
చిన్న చిన్న మానసిక సమస్యలు కలిగే అవకాశముంది. నథింగ్ సీరీయస్ లెండి. ఈ సంగతి సరిగా తెలియాలంటే
హైదరాబాదు లాంటి చోట్ల కానీ టెస్ట్లు కుదరవు. ఒకవేళ నిజంగానే అవకాశముంటే మాత్రం నాకు తెలిసి మనదేశం లో
చికిత్సలేదు. అమెరికా వెళ్లాలి"
"ప్రాణప్రమాదం లేదన్నారు. అది చాలు. డాక్టరుగారూ, ఈ వ్యాధి గురించి మీరు దయచేసి ఇంకొన్ని వివరాలు
కనుక్కుని చెప్పగలరా? మీకు రుణపడి ఉంటాను."
"తప్పకుండానండీ. కానీ, ఇదసలు మీరనుకునేంత, మీరనుకునేలాంటి 'వ్యాధి' కాదండీ. హైదరాబాదులో,
చెన్నైలో నా స్నేహితులున్నారు. వాళ్లతో మాట్లాడి సాయంత్రమే మిమ్మల్ని కలుస్తాను. మీరు ధైర్యంగా ఉండండి."

* * * * * * * * * * *

"రేయ్, అక్కడ ఏర్పాట్లు జరగబోతున్నాయి. నువ్వు కొంచెం మూవ్ మెంట్ చూపించకపోతే కష్టం"
"ఏమేర్పాట్లు మధూ?"
"నాకూ నీలూకీ పెళ్లంట"
"ఒక్క నిముషం", మందుల ఇన్ఫర్మేషన్ షీట్లు చదవటం ఆపి, కిందపెట్టి, మధుని చూశాడు విజయ్, "ఇంకోసారి
చెప్పు?"
"అవున్రా"
"సంగతేంటి క్లియర్ గా?"
"పెద్దదేమీ కాదులే, సూర్యం వాళ్లు నిన్ననే మా తాతయ్యని అడిగారంట. మనమీ ఊర్లో కొంచెం ఫేమస్ అని ముందే చెప్పాను కదా. సగం ఇలాంటి ప్రాబ్లమ్సుంటాయనే నేనిక్కడికి రాననుకో. ఊర్లో ప్రతి అమ్మాయీ..."
"విషయం చెప్పుబాబూ"
"వస్తున్నా. నాతో ఇందాకే తాతయ్య మాట్లాడారు. నాకొక్కటి సరిగ్గా చెప్పు. నీ సంగతేంటి? నువ్వూ నీలూ మంచి
జోడీ అని తాతయ్యతో చెప్పేశాను. నాకు వేరే సెటప్పులున్నాయని చెప్తామనుకుంటున్నాను సూర్యంగారితో."
"నేనొకసారి నీలూతో మాట్లాడాలి. ఎలా కుదురుతుందంటావ్? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా"
"నువ్వదేమన్నా కష్టమనుకుంటున్నావేమోగానీ, actual గా కాదు. చూడు కావాలంటే. సీతా..."
"ఏంటి బావా, తిండి కావాలా?", కింది నుంచి అరిచింది సీత.
"దీనికి రోజురోజుకీ లోకజ్ఞానం ఎక్కువౌతోంది. అదేం లేదుగానీ ఇలారా"
"త్వరగా చెప్పు, మేమంతా గుడికి వెళ్తున్నాము సూర్యం వాళ్లతో", వేగంగా మెట్లు ఎక్కుతూ వచ్చింది.
"వాళ్లందరూ వెళ్తున్నారా? ఇంట్లో ఎవరుంటున్నారు నీలూతో?"
"వాళ్ల బామ్మ, అయినా నీకెందుకు?"
"ప్రశ్నలడక్కు, పది నిముషాలు టైమిస్తున్నా, నువ్వక్కడుంటానని చెప్పి ఆమెను వాళ్లతో గుడికి పంపించాలి. నీకు తగిన మొత్తం సమర్పిస్తాలే"
"తుచ్ఛమైన డబ్బు కోసం..."
"నా బ్లూ సూట్ కేసులో సోనీ సీడీ ప్లేయ..."
"ఐదు నిమిషాలు చాలు. ప్లేయర్ మధ్యాహ్నం కలెక్ట్ చేసుకుంటా. బై."
"లోకజ్ఞానముంది, నిజమే", అన్నాడు విజయ్, పరుగుతీస్తున్న సీతని చూసి.

విజయ్ - తిరుపతి - 7/July/2005 - సశేషం

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home