Wednesday, July 13, 2005

Chapter 11

"అయ్యో, లేదండీ, వర్షం వల్ల నాట్యం కుదరదని వాళ్లు మాట్లాడుకోవటం విన్నాను అంతే"
"నేనూ, విజయ్ ఇప్పుడే ఇంటి నుండి వస్తున్నామండీ, మాకూ కనపడలేదు"

"!!!అమ్మగోరూ!!!"
గోపాలుడు ఆయాసంతో పరుగులు తీస్తూ వచ్చాడు, "నీలమ్మ పైన పిడుగు పడ్డాదమ్మా!!!"

సూర్యం అవాక్కయ్యాడు.
మధు వాడిని నిలదీశాడు, "ఎక్కడ పడిందిరా? నీలూ ఎలా ఉంది?"
"నీలమ్మ సంగతి తెలీదు బాబూ, ఊపిరి లేదంట, ఈడ్నేకోనేటి తోటలో ఉండారు"
"సూర్యం గారూ, ఈ ఊర్లో డాక్టరెవరన్నా ఉంటే గోపాలుడిని పంపి తీసుకురమ్మనండి. విజయ్, మనమా తోటకి వెళ్దాం పద"

సూర్యం తేరుకున్నాడు, "అయ్యో, ఊలపల్లిలో ఎవరూ లేరే? భగవంతుడా!"
"సూర్యం గారూ, అనర్థం జరక్కపోయుంటే అవసరమే రాకపోవచ్చు.పిడుగు పడి రెండు నిముషాలు కూడా కాలేదు కాబట్టి ఇంకా సమయం ఉంది. మేమేదైనా ప్రథమ చికిత్స చేయటానికి కుదురుతుందేమో చూస్తాం. ఎందుకన్నా మంచిది, పోలవరం నుంచైనా డాక్టర్ని పిలిపించే ప్రయత్నం చేయండి. పద మధూ"

మధు, విజయ్ లు తోట చేరుకునేసరికి జనం గుమిగూడి ఉన్నారు.
"తప్పుకోండి, తప్పుకోండి, కొంచెం గాలి ఆడనివ్వండి", అంటూ ఇద్దరూ గుంపు మధ్యకి చేరారు.

చుట్టూ జనం ఉన్నా, నీలూ దగ్గరగా ఎవ్వరూ ఎందుకు లేరో నీలూని ఒకసారి చూడగానే వారికర్థమైంది. స్పృహతప్పి, చలనం లేకుండా, ఊపిరి ఆగిపోయి, ఒక పక్కగా పడిపోయి ఉంది నీలూ. సరిగ్గా తన పైన్నే మెరుపు పడ్డట్టుంది, ఆ విద్యుత్తు వల్ల ఆమె నాట్యం దుస్తులన్నీ పీలికలైపోయి ఉన్నాయి. అదీగాక, తనని తాకితే షాక్ కొడుతుందేమోనన్న అనుమానం కూడా వారి భయానికి కారణం అయ్యుండొచ్చు.

"విజయ్, నీకు CPR గుర్తుందా?"

నీలూని మెల్లగా వెల్లకిలా పడుకోబెట్టాడు విజయ్.
"ఇందాకటి నుండీ గుర్తుచేసుకుంటూనే ఉన్నాను మధూ. ఆ వెనుకగా కూర్చొని నీలు తల ఎత్తి, మెడ కొంచెం వెనక్కి ఉండేలా ఇలా పట్టుకో "
"కార్డియాక్ అరెస్ట్ అయిందా?"
"గుండె బాగానే కొట్టుకుంటోంది. ఒకవేళ అరెస్టయినా రికవరైనట్లుంది. గాలిమాత్రం ఆడటంలేదు. ఉండు..."

విజయ్ నీలూ మొహాన్ని దగ్గరకు తీసుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచించి, గట్టిగా గాలి పీల్చి, నీలూ ముక్కు మూసిపట్టాడు. నీలూ నోటిని తన నోటితో సీల్ చేసి రెస్క్యూ బ్రీథింగ్ మొదలుపెట్టాడు. రెండు, మూడుసార్లు అలా చేసిన తర్వాత నీలూలో చలనం కనిపించింది. తనంతట తానే ఊపిరి తీసుకోసాగింది. మెల్లగా కళ్లు తెరిచింది.

"ఏమీ కాలేదు లెండి. నెమ్మదిగా కూర్చోండి. పడినప్పుడు దెబ్బలేమీ తగల్లేదు కదా"
"థాంక్సండీ, చనిపోతాననుకున్నాను"
"అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగితే ఇంకేముంది నీలూ, బాగానే ఉంది కదా ఇప్పుడు? లేవగలవా?"
"థాంక్స్ మధూ, ఎలా ఉన్నానో ఇంకా నాకే తెలియడం లేదు"
"వద్దు వద్దు, డాక్టరు వచ్చేవరకూ మీరు ఎక్కువ కదలకుండా ఉంటే మంచిదండీ"
"ఆయన పోలవరం నుంచి వచ్చేసరికి ఇంకో అరగంటైనా పడుతుందిరా"
"అయితే ఈలోపు జాగ్రత్తగా గుడి మండపానికైనా చేరుద్దాం. అక్కడ కనీసం పొడిగానైనా ఉంటుంది"
"సరే, నేను సూర్యంగారికి, తాతయ్యకి విషయం చెప్పివస్తాను మరి. మండపానికి దారి గుర్తుందిగా? కాస్త సాయపడండయ్యా వాళ్లకి", ఊరివైపు బయలుదేరాడు మధు.

(విజయ్ - తిరుపతి - 6/26/5 - సశేషం)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home