Wednesday, July 20, 2005

Chapter 4


విజయ్ కి మళ్లీ నిద్ర పట్టింది।
సాయంత్రం జాతర లో నీలాంబరి కూచిపుడి నృత్యప్రదర్శన కి ముందు వరసలో కూర్చున్నాడు। ఎవరో వచ్చి "తుండు గుడ్డ వేసి వెళ్ళాను" అంటే, తగాదా పడి మరీ కూర్చున్నాడు। మధు పక్కనుంచి తగ్గుదామని అంటున్నాసరే, వినిపించుకోడే॥ కావాలంటే మధుని వెనక్కి వెళ్లమని సలహా పారేసి, తను మాత్రం ముందు వరసలోనే కూర్చుంటాను అని పంతం పట్టాడు।

"తరువాత కార్యక్రమం మన గ్రామ అమ్మాయి నీలాంబరి కూచిపుడి నృత్య ప్రదర్శన - భామా కలాపం" అని పెద్దగా మైకులో చెప్పారు।

అంతే, విజయ్ ఆ తెర ఎప్పుడు తెరుస్తారా అని ఆతృతగా చూస్తున్నాడు। తెర తెరిచారు। నీలాంబరి, కాదు కాదు, భామ, సత్యభామ, వయ్యారంగా, "భామనే, సత్యాభామనే ....." అంటూ జడని ఒక చేత్తో పట్టుకుని, వయ్యారంగా ముందుకి నడుస్తూ వచ్చింది। "ఆ నడకలో ఏమి సొగసు, ఏమి హొయలు.... పొగడటానికి ఇంకొన్ని పదాలు వుంటే బాగుండు" అనుకున్నాడు విజయ్।

ఇంతలో, భామ వెదుకుతూ,
" నల్లని వాడు, పద్మ నయనంబుల వాడు, కృపారసంబు పైజల్లెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చె, నో మల్లియలార! మీ పొదలచాటున లేడు గదమ్మ! చెప్పరే", అంటూ తెగ ఆరాట పడి పోతోంది।

అంతే, ఒక్క సారి భామ మొహంలో చెప్పలేని ఆనందం।
ఎందుకు?
ఇంకెందుకు, కృష్ణుడు, మన విజయ కృష్ణుడు, కనిపించాడు।
నీల మేని ఛాయ, అంటే నల్లకి కొంచెం తక్కువగా,
తలపై ఒక నెమలీక పెట్టి,
చేతిలో మురళి పట్టి,
పట్టు పీతాంబరాలు కట్టి,
చిరునవ్వు నవ్వుతూ,
కుడి కాలు ఎడంకాలు పక్కన పెట్టి అదో రకంగా కృష్ణుడిలా వంగి, భంగిమలో ప్రత్యక్షమయ్యాడు।
భామ కృష్ణుడు చుట్టూ మూడు నాలుగు సార్లు నాట్యం చేస్తూ తిరిగింది।
అంతలో," ఏంటో, ఈ కూచిపూడి, వెదికనంత సేపు ఓ తెగ వెతికేస్తారు, మళ్లీ కనపడగానే, వచ్చి మీద పడిపోవాలిగాని, ఇలా చుట్టూ తిరగడాలేమిటి !!!! తిరిగింది చాల్లేవమ్మ, దగ్గరకు రా", అని అనుకున్నాడు కృష్ణుడు।
తిరిగాల్సిందంతా తిరిగి భామ కృష్ణుడి దగ్గరకి వచ్చి భుజం మీద చెయ్యి వెయ్యబోయింది......
అంతే, "కీ..............చ్" మని శబ్దం వినిపించింది। కృష్ణుడు పట్టు తప్పి కిందపడబోయాడు...."
విజయ్ ఒక్క సారి ఉలిక్కి పడి లేచాడు। బస్సు డ్రైవరు ఒక సడన్ బ్రేక్ వేశాడు। సీటు లోంచి ఇంచుమించు పడిపోబోయాడు విజయ్। పక్కకి చూసాడు। నీలాంబరి చిత్రంగా తన వైపే చూస్తోంది।
"మీరు భలే నిద్ర పోతారండీ...." పొగడ్త కి దూరంగా, వెటకారానికి దగ్గరగా అనిపించింది విజయ్ కి
అదో రకమయిన నవ్వు నవ్వాడు విజయ్
"నిద్రలో మళ్లీ నవ్వు కూడాను, ఎం కలొచ్చిందండీ....... " ఇది పూర్తిగా వెటకారమే
" అబ్బే, ఏం.....ఏం..... లేదండీ...." తడబడుతూ విజయ్
వెనక సీట్లోంచి మధు అందుకున్నాడు।

"ఆ వాడంతేలే నీలు। ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అలా నిద్ర పోయే వరంతో పుట్టాడు। ఇందాకా నే చెప్పాగా, వాడు ఇప్పుడే లేవడని...."
"ఛా.. విజయ్ గారు, ఇంత బండ నిద్రేమిటండీ బాబు..."
"ముందు, డబ్బు తీయాలి, వాణ్ణి తాపీగా తిడుదువుగానీ..."
విజయ్ మొహం లో question mark చూసి, నీలు, "మీరు పది నిమిషాల్లో నిద్ర లేస్తారని నేను, లేవరని మధు పందెం కట్టామండి। ఇంత కుదిపేసే బస్సు లో, ఇంత ఎండలో ఐదు నిమిషాలు కూడా నిద్ర పోవటం కష్టం కదా, నేనే గెలుస్తాను అని అనుకున్నాను.../ మధు అంత గట్టిగా పందెం కట్టినప్పుడే ఏదో వుంది అనుకున్నాను కాని...పందెం కట్టాను ఛా నేను ఓడిపోయాను"

"నేను పడుకున్నప్పుడు మా వెనుక సీట్లో కూర్చుని,
కూర్చుంటే పర్వాలేదు, నీలు తో మాట కలిపి,
మాట కలిపితే పర్వాలేదు, కాని నా నిద్ర గురించి మాట్లాడి, bet కట్టి నా image ని damage చేస్తావా మధు। చూస్తా మధు, నాకూ టైము రాక పోతుందా ..."

(శ్రీ హర్ష - 6/19/5 - సశేషం)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

Links to this post:

Create a Link

<< Home