Thursday, July 21, 2005

Chapter 3

ఇంతలో ముందు వరసలో ఉన్న ఇద్దరూ లేచి వెళ్ళడంతో , నీలు కూర్చొని పక్కకి జరిగి కూర్చుంటూ విజయ్ ని కూర్చోండి అంది.

"Thanks." అన్నాడు విజయ్.
"పర్వాలేదు" చిరునవ్వుతో అంది , నీలు.
ముత్యాల పలువరస , చిన్నగా బుగ్గ మీద పడే సొట్ట , ప్రశాంతతని వెదజల్లే కళ్ళు. క్షణం పాటు తాను అమ్మాయిని తదేకంగా చూస్తున్నానని మర్చిపోయాడు విజయ్. వెంటనే తల పక్కకు తిప్పు కున్నాడు.
"ఇక్కణ్నించి ఊలపల్లి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది ?"
"ఇంకో ఇరవై నిమిషాలు."
బయటకు చూశాడు, పచ్చని చేలు , పల్లె వాతావరణం, దూరంగా ఉన్న తాడి చెట్లు, భూమి ఆకాశం కలిసిందా అనిపించే దృశ్యం
,చాలా బావుంది అనుకున్నాడు విజయ్।
తల పక్కకు తిప్పేసరికి కనబడింది, రిలయన్స్ ఇండియా మోబైల్ ప్రకటన, గ్లోబలైజేషన్ అంటే ఇదేనేమో చిన్నగా నవ్వుకున్నాడు.
కునుకు తీశాడు మళ్లీ,
ఈ సారి కలలో అన్ని రిలయన్స్ ప్రకటనలూ కనపడుతున్నాయి.గట్టిగా వినిపించిన శభ్దానికి లేచాడు.
ఏదో జాతర జరుగుతూంది,పెద్ద ఊరేగింపు,పులిరంగు వేసుకుని కొంతమంది కొరడాలతో కొట్టుకుంటూ వెళ్తున్నారు.
డండ డరడ డండ డరడ డం - డండ డరడ డండ డరడ డం (2)

"నూకాలమ్మ జాతర" అడక్కుండానే చెప్పింది నీలు.
"Excellent. Awesome" అనేశాడు తడబడకుండా, భలే నిద్ర చెడ గొట్టారు అనుకుంటూ.
"Do you mean it ?" అడిగింది నీలు, విజయ్ వంక చూస్తూ , కళ్ళు చిట్లించి.
ఒక్క క్షణం ఆగి నవ్వేశాడు , అమె కూడా తోడయ్యింది.

"ఊరికి కొత్తా ?"
"అవును, మా స్నేహితుడు మధు తో వచ్చా, రెండు రోజులు ఉంటాను ఇక్కడ , కాలక్షేపం కాదేమో అనిపిస్తూంది"
"సాయంత్రం ఖాళీ దొరికితే జాతర చూడడానికి రండి , మంచి కాలక్షేపం, నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి"
"సినిమా పాటలూ, కుప్పి గంతులూ కాదు కదా ? "
"కాదు , కూచిపూడి నృత్యం , కర్ణాటిక సంగీతం" కోపంగా చెప్పింది.
"ప్రదర్శన కోసం కళాకారులు వేరే ప్రాంతం నించి వస్తారా ?"
"ఏం, సినిమా వాళ్ళు లేక పోతే మీరు రారా ? " వ్యంగ్యంగా అంది.
"అదేం కాదు, సహజంగానే నాకు సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం, చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం"
ఇంకా ఏదో చెప్పుదామనుకున్నాడు, కాని మళ్లీ డప్పుల శబ్దం అయ్యేసరికి మానుకున్నాడు.

"వెనక్కి జరగండి" అని ఎవరో అనడంతో కునుకు లోంచి బయటికి వచ్చాడు విజయ్.
"ఇంకెంత సేపు పడుతుంది ?"
"20 నిముషాలు " ప్రశ్నార్ధకంగా చూసిన విజయ్ తో చెప్పింది,
"మీరు ఇదివరకు అడిగిన దగ్గరే ఉన్నాం మనం, జాతర వెళ్లిపోయింది , ఇక బస్సు కదులుతుంది ", నవ్వుతూ చెప్పింది నీలు.
రిలయన్స్ ప్రకటన అక్కడే ఉంది. తన నిద్రని తలుచుకుని తనలోనే నవ్వుకున్నాడు.
ఇంతలో వచ్చాడు మధు, అయాస పడుతూ.
"ఎక్కడున్నావ్, ఏమై పోయావ్ ? "
"జాతరలో పులి డాన్స్ చేస్తున్నా"
"నీలాంబరి, సాయంత్రం నీ నృత్య ప్రదర్శన ఉందటగా ?" నీలుని అడిగాడు మధు.
"అవును" ఓరకంట విజయ్ ని చూస్తూ అంది.

(కళ్యాణ్ - కాకినాడ - 6/19/5 - సశేషం)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home