Thursday, July 14, 2005

Chapter 10

రాతి మండపం దగ్గరికి వెళ్ళడం మంచిదయ్యింది.

అప్పటి వరకూ వాళ్ళు నించొని ఉన్న చెట్టు కూలిపోయింది.అక్కడే ఉంటే ఏం జరిగేదో ఊహించడానికే వణికి పొయాడు మధు.
ఊరవతల పడిన పిడుగుకు ఊరంతా వణికి పోయింది. భోరున కురుస్తోంది వాన , అరగంటకే ఊర్లో లోతట్టు ప్రాంతాలు మోకాలి లోతు వరకూ మునిగి పోయాయి.గాలి ఉద్ధృతం క్షణక్షణానికీ పెరుగుతూ ఉంది.
ఇవి చాలవన్నట్లు వడగళ్ళు. ఉన్న చోటు నించి ఎటూ కదలకుండా చేశాయి.

వెనక్కి తిరిగి చూశాడు విజయ్, చిన్న వినాయకుని విగ్రహం. ఎవరికీ ఏ ఆపదా రాకూడదు అని కోరుకున్నాడు, గుడికి వెళ్లి , దేవుడిని ఏమన్నా కోరుకుని చాలా రోజులయ్యింది అనిపించింది.గుండె కొట్టుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎడమ కన్ను అదురుతోంది,అది కీడు శంకిస్తోందా, మేలు చూపిస్తోందా, తెలీదు.

"ఈ వడగళ్ళ వాన చాలా ప్రమాదకరం, మనం ఇక్కడే కాసేపు ఉండడం శ్రేయస్కరం." పంచె సరిచేసుకుంటూ అన్నాడు మధు.
"మనవాళ్ళంతా క్షేమంగా ఉన్నారంటావా?"
"భయపడకు , ఏమీ జరగదు."
"తాతయ్యగారు, బామ్మ గారు, సీత ..."
"ఏం కాదురా , tension పడకు."
"నీలు ..."
"ఒక మనిషి పక్కన లేనప్పుడే , వాళ్ళెంత కావాలో తెలుస్తుంది." అంత వాన లోనూ వేదాంతం మాట్లాడాడు మధు.
"అవున్రా" గాల్లోకి చూస్తూ అన్నాడు విజయ్.
"నీ కళ్ళలో ఆమె పై అభిమానం ఎప్పుడో గమనించా."

ఎదురుగాలికి కొన్ని వడగళ్ళు మండపం లోకి వచ్చి పడ్డాయి, ఒకటి సూటిగా మధు నుదిటి మీద పడింది.
"అబ్బా..." బాధతో గట్టిగా అరిచాడు మధు.
ఇద్దరూ కాస్త లోపలికి వచ్చారు,వడగళ్ళు ఇంత గట్టిగా తగులుతాయని అనుకోలేదు విజయ్.
కారుతున్న రక్తం ఆపడానికి జేబురుమాలు అడ్డు పెట్టాడు విజయ్.

అరగంట అలానే ఏం మాట్లాడకుండా కూర్చున్నారు,వర్షం సద్దుమణిగింది.
కరంటు రాలేదు, ఊరంతా చీకటిగానే ఉంది. నెమ్మదిగా రోడ్డు మీదకి వచ్చారు ఇద్దరూ.

"బానే ఉన్నారుకదా నాన్నా మీరు ?" పరిగెత్తుకుంటూ వచ్చింది మంగమ్మ గారు.
"బానే ఉన్నాం బామ్మ గారు, తాతయ్య గారు ఏరి ?" అడిగాడు విజయ్ .
"ఇదిగో ఇప్పుడే సీతను తీసుకుని ఇంటికి వెళ్లారు."

ఇంతలో సూర్యం కంగారుగా వచ్చి బామ్మ గారిని అడిగాడు.
"మా నీలు ని చూశారా మంగమ్మ గారూ? నీలు కనపడడం లేదండీ... " వస్తున్న దుఃఖం ఆపుకోలేకపోయాడు సూర్యం.

(కళ్యాణ్ - కాకినాడ - 6/19/5 - సశేషం)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home