Monday, July 18, 2005

Chapter 6

ఊలపల్లిలో వేంకట్రామయ్య గారు రచ్చబండ వద్ద పచార్లు చేస్తున్నారు. పన్నెండింటికల్లా రావల్సిన బస్సు వచ్చే సూచనలు కనబడటం లేదు.

"ఏమయ్యా సూర్యం, నువ్వు కూడా బస్సు కోసమేనా?"
"అవునండీ, మా అమ్మగారు మా పెద్దన్నయ్యగారి అమ్మాయిని తీసుకువస్తున్నారు సెలవలకని"
"నీలాంబరే కదా? లక్షణమైన పిల్ల. ఈ ఊరంటే ఎంత ఆపేక్షో! ఎప్పుడు వీలు దొరికినా వచ్చిపోతుంటుంది. మా మనవడు మధు నీకు తెలుసుగా. సంవత్సరంగా పోరుతుంటే ఇప్పటికి వీలు చిక్కిందన్నాడు. చిన్నప్పుడైతే ప్రతి రెండు మూడు నెలలకీ వచ్చి బస్సు దిగీదిగగానే మా ఇంట్లో ఉన్న ఉయ్యాల ఊగేందుకు పరుగుతీసేవాడు. చిన్నపిల్లలు పెరక్కుండా అలాగే మనదగ్గరే ఉంటే బాగుండుననిపిస్తుందయ్యా ఒక్కోసారి"

"!!!ఐగోరూ !!!"
"ఏంట్రా ఆ పొలికేక! చిన్నగా పిలవలేవూ?", గోపాలుడి వైపు తిరిగారు వేంకట్రామయ్య గారు.
గోపాలుడు పక్కగా వంగి రచ్చబండకి కుడి చెవిని ఆనించి, రెండోచెవిని ఎడమచేత్తో అదిమిపెట్టి, కళ్లుగట్టిగా మూసుకొని ఉన్నాడు, "బస్సొత్తాందయ్యా".

"పర్లేదే, శుక్రవారం రోజు అరగంటే ఆలస్యమంటే గొప్పే. అవునూ, మధు ఎన్ని రోజులుంటాడండీ?"
"వాడు రెండురోజులన్నాడయ్యా. కానీ మూడు, నాలుగు వారాలన్నా ఉండకపోతే నా ముసిల్ది ఒప్పుకోదు. ఎలాగో సర్దిచెప్పాలి. సంవత్సరమైంది వాణ్ని చూసి. ఆ పట్నం గోల భరించడం నా వల్లకాదు. అందువల్ల ఎవరు ఎవరిని చూడాలన్నా వాడిక్కడికి రావలసిందే"
"ఈసారి జాతర కూడా ఉందిలెండి. దానికి కూడా వెళ్లినట్లుంటుంది"
"జాతరా, వనభోజనాలూ, పిండివంటలూ, ఇలాంటివెన్నో ఎరవేయాల్సొచ్చిందయ్యా. అదీ ఒకందుకు మంచిదయిందిలే. వాడి స్నేహితులకి కూడా ఈ విషయాలు చెప్పాడు. వాళ్లు కొందరు ఈ బస్సుకి, కొందరు ఈ సాయంత్రం బస్సుకీ..."

"!!!ఐగోరూ !!!"
"ఈ పొలికేకలతో నాకు సరీపోయింది. ఏరా, బస్సు మలుపు తిరుగుతోందా?"
"మొత్తానికి క్షేమంగా చేరారండీ. అదిగో, మీవాడు తలుపు దగ్గరే ఉన్నాడు"

బస్సు దుమ్మురేపుకుంటూ వచ్చి, రచ్చబండని సగం చుట్టు చుట్టి ఒక్క ఆఖరి కుదుపుతో ఆగింది.

(విజయ్ - తిరుపతి - 6/19/5 - సశేషం)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home