Sunday, July 17, 2005

Chapter 7

" ఏమే సీతా,, బావా వాళ్ళు వచ్చే టైము అవుతొంది. త్వరగా కానీ. ఎర్ర నీళ్లూ అవ్వీ దగ్గర పెట్టుకో"
" పొద్దున్నెప్పుడో తిని ఉంటాడు బిడ్డ!"
" ఈ గోపాలుడు ఎక్కడికి తగలడ్డాడో"
" రచ్చబండ దగ్గరకి వెళ్ళాడే" , " ఈ మంగమ్మ గారి మనవడి రాక ఏమిటో గాని, ఊరినంతా చంపేస్తుంది ఈవిడ", మనసులో
చాలా కాలం తర్వాత చూడబోతున్న బావని తలచుకొని నవ్వుకొంది సీత.

* * * * * * * * * * *



మామిడి తోరణాలు, పసుపు, కళ్లాపి కలిసిన సుగంధం, ఊరిలో పండగ వాతావరణం అన్ని కొత్తగా వున్నాయి విజయ్ కి.

" నువ్వు చాలా లక్కీ రా మధూ"
" ముందు రానన్నావు కదరా. ఇప్పుడు అంత లాగా నచ్చిందా!"
" ఈ ప్రశాంత వాతావరణం చూస్తే ఇక్కడే ఉండి పోవాలి అనిపిస్తోంది రా"
" నాకు తెలుసులే రా, నా దగ్గర ఎందుకు దాస్తావు చెప్పు"

పల్లెటూరి అందాలన్నీ చూస్తూ పోతున్న విజయ్ కి అసలు అలుపు, ప్రయాణం బడలిక తెలియటం లేదు.
కవులు అంత గొప్ప కావ్యాలని రాజులు వుండే పట్టణాలలో ఉండి ఎలా రాయగలిగారో అని మొదటి సారి ధర్మ సందేహం కలిగి ఆలోచన లో పడ్డాడు.

" మీరు మావాడికి ఎప్పటినుండి తెలుసు బాబూ" వేంకట్రామయ్య మాటలకి మామూలు లోకం లోకి వచ్చి,
" తాతయ్య గారూ, మీరు అని పిలవకండి. కొంచం ఇబ్బంది గా వుంది. మధు నాకు ఆరేళ్లుగా తెలుసు"
" ఈ రోజు మా ఊరి జాతర. సాయంత్రం చాలా కాలక్షేపంగా వుంటుంది. పడుకోక వచ్చి తప్పక చూడండి ఇద్దరు. రేపు నిద్ర పోవచ్చు. "
" తెలుసండి. ఇందాక బస్సు ఆగినప్పుడు చూశాను. జాతర చూడటం ఇదే మొదటి సారి. అందుకని తప్పకుండా వస్తాము..ఏరా
మధూ..ఏమంటావు.. "
" అతిధి దేవో భవ! మీరు ఎలా చెప్తే అలాగే సార్"

మాటల్లోనే ఇల్లు వచ్చేసింది.

" ఉండండి. ఉండండి. అమ్మాయి దిష్టి తీశాక వద్దురు గాని"
" ఏమిటే, నీ చాదస్తాలూ నువ్వునూ. వాడు ఎండని పడి వస్తే. పైగా వాళ్ళు ఇంజనీరు పిల్లలు " వేంకట్రామయ్య విసుక్కున్నారు.
" ఏ, అయితే కొమ్ములు గానీ ఉంటాయా..వాళ్ళు తినేది అన్నం కాదా! ఏ గాలి అయినా చెప్పి వస్తుందా ఏంటి "

మొహమ్మీద కొట్టిన అనుభూతి కలిగింది అక్కడి అందరికి. విజయ్ కి అర్థం అయ్యింది బామ్మ గారి మాట తీరు, పద్ధతి.

"ఏకసంథాగ్రాహి" అని ఎవరో గొణిగిన శబ్దం విని పైకి చూశాడు. సీత నవ్వుతూ పరిగెత్తి చెంగున లొపలికి వెళ్ళి పొయింది.
ఏమీ అర్థం కాలేదు విజయ్ కి.

మెల్లిగా లోపలికి అడుగు పెట్టి చూశాడు. వేంకట్రామయ్య గారిది చాలా పెద్ద ప్రాంగణం. పెద్ద పెద్ద అరటి చెట్లు,
చిన్న చిన్న గడ్డి బాటలతో చాలా ముచ్చటగా వుంది ఆ ప్రదేశం. వరండా, పెద్ద హాలు. హాలు కు రెండు వైపులా
గదులు. నడి ఇంట్లోకి వెలుతురు వచ్చేందుకు చిన్న అద్దపు నగిషీ కిటికీ. ఆగ్నేయంలో వంటగది. హాలు కి ఆవలి పక్క
ఒక బుల్లి భోషాణం, పక్కనే పెద్ద కాళ్ళ కుర్చీ. ఈశాన్యంలో మెట్ల ద్వారా పై అంతస్తులోకి వెళ్లే మార్గం. గోడల మీద అక్కడ అక్కడ ముగ్గులు. ఇంటికి తగ్గ మనస్సు ఆయనది అనిపించింది. ఆ చుట్టు పక్కల గ్రామాల్లో వేంకట్రామయ్య దంపతులు లేనిదే ఏ శుభకార్యమూ జరగదని మధు చెప్తూ ఉండేవాడు. చదువు మీది ఆసక్తితో వయోజన విద్య ద్వారా పదవ తరగతి పూర్తి చేశారట తన షష్టి పూర్తి తర్వాత. ఆ సర్టిఫికేట్టు కనిపించే విధంగా తగిలించారు. వంట గది మూల ఒక పెద్ద ధ్యానమందిరం.అందులో త్యాగరాజు గారి బొమ్మ చూసి ఆగలేక అడిగాడు మధు ని.
" ఇంట్లో ఎవరైనా సంగీతము నేర్చుకుంటున్నారా"
" ఆ, వుందిలే ఒక కోతి. పరిచయం చేస్తాను"
" కాస్తంత ఎంగిలి పడండి రా! తర్వాత తీరిగ్గా కబుర్లు చెప్పుకోవచ్చు. " మంగమ్మ గారి అరుపుతో కోతి పరిచయం మరుగున పడింది.

( వంశీ - 6/21/05 - సశేషం)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home