Monday, May 30, 2005

Chapter 29

"ధర ధరణిలొ ధరియించెను
ధర మర్మము తెరిపించును
వేదములు ఎన్నుండును
నరసింహుడు ఉదయించును
ధను రాశిని మెరిపించెను
నిటలాక్షుడు జరిపించును
ధర మర్మము కనిపించును "

" సీతా ఒక్కసారి పక్కకి జరగవే , అక్కడ ఎదో కనిపిస్తోంది",మధు ని ఫాలో అయ్యారంతా.
" లోకేష్ , ఎమిట్రా ఈ చెత్త రాతలు, ఏదో Treasure Hunt లా ఉంది కదా",
" Treasure Hunt లా వుండటం కాదు, Treasure Hunte !!!!, గాయత్రీ ఈ పద్యం చదువు నీకు ఎమైన క్లూ దొరుకుతుందేమో!!"
" బావా, ఆట continue చెద్దాము రండి "
" అయినా ఇంకా ఆటలేంటి చిన్న పిల్లలాగా, ఈ పద్యం చందస్సు చెప్పు ఇటొచ్చి "
" మాకు చంపకమాల, ఉత్పలమాలే వున్నాయి.. ఇదేంటొ నాకు తెలియదు"
" సుమాగమాల తెలియదా , మసగ-నస-భజన దీని గాణాలు" మధుగాడు డబ్బా స్టార్ట్ చేశాడు..
" ఆపండిరా సోది గోల, పని చూడండి ముందు, నీ కోతలు వినటానికి ఆ చిన్న పిల్లే దొరికింది పాపం ..తెలుగు లొ ఫైల్ అయిన సన్నాసి వెధవా!!',

....
....

" దీన్ని చూస్తుంటే చాలా పాతకాలం పలకంలాగా వుంది. కాని ఈ పద్యంలో వున్న తెలుగు
మాత్రం చాలా సరళంగా వుంది. ఇంత వాడుక తెలుగులో పద్యాలు రాయటం బట్టి చూస్తే ఇది 200 ఇయర్స్ కంటే పాతది అయ్యే చాంసెస్ తక్కువ.అదే నిజమైతే ఇక్కడ రాజులు పొందగ వచ్చిన నిధి misleading గా వుంది."
గాయత్రి చెప్పేది వింటున్నారు అందరు..

" గాయత్రి, మొదటి పద్యానికి, రెండవ పద్యానికి తేడా వున్నట్లుంది, చూశావా !",
" అవును నిజమే లోకేష్!, మొదటి పద్యం చెక్కిన font , రెండవ దాని font తేడాగా వున్నాయి..సీతా ఈ లోపు ఇంకేదైనా పద్యాలు వున్నాయేమో చూడవా రాతి మండపం మొత్తంలో..ఒక్కొక్క పద్యానికి 100 ఇస్తాను.డీల్--"
" డీల్ -- అక్కా " , సీత CID పని మొదలెట్టింది.

" ఈ fontలు కావాలని వేరుగా రాసినట్లు తెలిసిపోతోంది .అంటే రెండు వేరు వేరుగా ట్రీట్ చెయ్యాలన్నమాట. అర్కియాలజీలో మొదటి లెసన్‌ fontని బట్టి inscriptions అర్దాలు మారచ్చని.చాలా సందర్బాలలో font మారితే శిల్పి మారినట్లు లెక్క. అంటే, ఈ రెండు పద్యాలు ఒకే కాలానికి కూడా చెందినవి కాకపోవచ్చు.ఈ బండని Dating చేయిస్తే ఆ రెండు పద్యాలు ఒకే క్లూని ఇండికేట్ చేస్తున్నాయో లేదో చెప్పచ్చు."

" Dating అంటే గుర్తుకు వచ్చింది, ఒరేయ్ లొకేష్ గా , నీ వల్ల stella date మిస్ అవుతున్నాను " దీపక్ గొణగటం గాయత్రికి వినిపించేసింది.

" గాయత్రి, మొదటి పద్యం కంటే రెండవ పద్యం క్లూ కి దగ్గర గా వుంది.చూడు
ధర ధరణిలొ ధరియించెను - ధరణి అంటే భూమి కాబట్ట్టి , ధరణిలో ఏదొ వుందని చెప్తోంది క్లియర్ గా " లోకే ష్ ఇచ్చిన స్టార్ట్ కి మూడ్ వచ్చింది అందరికి.
" Crosswords వీరుడా విజయ్‌ కృష్ణ , విజృంభించు " మధు encouragementకి విజయ్ అలోచించటం మొదలుపెట్టాడు ..
" ధర అంటే రేటు, విలువ , కలిగి వుండటం ... అంటే ఏదో విలువ భూమిలో ధరించినది అని ఉంది ...ఏదైనా విగ్రహముందేమో లోపల, విలువ గల నగ ఏదో ఉండుంటుంది. "
" కానీ విజయ్ , ఒక్క నగ కోసం ఇంత రిస్కు తీసుకుంటారా ఎవరైనా , నాకు నమ్మ బుద్ది కావటం లేదు. అయినా లైట్‌ లే , అది ఏదైతే మనకెందుకు...next చూడు "
" ధర మర్మము తెరిపించును - మర్మము అంటే సీక్రెట్ , తెరిపించును , ఇక్కడ ధర ఏమిటొ " అలోచిస్తున్నాడు విజయ్
" హె , ఐ గాట్ ఇట్ ... జుంబుల్ చెయ్యండి - మర్మము ధర తెరిపించును ... అంటే సీక్రెట్ ధర తెరిపించును,
సొ, మన క్లూ భుమిని ఓపెన్‌ చేయిస్తుందన్నమాట !!!" దీపక్ విజయ గర్వంతో అన్నాడు దీపక్ గాయత్రి వైపు చూస్తు...

సీత ఇంకా వెతుకుతూనే వుంది ...ఏది దొరకలేదు ..

/******************************/

అక్కడికి వంద మీటర్ల దూరం లో ...

" నర్సింగ్ , రాతి మండపం దగ్గర ఎవరో వున్నట్లు వున్నారు , ఇవాళ మన పని అయ్యేటట్లు లేదు.. ఏదొ వన భోజనాలు లాగా వుంది..వెళ్ళి బెదిరించి పంపెద్దామా ఖాన్‌ వచ్చే లోపల "
" అలాంటి పిచ్చి పనులే వద్దు . మనము ఇక్కడికి వచ్చినట్లు ఎవరికి తెలియ కూడదు... అసలే JP పొయాక ఎందుకో నాకు అనుమానంగా వుంది , దీని వెనక ఇంకెవరి హస్తమైన ఉందేమోనని . మనం చేసే ప్రతి తప్పు మనల్ని పట్టిస్తుంది.. సరలే గాని , ఖాన్‌ కి ఫొన్‌ చెయ్యి , ఏన్నింటికి వస్తున్నాడో ?.."
...

" ఖాన్‌ , నేను గొపాల్ ని , బయల్దేరావా ?"
" నేను పోలవరం వచ్చి గంటయ్యింది. కాని మన ప్లాన్‌ చేంజ్ చెస్తున్నాను.
మనం రేపు వెల్దాం మండపానికి . మూర్తి కొడుకు మీద నాకు అనుమానంగా వుంది.
వాడు ఎప్పుడు పోతున్నాడో అమెరికాకి ... కనుక్కో ఈ లోపల. "
" కాని ఎందుకు చేంజ్ చేసావ్ , మాతో ఒక్క మాటైన చెప్పకుండా "
" అంతా వివిరంగా తర్వాత మాట్లాడదాం. ఇప్పటికి ఉంటాను "

/*************************/

" వేదములు ఎన్నుండును"
" నాలుగుండును" సీత పరిగెత్తింది , బావ కొడతాడని తెలుసు..
" వెటకారామా, ఉండు నీ పని చెప్తా ," మధు పరిగెత్తి వెళ్ళాడు ..
" లోకేష్ , సీత చెప్పింది obvious గా వున్నా , రిలవెంట్ గానే ఉంది కదా "
" గాయత్రి నువ్వు కూడాన ...ఛ .. "
" హె లోకేష్, నాలుగుకి ఏదో లింకు ఉండే ఉంటుంది. నాకు అదే అనిపంస్తోంది . " విజయ్ కూడా తోడయ్యాడు...

"నరసింహుడు ఉదయించును"
" నా వల్ల కాదురా బాబు .. నరసింహుడు ఉదయించును, బ్రహ్మనాయుడు జన్మించును , ఇదంతా చూస్తుంటే సీతా వాళ్ళ friends మనల్ని ఆట పట్టించటానికి ఆడుతున్న నాటకం లాగావుంది . నాకు నిద్రవస్తోంది , నేను పడుకుంటాను . మీ debugging అయ్యాక లేపండి" దీపక్ కి విసుగు పుట్టింది . ఆసలే గాయత్రి దగ్గర ఇంప్రెషన్‌, stella Date పొయిన బాధ లొ ఉన్నాడు.
" కలికాలం . డాక్టర్లు కూడా debugging గురించి మాట్లాడటం కడు సోచనీయం . బాధాకరం .." NTR వాయిస్ ఇమిటేట్ చేశాడు లోకేష్ ...

అంతా నవ్వుకుంటున్నారు.

Sunday, May 29, 2005

Chapter 30

" బావా, ఎంత వెతికినా ఇంకేమి కనిపించలేదు . ఈ రాతి మండపం స్తంబాలు అన్ని వెతికాను..."
" సర్లేవే , అయితే ఒక పని చెయ్యి.ఈ మండపం లో ఉన్న శివలింగాలు కౌంట్ చెయ్యి. టైం పాస్ అవుతుంది"
" నాకేంటంట , నేను చెయ్యను. నువ్వే చెసుకో పో , నేను ఇంటికి వెళ్ళి పొతాను. ఎటూ భోజనాలు తీసుకురావటానికి అమ్మమ్మ రమ్మంది. గోపాలుడు కూడా ఇవాళ పనిలోకి రానని చెప్పాడట. పోనీ నువ్వు డా రావచ్చు కదా. చాలా చేసినట్లుంది అమ్మమ్మ. తేవటానికి నేనొక్కదాన్ని సరిపోను."
" సరే పద. దీపక్ నువ్వూ వస్తావా? సరదాగా వెళ్ళి వద్దాం. నీకు ఎటూ టైం పాస్ అవ్వటంలేదు కదా"
" వెళ్ద పదండి"

దీపక్ , మధు , సీతా వెళ్ళిపోయారు. గాయత్రి, నీలు , విజయ్, లోకేష్ అలోచిస్తూనే ఉన్నారు.

" నీలు, నువ్వేమీ మాట్లాడటంలేదేంటి.ఏదైనా ఐడియా ఇవ్వచ్చు కదా.బుర్ర వేడెక్కుతోంది" లోకేష్ అసహనంగా ఉన్నాడని అర్దమైపోతోంది మాటల్లో.
" ఇప్పుడే Lateral Thinking అవసరం"
" Lateral Thinking అంటే ఏమిటి విజయ్" అంది నీలు.
"అడ్డంగా అలోచించడం అన్నమాట. మన మధు గాడి లాగా"
" మధ్యలో మధు ఏమిచేశాడు పాపం. మధు చాలా తెలివైన వాడు. మా ఊరి మొత్తంలొ EAMCET RANK వచ్చింది మధుకే తెలుసా"
" సరే అది వదిలెయ్యి. ఇక్కడ ఒక వేళ క్లూ ఉంటే ,అది దేని గురించి అయ్యుండొచ్చో అలోచిద్దాం. తర్వాత, ఈ పద్యం క్రాక్ చెయ్యొచ్చు. ఈ రాతి మండపం చుట్టూ ఉన్నది అనవసరమైన చెత్త పొలం. కాబట్టి ,క్లూ ఈ మండపంలో దేన్నో ఇండికేట్ చెయ్యాలి. ఇది నా అర్గ్యుమెంట్. ఎవరికైనా ఇంకేదైనా అనిపిస్తే చెప్పండి. ఇలా మాట్లాడుతూ పోతే మనం క్రాక్ చేసెయ్యొచ్చు."
" నిధి ఇక్కడే ఉంది అనేది ఆబ్వియస్ కాబట్టి ఆ క్లూ ఇక్కడే ఎక్కడో ఉన్నదాన్నో, ఉన్న ప్రాంతాన్నో ఇండికేట్ చెయ్యాలి. అది కూడా ఆబ్వియస్. " అన్నాడు లోకేష్.
" రైట్ లోకేష్. సో ...మన క్లూ ఇక్కడ ఏదో ఒక దాన్ని ఇండికేట్ చెయ్యాల్సిందే.ఇక్కడ మండపంలో స్తంబాలు, లింగాలు తప్ప ఇంకేవి లేవు . బేసిగ్గా ఎవరైనా ఇక్కడ ఈ మండపాన్ని ఎందుకు కట్టించారు అని నా డౌట్. అది కూడ ఈ ప్రాంతంలో. దీని వల్ల ఉపయోగమే లేదు . ఒక వేళ ఈ మండపమే క్లూనా కొంపదీసి. దాన్ని పడగొడితే కింద ఏముందో తెలిసిపోతుంది కదా "
" నీలు, ఈ మండపం మీ స్థలమే కదా. అంకుల్ కి చెప్పి దీన్ని పడకొట్టించచ్చా ?" అడిగాడు లోకేష్.
" లేదు లోకేష్. అది మా స్థలం కాదు.మా తాతగారికి పేషి నుంచి వచ్చిన ఈ స్థలాన్ని అర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసేసుకున్నారు. మా తాత గారు దానిపై కోర్టుకి వెళ్ళారు. అది ఇంకా కోర్టులోనే ఉంది. కాబట్టి మనమేది చేసినా కోర్టు ఉల్లంఘనే అవుతుంది.కాక పోతే మా బాబాయి కి లాస్ట్ సమ్మర్ లో ఒకాయన మద్రాస్ నుంచి ఫోన్‌ చేసి దాన్ని తనకి అమ్మేయమని అన్నాడు. మా బాబాయ్ ఎంత చెప్పినా, పర్వాలేదు నేను కొనుక్కుంటాను , రిస్క్ మొత్తం నాదే ,అని చెప్తే అమ్మేద్దామని అనుకున్నాం. కాని లీగల్ ప్రాబ్లంస్ వల్ల అది కుదరలేదు"
" మద్రాస్ నుంచా .. అంటే ఈ రాతి మండపం సీక్రెట్ మద్రాస్ లో ఎవరికో తెలిసిందన్నమాట" , లోకేష్ అన్నాడు.
" మనం నిన్న ట్రాప్ చేసిన నంబరు కూడా చెన్నయ్ నుంచే. అంటే ఇద్దరూ ఒక్కరైనా అయ్యుండాలి లేదా పెద్ద
గ్యాంగ్ అయినా అయ్యుండాలి."
" పెద్ద గ్యాంగే.. అందులో డౌట్ ఎందుకు. మా నాన్నని వేదించింది ఆ గ్యాంగే. JP ఈ మండపం విషయంలో ఇక్కడికి వచ్చింది కూడా దాని తరఫునే. ఆసుపత్రి గ్యాంగ్ కి ఈ రాతి మండపం గురించి తెలియటం చాలా కష్టం. ఆలోచిస్తేఅంతా తికమకగా ఉంది.... గాయత్రీ ,ఈ రాతి మండపం గురించి ఎవరైనా రీసెర్చ్ చేసారెమో తెలుసుకోవచ్చా. మీ HOD ఏమన్నా హెల్ప్ చేస్తారా ఈ విషయంలో."
" కనుక్కోవచ్చు లోకేష్. ఆ తీగ లాగితే డొంకంతా కదలొచ్చు.కాకపోతే ఆయన కొంచం బిజీ మనిషి . మనకి హెల్ప్ చేస్తారని నేననుకోను. ఆయన్ని కన్వింస్ చెయ్యటానికే కష్ట పడాలి."
" మీరు లక్కీగా చెన్నయ్ నుంచే కాబట్టి మనకి ఇంఫర్మేషన్‌ దొరికే చాంసెస్ ఎక్కువేనని నా ఉద్దేశం"
" మనం అసలు పోలీసులకి ఎందుకు చెప్పకూడదు ఈ విషయం" గాయత్రి అడిగింది.

" చెప్పొచ్చు. కాని , ఇందులో నా స్వార్ధం కొంచం ఉంది. " లోకెష్ లో మొదటిసారి బాధకనిపించింది అందరికి, " మా నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. పోలీసులకి విషయం తెలిస్తే మనకిక చాంస్ ఉండదు ఈ కేస్ విషయంలో . ఆందుకే మీ అందరికి రిక్వెష్ట్ చేస్తున్నా. ఒక్కసారి మనం ట్రై చేద్దాం. కాకపోతే ఇక పోలేసులే గతి"
" Fair enough!" విజయ్ మళ్ళి క్ర్రాక్ చెయ్యటం మొదలు పెట్టాడు, " మన మండపంలో మొత్తం 64 స్తంబాలు ఉన్నాయి. అన్ని సమాన దూరంలో కూడా ఉన్నాయి. సరిగ్గా చుడండి అన్ని ఒక్క లాగానే ఉన్నాయి.కాబట్టి ఈ స్తంబాల్లోనే ఎదో ఒకటి క్లూ అయ్యుండచ్చు."
" రైట్ విజయ్, అంతే అదే...కరక్ట్ ..నరసింహుడు ఉదయించును...నరసింహుడు పుట్టింది స్తంబంలోనే కదా!!!"
" వావ్ లోకేష్ , We did it!!!!!" గాయత్రికి చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తొందిప్పుడు.

ధను రాశిని మెరిపించెను

" ధను రాశిని మెరిపించెను . ధను రాశిని మెరిపించటం ఏమిటి ? మన Lateral Thinking ప్రకారం, ఇది ఈ స్తంబానికి సంబందించినది అయ్యుండాలి. కాని, నాకు ఈ జాతకాలు అవ్వీ తెలియవే. మధు గాడికి తెలుస్తుంది. వాడిని రానీ . మనం ఈ లోపల మిగిలనవి చూద్దం , " విజయ్ commander-in-charge లాగా ఉన్నాడిప్పుడు.

నిటలాక్షుడు జరిపించును

" నిటలాక్షుడు అంటే శివుడు కదా. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నయి. బహుశా ఏ శివలింగమో
అయ్యుంటుంది మన క్లూ " నీలు తన మొదటి ప్రయత్నానికి మురిసిపోతోంది.

" రైట్. అంతే ... అదే అయ్యుండాలి. చివరి పాదం క్లియర్ గానే ఉంది చూడండి. ధర మర్మం కనిపించును. మనం మొదటి పాదం లోని మొదటి ధరని ఇక్కడ వాడితే సరిపోతోంది .." విజయ్ వివరంచాడు.

" కాబట్టీ మన 64 స్తంబాలలో ఎదో ఒక శివలింగం మన క్లూ అన్నమాట. మనకి ఇంక ఒక్క పాదం అర్దం కావాలి. అది తెలిస్తే ఏ శివలింగమే కనంక్కోవచ్చు. లేదంటే Brute Force మన గతి"
" అమ్మో , ఒక్క స్తంబం మీదా దాదాపు 1000 శివలింగాల బొమ్మలున్నాయి . 64000 వెతికితే అంతే. కనీసం సంవత్సరం పట్టోచ్చు. మన వల్ల కాదు. ఊలపల్లి వల్లా కాదు " నీలు అంది.
" నీలు , మనకి అంత టైం లేదు. మధు రానీ చూద్దాం. అతని వల్ల ఎమ్మన్నా అవుతుందేమో"
" వాడా , తిని పడుకొని ఉంటాడు వెధవ. అప్పుడే రాడు చూడండి"
" ఎందుకు విజయ్ , ఎప్పుడు మధుని అలా తిడతావ్ ? మధు నీకంటే చాలా చాలా చాలా మంచివాడు" నీలు వెనకేసుకు రావటం విజయ్ కి ముచ్చటేసింది.
" లోకేష్ కంటే మంచివాడా మధు ? " విజయ్ ప్రశ్న
" No comments."

.....

" నీకు నూరేళ్ళు మధు , ఇప్పుడే నీలు , విజయ్ నీ గురించే కొట్టుకుంటున్నారు."
" లోకేష్ , నువ్వు అమేరికాలో పెద్ద డాక్టరుగిరి వెలగబెడుతున్నావు అనుకున్నా . ఛ . నాకు 23 ఏళ్ళే!!" మధు కామెడికి అందరు నవ్వుకుంటున్నారు.

" మధుగా , నీ పాండిత్యం ప్రదర్శించే టైం వచ్చింది . ధను రాశి లో మెరిపించును అనే పాదం తప్ప మిగిలినవన్నీ క్లియర్ గానే ఉన్నాయి. ధను రాశి గురించి మాకెవ్వరికి తెలియకే అది క్రాక్ చెయ్యలేక పోయాం. ధను రాశి గురించి చెప్పు. "
" ధను రాశి లో మూలా, ఉత్తారాషాడా, పూర్వాషాడా ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి..." మధు చెప్తూపోతున్నాడు..
" ఏమటీ మూల నా , you mean corner " దీపక్ జొక్ చేశాడు.
" విజయ్ , మూల అంటే corner కదా. సో , మన స్తంబం మూల న ఉంటుముందేమో!!" లోకేష్ చెప్తున్నాడు
" యెస్ . ఉత్తర మూల - North Corner - అయిపోయింది . మన శివలింగం ఆ ఉత్తర మూలలో ఉన్న స్తంబం మీదది"

Saturday, May 28, 2005

Chapter 31

అందరూ ఉత్తరం వైపున ఉన్న స్తంభం దగ్గరకు చేరారు.
"ఓకే, ఇక్కడ 1000 బొమ్మలు ఉన్నాయి. మిగతా వాటికన్నా వేరుగా ఉన్నవాటి కోసం చూద్దాం."
"సరే విజయ్, నేను ఇటు సైడ్ ఉన్నవి చూస్తాను", అంటూ గాయత్రి స్తంభం వెనక్కి వెళ్లింది.
దీపక్ కూడా అదృశ్యమయ్యాడు.
స్తంభానికి ఉన్న ఎనిమిది వైపుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కరు తీసుకుని జాగ్రత్తగా చూడసాగారు.
పది నిముషాలు గడిచాయి.
అందరూ నేలమీద పడుకుని కింది వరుసలో ఉన్న ఆఖరి బొమ్మలు చూస్తున్నారు.

"నా వైపు చెప్పుకోదగ్గ చిత్రమేమీ కనపడలేదు"
"ఇక్కడ కూడా అంతే మధూ", నీలూ లేచి నిల్చుంది.
"నీకేమన్నా దొరికిందా లోకేష్?"
"లేదు విజయ్"
వాళ్ల స్తంభాల్ని ముందే పూర్తి చేసిన దీపక్, సీత, గాయత్రి మిగిలిన ఎనిమిదో స్తంభాన్ని చూడటం కూడా పూర్తిచేశారు.
"ఏమీ లేదన్న మాట", నీలూ చతికిలపడింది.

/********************************/

"క్లూ ప్రకారం ఇదేనే", లోకేష్ ఆలోచించటం మొదలుపెట్టాడు.
"ఇంకోసారి చదివొద్దామా", సీత సజెషన్ అందరికీ నచ్చింది.

అక్కడికి వెళ్లి పద్యాన్ని మళ్లీ మనసులో చదువుకున్నారు ఏడుగురూ.
"వేదాలూ, స్తంభాలూ, లింగాలూ ఓకే గానీ మధూ, మరి నక్షత్రాలు సరిగ్గానే చెప్పావా?"
"సరిగానే చెప్పుంటాడులే విజయ్, ఏం మధూ?", నీలూ అందుకుంది.
"రేయ్, 2015 లో జరగబోయే నా రెండో పెళ్లి మీద ఆన, నక్షత్రాల విషయం లో డౌటే లేదు. వేదాలేమన్నా తప్పు లెక్కెట్టారేమో, అసలే భారతాన్ని పంచమవేదం అంటారు"
"అడ్డంగా ఆలోచించటం అంటే ఏమిటని అడిగావుగా, ఇదే నీలూ", విజయ్ నీలూని కదిపాడు.
"నేను Lateral Thinking అంటే ఏమిటని అడిగాను."
"అదే కదా, అడ్డంగా ఆలోచించటం గురించి వేరొకర్ని అడిగే ఖర్మ నీలూకి ఏమిటా అని ఒక్క క్షణం కంగారు పడ్డాను"
"ఖలుడికి ఒళ్లంతా విషమే అని పెద్దలు పద్యాలు రాసేటప్పుడు నువ్వా చుట్టుపక్కలే ఉండుంటావు బావా నీ పూర్వజన్మలో", సీత నీలూని ఓదార్చింది.

"మధూ, ఆ నక్షత్రాల పేర్లు ఒకసారి చెప్పు", విజయ్ కి ఒక అనుమానమొచ్చింది.
"మూల, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ"
"ఒక విషయం అయ్యుండొచ్చు. 'పూర్వం' అంటే తూర్పు అని ఒక అర్థం ఉంది. మనం వెతకాల్సింది తూర్పు + ఉత్తరం లో ఉండే మూలలోనేమో?"
"ఈశాన్యం! కూల్ రా! అక్కడ వెతుకుదాం పదండి."

/***************************/

Friday, May 27, 2005

Chapter 32

క్లూస్ అన్నీ కలిపి కాగితం పై రాశాడు విజయ్,


ధర ధరణిలొ ధరియించెను -- విలువైనది భూమిలో ఉంది
ధర మర్మము తెరిపించును - రహస్యం వల్ల అది బయటపడుతుంది
వేదములు ఎన్నుండును - నాలుగు ??
నరసింహుడు ఉదయించును - స్తంభం వల్ల బయట పడుతుంది ?
ధను రాశిని మెరిపించెను - ఈశాన్యం మూల
నిటలాక్షుడు జరిపించును - శివలింగం జరపాలి ?
ధర మర్మము కనిపించును - తర్కం వల్ల కనిపిస్తుంది


"ఇప్పటివరకు మనం అనుకున్నది సరైనదైతే, ఈశాన్యంలో ఉన్న శివలింగం జరపడం వల్ల ఏదైన బయట పడచ్చు !" చెప్పాడు విజయ్.
నెమ్మదిగా ఈశాన్యం మూలకి చేరుకున్నారంతా,పైకి చూశారు,స్తంభానికి పైన ఉన్న శివలింగాన్ని.
"పాతాళభైరవి సినిమాలోలా భూమి రెండుగా విడిపోతుందా ? మంటలూ, పొగలూ వస్తాయా ?" భయం భయంగా అడిగాడు దీపక్
"చూద్దాం" అంటూ దీపక్ భుజాల పైకి ఎక్కాడు లోకేష్.
ఒక్కసారి దేవుడిని తలచుకుని శివలింగాన్ని కదపడానికి ప్రయత్నించాడు.
ఎంతో బలంగా ఉంటుందనుకున్న శివలింగం చాల సునాయసంగా కదిలింది.
"హమ్మయ్య" అనుకున్నాడు లోకేష్।
చెవులు రిక్కించి,ఉత్కంఠగా చూస్తున్నారంతా!
                     *            *              *            *  

"హలో కృష్ణమూర్తి గారు..."
"ఎవరూ మాట్లాడేది ?"
"నేను జేపీకి కావల్సిన వాడిని"
"అయ్యా, తెలిసో తెలీకో తప్పులు చేశాను,ఇక నన్ను వదిలెయ్యండి!!"
"అది చెబుదామనే ఫోన్ చేసాను,ఆ రాతిమండపం మాకు ఇప్పించెయ్యి,అది అందరికీ మంచిది"
"ప్రయత్నిస్తాను, ఎవరికి ఇవ్వాలి ? "
"చెన్నై నించి ఒకతను వస్తాడు, జేపీ పేరు చెప్తాడు, అతనికి అందేలా చేయి, ఏం చెస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం!
సర్వే సాధు జనా సుఖినో భవంతు !" ఫోన్ కట్ అయ్యింది.
లోకేష్ తెచ్చిన కొత్త సెల్ ఫొన్ టేబిల్ మీద పెడుతూ అవతలి వ్యక్తి చాల సున్నితంగా మాట్లాడాడనుకున్నారు కృష్ణమూర్తి గారు.
cell లో display ఐన message గమనించలేదు,
"The conversation has been recorded by spycall."

                     *            *              *            *  

అనుకున్నట్టుగా ఏమీ జరగ లేదు,దాదాపు పదినిమిషాలు అన్ని పక్కలా అందరూ చూశారు,గమనించదగ్గ
మార్పు ఏమీ కనపడలేదు,
గాయత్రి మాట్లాడింది "చాలా సులువుగా శివలింగం తిరగడం బట్టి, మనం కరక్ట్ గానే అలోచించాం అనిపిస్తోంది"
విజయ్ అలోచిస్తున్నాడు " ఏమన్నా వదిలేశామా ?"
దీపక్ చెప్పాడు "అవును, మనం తెచ్చిన విందు భోజనాలని, నా ఆకలిని !"
"కాసేపు ఆపరా, నీ తిండి గోల" లోకేష్ అన్నాడు.
"కడుపులో ఎలుకలు పరిగెడుతున్నై" బాధగా అన్నాడు దీపక్.
"ఎన్నుంటాయేమిటి ,ఎలుకలు ?" వెటకారంగా అంది నీలు.
"నాలుగు ఉన్నై ఇప్పుడు, నలభై అవ్వచ్చు, కాసేపాగితే ! " నెమ్మదిగా అన్నాడు దీపక్.
"హే, మనం వేదములు యెన్నుండును అన్న క్లూని వదిలేశాం,నాలుగు అది", కాగితం మీద నాలుగు చూస్తూ అన్నాడు విజయ్!
"కాని నాలుగు ఏం కావచ్చు ? నాలుగో తారీకున తిప్పాలా ? నాలుగో జామున తిప్పాలా ? నలుగురు తిప్పాలా ? ఏం చెయ్యాలి ?" మధు అన్నాడు !
"అయ్యో! మీరు ఎక్కువ అలోచిస్తున్నారు, నాలుగు సార్లు తిప్పండి", కళ్ళు తిప్పుతూ అంది సీత.
"కరెక్ట్" అందరూ ఒకేసారి అన్నారు !

చకా చకా పైకి ఎక్కి 3 సార్లు శివలింగాన్ని తిప్పాడు లోకేష్,
ఏ మాత్రం హడావిడి లేకుండా, స్తంభం కింద చిన్న తలుపు తెరుచుకుంది, రాగి పలక కనిపించింది, దాని మీద ఇలా రాసి ఉంది.

"మంత్రాలమర్రికి ఈశాన్యంగా తలకాయలో రావిచెట్టు, దానికి అగ్నేయంగా కాలయములో చింత చెట్టు,
దానికి సరసన తూర్పుగా, మరల ఉత్తరంగా"

ఇదేదో పిశాచాల భాషలా కనపడింది, "తలకాయలో రావిచెట్టు అంటాడేమిటి నా తలకాయ" వెంటనే అనేశాడు దీపక్,
'"కాలయములో చింత చెట్టు" అంటే ఏమిటి బావా ' అడిగింది సీత,
"అంటే మిగతా అంతా నీకు అర్థం అయ్యిందా ? "
"ఉండు, దీని కింద ఏదో చిత్రమైన రాత కనిపిస్తోంది" పరిశీలనగా చూసిన గాయత్రి అంది,



"ఇదేదో భాగాహారంలా ఉంది, ఒక ఐదు అంకెల సంఖ్యను రెండు అంకెల సంఖ్యతో భాగిస్తే , మూడు అంకెల సంఖ్య వచ్చిందని అర్థం అవుతోంది" చాలా సులువుగా వివరించాడు మధు.
"అంటే మనం ఈ division satisfy చేసే numbers కనిపెడితే చాలు" నవ్వుతూ అన్నాడు విజయ్.
"అవును, ఇంకెందుకు ఆలస్యం ? మొదలు పెట్టండి" అన్నాడు లోకేష్,
[ఇంకెందుకు ఆలస్యం ? మొదలు పెట్టండి, మీరు కూడా !! ]

సశేషం - కళ్యాణ్ ,కాకినాడ
Credits & Copyrights : The puzzle has been taken from the book "మెదడుకి పదును" written by Dr.Mahidara Nalini Mohan.

Thursday, May 26, 2005

Chapter 33

/******************************************************/

"లెక్క నేను చేస్తాను", సీత ప్రకటించింది.
"ఇదిగో పెన్నూ, పేపరూ", గాయత్రి అందించింది.
"న*న = న అవుతోంది కాబట్టి అది ఒకటికానీ, ఐదుకానీ, ఆరుకానీ అవ్వాలి", దీపక్ మొదలెట్టాడు.
"కాన * య = మరల కాబట్టి న ఒకటయ్యే ఛాన్స్ లేదు", నీలు అందుకుంది.
"త - ల = త అని ఉంది కాబట్టి ల అంటే సున్నా", అన్నాడు విజయ్.
"ఇంకేం, న ఐదన్నమాట", మధు కలిపాడు.
"కా5 * 5య5", అని రాసింది సీత.
"య*న = ల కాబట్టి య సరిసంఖ్య అవుతుంది", అంది గాయత్రి.
"అంటే 5య5 - 525, 545, 565, 585 లలో ఒకటి కావాలి", అంది నీలు.
"ఇదిగో 35 * 565 సరిపోతోంది, ఇవీ అంకెలు", ఆనందంగా లెక్క చూపింది సీత.
"గ్రేట్. మంత్రాల మర్రికి ఈశాన్యంగా 7036లో రావి చెట్టు, దానికి ఆగ్నేయంగా 3062లో చింత చెట్టు, దానికి 9195తూర్పుగా , 210 ఉత్తరంగా. ఈ 7036, 3062

ఇవన్నీ అడుగులే అయుంటాయా?"
"అవును దీపక్, అడుగులో గజాలో అయితేనే బాగుంటుంది. పెద్ద యూనిట్స్ అయితే మళ్లీ కష్టపడాలి", అంది నీలు.
"కానీ ఆ మిస్టరీ వెంట వెళ్లేముందు మనం జేపీ మనుషులను వదిలించుకోవాలి. వాళ్లు ఈ మండపం కింద ఏదో ఉందనుకోవటం మనకి హెల్ప్ చేస్తుంది", అన్నాడు విజయ్.
"అంతా ఈ రాగిరేకులో ఉంది కాబట్టి అది కనపడకుండా చేస్తే చాలు"
"నిజమే లోకేష్ కానీ వాళ్లు కూడా మనం చేసినవన్నీ చేయగలరు కదా. ఈ శివలింగాన్ని తిప్పిచూసినప్పుడు అక్కడ ఏమీ లేకపోతే వాళ్లకి అనుమానం రాదా?", అడిగింది గాయత్రి.
"అయితే ట్రాక్ ఇంకొంచెం ముందే కవర్ చేస్తే సరి. మా బాబాయికి చెప్పి సాయంత్రానికల్లా ఈ మండపంలో ఒక ఉత్సవాన్ని మొదలుపెట్టిద్దాం. సీతకి కనిపించిన inscription పైనే విగ్రహాన్ని పెడదాం. అలా వాళ్లను కొంచెం డిలే చేయవచ్చు", అంది నీలు.
"వేసిన ఐడియాలు చాలు. దాణాకి టైమ్ అవుతోంది. ఇక లేవండి", తిండివైపు దారితీశాడు దీపక్. అందరికీ ఆకలి గుర్తొచ్చింది.

/******************************************************/

గోపాలుడు ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చాడు.
"ఐగోరూ, చినబాబు ఎన్ని రోజులుంటారు?"
"తెలీదురా, వాడసలు ఇక్కడికి వస్తాడనే నాకు చెప్పలేదు", కృష్ణమూర్తి తన చెప్పులని చూస్తూ జాగ్రత్తగా సమాధానం చెప్పాడు.
"రేయ్, వెళ్లి పొలానికి నీరు పెట్టిరా", వేంకట్రామయ్యగారు పురమాయించారు. గోపాలుడు తలదించుకుని వెళ్లిపోయాడు. కృష్ణమూర్తి కొంచెం కుదుటపడ్డాడు.
గోపాలుడు ఇంటిగుమ్మం దాటిన కొంతసేపటికి సూర్యం అటువైపు వచ్చాడు.
"రావయ్యా సూర్యం రా, ఎలా ఉన్నారు పిల్లలు?", వేంకట్రామయ్యగారు అడిగారు.
"ఈరోజు వనభోజనాలని వెళ్లారండీ. అన్నయ్యా మద్రాసు నుండి నీకోసం చంద్రశేఖర్ అని ఎవరో వచ్చారు. ఇంట్లో ఉండమని చెప్పాను"
కృష్ణమూర్తి మళ్లీ చెప్పుల పరిశీలన మొదలుపెట్టాడు.

/******************************************************/

మండపం చూడముచ్చటగా ఉంది. అలంకరణ అందంగా ఉంది.
అప్పుడే పూజకూడా మొదలైంది. జనం వచ్చి మండపంలో శ్రద్ధగా కూర్చొని ఉన్నారు.
సాయంత్రం హరికథ చెప్పేందుకు హరిదాసుగారు తయారవుతున్నారు.

ఇదంతా దూరం నుంచి చూస్తున్న నర్సింగ్ కి సహనం నశిస్తోంది.
"ఇప్పుడా రావడం?", వడివడిగా వస్తున్న గోపాల్ ని కేకలు వేశాడు.
"ఏమైంది? పొలానికి నీరు పెట్టేసరికి మధ్యాహ్నం రెండైంది. తర్వాత పోలవరానికి వెళ్లి ఖాన్ ని కలిసివస్తున్నాను. మండపాన్ని జాగ్రత్తగా గమనించమన్నాడు. ఈరోజు రాత్రే.."
"ఆపుతావా? ఒకసారి అటుచూడు. రాత్రికి పూజలూ పునస్కరాలు జరగబోతున్నాయి. ఇక మనం విషయం తెలుసుకున్నట్లే."
గోపాల్ పళ్లుకొరుకుతూ సెల్ ఫోన్ బయటికి తీశాడు.

/******************************************************/

"ఇక ఉత్తరంగా 210 అడుగులు అంతే", కంపాస్ చూస్తూ అన్నాడు దీపక్.
అందరి నడకల వేగం పెరిగింది.
"ఎప్పుడూ ఈ దారుల్లో రాలేదు. వేరేవాళ్లు కూడా ఇక్కడ నడిచిన గుర్తులు లేవు", అంది నీలు.
"ఇన్ని ముళ్లచెట్లు ఇక్కడ ఉన్నాయని నాకు కూడా తెలియదు", అన్నాడు మధు.
"అక్కడేదో కొంచెం ఖాళీ స్థలం ఉంది, అక్కడికి వెళ్దాం పదండి", ముందుకు వెళ్లాడు లోకేష్.
చెట్లమధ్యలోంచి బయటికి వచ్చిన వాళ్లు ఎదురుగా ఉన్నవి చూసి ఊపిరి తీసుకోవడం ఒక్క క్షణం మర్చిపోయి ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోయారు.

/******************************************************/

(విజయ్ - తిరుపతి - 12/26/5 - సశేషం)

Wednesday, May 25, 2005

Chapter 34

అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో విసిరేసినట్టుగా పెద్ద ఆంబోతు ఎముకలు, పుఱ్రెలు ఉన్నాయి। ఒక పుఱ్రెకయితే వొంపులు తిరిగిన పెద్ద కొమ్ములు వుండి మరీ భయంకలిగిస్తోంది। అంతలో సీత ఒక్కసారి అరవబోయి, తన నోటిని తనే నొక్కి పట్టుకుని అందరినీ మధ్యలోకి చూడమని సంజ్ఞ చేసింది।

అక్కడ ఒక బాగా బలిసిన ముంగీస, ఒక పొడుగాటి త్రాచుపాము పోట్లాడుకుంటున్నాయి। అందరూ వాటిని కన్నార్పకుండా చూస్తున్నారు। ఆ పాము బుసలు కొడుతూ అప్పుడప్పుడు ముంగీసని కాటేస్తొంది। ముంగీసేమో చాకచక్యంతో తప్పించుకుంటూనే, పాముని తన కాళ్లతో రక్కాలాని ప్రయత్నిస్తోంది।

సీత తన ఆవేశాన్ని ఆపుకోలేక, "ఇక్కడేదో మంత్ర రక్ష వున్నట్టుంది.... నాగదేవత అంశగా ఈ నాగు పాము నిధిని రక్షింస్తోందేమో!!!!! నీలక్కా... నాగమ్మ సీరియల్ లో కూడా ఇలానే జరుగుతుందే... మనం వెళ్లిపోవడం మంచిది" అని అంది।

అంతా ఒక్కసారి సీతవైపు చూసారు। సీత ఇంకా అమాయకంగానే మొహం పెట్టింది।

విజయ్ కి రోషం వచ్చింది। "సమ సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయి గురూ ఈ తెలుగు సీరియళ్లు। నాగాస్త్రం, నాగమ్మ లాంటి సీరియళ్లు చూసి యువత ఎలా చెడిపోతోందో చూడండి।" అంతలో మధు "సర్లేరా, ఇప్పుడు అంత ఘాటయిన dialogue అవసరమా?"
లోకేష్ ముందుకొచ్చి, అవసరమే మధు। "పాము, ముంగీస కొట్టుకుంటున్న scene చూడగానే ఏ NGC నో, లేకపోతే Animal Planet గుర్తుకురావాలి కానీ, నాగస్త్రం... నాగమ్మ nonsense ఏమిటి...."
"ఆ అందరూ నీలా పురుగులు, బొద్దింకలూ, తేళ్లు, జెఱ్రులు ఉండే programmes పొద్దున్న, రాత్రి, అన్నం తినేటప్పుడూ చూస్తారనుకున్నావా...." దీపక్ లోకేష్ ని ఎక్కిరించాడు।
"అబ్బ కాస్త ఈ అనవసర మాటలు ఆపి, అసలు విషయానికి వస్తారా...." నీలు గట్టిగా అంది।

అందరూ మళ్లి ఖాళీ స్థలంవైపు చూసారు। అక్కడ పామూ లేదు, ముంగీసా లేదు। "మనం చేసిన హడవుడికి అవికూడా జడిసి పారిపోయాయి" అంది గాయత్రి

"ముందుగా ఇక్కడ ఏమయినా నిధి వుండే సూచనలు కనిపిస్తాయేమో వెదకండి" అందరినీ పనికి పురమాయించింది గాయత్రి
అందరూ తలా ఓ దిక్కూ వెదుకుతున్నారు।
"ఇన్ని చెట్ల మధ్యలో ఈ ఖాళీ స్థలం ఎందుకుంద్దబ్బా.." ఆలోచించసాగాడు దీపక్
పక్కకి వచ్చిన మధుతో తన ఆలోచన చెప్పాడు।
"కింద ఏదయినా కట్టడం వుంటే, అది పూడుకుపోయి, దాని పయిన కొద్దిగా మట్టి ఉందేమో?" మధు అన్నాడు।
కొంచెం దూరంగా గాయత్రి దృష్టిని ఒక రాయి ఆకర్షించింది। అది ఆ ప్రదేశంలో ఉండే రాయిలా లేదు। ఎవరో తెచ్చి పెట్టినట్టుగా ఉంది। గాయత్రి అందరినీ పిలిచి చూపించింది। పైగా ఆ రాయి పైభాగం మాత్రమే కనిపిస్తొంది। అందరికీ ఆ రాయి వెంటే ఏదయినా దొరుకుతుందనే నమ్మకం కలిగింది। ఇప్పుడు ఆ రాయిని ఏదో విధంగా పైకితీయాలి
--------------------------------------------------------------------
అక్కడ మండపం దగ్గర ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, ఉత్సవం హడావుడి ఎప్పుడు సర్దుమణుగుతుందా అని ఎదురుచూస్తున్నారు।
గోపాల్ సెల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు॥॥
"ఏరా ఇంకేదయినా యిసయం తెలిందేంట్రా"
"లేదెహే, ఇంక నాకేటి పన్లేదనుకున్నావేటి.... అసలే రంగితో తగువయి అది బెట్టు చేస్తోంది। మధ్యలో నీ గోలేంటెహే"
"రంగితోటి తగువెందుకొచ్చింద్రా?"
"ఇదిగో ఈ ఫోన్ వల్లే। ఇదెక్కడదనడిగింది? నువ్విచ్చావని సెప్పాను। నమ్మలేదు। ఏక్కడో లేపుకొచ్చానని తగువెట్టుకుంది।"
"వార్ని, ఎవరికీ సూపించద్దన్నానా?"
"ఎళ్లెహే, రంగికి నేనేసుకున్నా మొల్తాడు కూడ తెసుస్తుంది। ఇది ఎలా దాచగలను।"
"సర్లే, అయ్యిందేదో అయ్యిందికాని... నేను రేపు రామాపురం మామిడి తాండ్రట్టుకొస్తాలే, నువ్వు దానికిచ్చి మచ్చిక చేస్కోవచ్చు।"
"నిజంగా తెస్తావా.."
"ఓరి బాబూ తెస్తాన్రా.. మరి యిసయం సెప్పు.. మన చినబాబు గారూ ఆళ్ల మంద ఎక్కడయినా కనపడ్డారేటి?"
"ఆ ఇందాకళ కనపడ్డారు। ఓ గంట క్రితం మనూరికి ఉత్తరంగా ముళ్ల చెట్ల అడివి ఉంది సూడు..."
"ఆ ఆ..."
"అటేపెళ్తూ కనిపించారు. అయినా ఆళ్ల మీద ఎందుకురా నీ కన్ను?"
"నీకు తరువాత సెప్తాన్లేరా। రేపు నీకు తాండ్ర అట్టుకొస్తా, మరుంటాను.."
ఫొను పెట్టేసాడు।

"వాళ్లు ఊరికి ఉత్తరంగా వున్న చిన్న అడివి వైపు వెళ్ళారట.." చెప్పాడు గోపలం।
"మరయితే ఇక్కడేం ఉన్నట్టు?" నర్సింగ్ గట్టిగా అన్నాడు
"ఏమో, అదే నాకు అర్థమవ్వట్లేదు।"
"ఇప్పుడిక్కడ మండపం లో వెదకడమా? వాళ్లని ఫాలో చేయడమా? తొందరగా తేల్చాలి, అసలే సాయంత్రం కూడా అయిపోతోంది" నర్సింగ్ ఎటు తేల్చుకోలేకపోతున్నాడు।
"ఖాన్ ని అడుగుతే?" సలహా పారేసాడు గోపాలం
"తొందరగా, తొందరగా" నర్సింగ్ కి ఆవేశం ఎక్కువవుతోంది।
గోపాలం ఖాన్ కి ఫోన్ కలిపాడు।

----------------------------------------------------------------
"తొందరగా తవ్వండి... చీకటి పడకుండా ఏదోఒకటి తేలిపోవాలి" తవ్వేకొద్ది ఆ రాయి ఏదో ముత లాగా కనపట్టంతో, ఉత్సాహంతో గాయత్రి అంటోంది॥॥
"ఏదయినా గునపంలాంటి, గట్టిదుంటే కొంచం తొందరగా పనవుతుంది।" చెమట తుడుచుకుంటూ దీపక్॥

Tuesday, May 24, 2005

Chapter 35

" అదిగో ఆ రాయి తీసుకు రా రా" దీపక్ అన్నాడు.
అక్కడ దొరికిన కొన్ని కట్టెలు రాళ్ళు వాడి తవ్వటం మొదలు పెట్టారంతా.

అలా దాదాపు అరగంట అయిన తర్వాత , కొంచం గుంట చేశారు.
" త్వరగా తవ్వు బావా, " సీత ఆట పట్టిస్తోంది.
" మూత తెరుచు కుంటోంది " ఉత్సాహంగా అన్నాడు దీపక్.
" యస్ , WE DID IT!!!" - లోకేష్ ఇంగ్లీష్ లొ అన్నాడు.
ఆనందం మితి మీరితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మానరిజం ఉంటుంది. కొందరు బాగా పగలబడి నవ్వుతారు. కొందరు కాళ్ళు ఊపుతారు . ఇంకొందరు క్లాప్స్ కొడతారు. కొంతమంది విజిల్ వేస్తారు. కొంతమంది ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. లోకేష్ కూడా అంతే.

మూత మెల్లగా తెరుచుకుంటోంది. అందరిలో చెప్పని ఆనందం, టెంషన్‌.
" దీపక్,, , జాగ్రత్త !!!!!!! అందులో ఎవైనా పురుగు పుట్ర ఉండచ్చు." గాయత్రి చెప్పింది.
" ఎవరి దగ్గరైన టార్చ్ ఉందా.." దీపక్ అడిగాడు.
" బావ నీ టార్చ్ లైట్ ఫొన్‌ ఉందిగా , దీపక్ అన్నకి ఇవ్వు" సీత అంది.
అన్నా అన్న పదం తప్ప అన్ని నచ్చాయ్ ఆ వాక్యంలో దీపక్ కి. అదే మాట గాయత్రి అని ఉంటే కొట్టేవాడు.

" ఏవో మెట్లు ఉన్నాయి. వెల్దామా" అన్నాడు దీపక్.
" మన దగ్గర వున్న సరంజామాతో వద్దు. లోపల ఏదైనా ఉండచ్చు. రేపు మళ్ళీ వద్దాం. మనకి అవసరమైన టూల్స్ అవ్వి తెచ్చుకుందాం. మనం గారంటీగా ఈ రహస్యాన్ని చేదించినట్లే. ఇప్పుడు తప్పు చెయ్యటం మూర్ఖత్వం " గాయత్రి అంది.
" అవును,, గాయత్రి చెప్పింది నిజమే . ఈ మూతని ఆ గాంగ్ ఈ రాత్రికి కనుక్కోవటం చాలా కష్టం. మనం రేపు వద్దాం. కూల్ గా రేపు ఆపరేషన్‌ ఫినిష్ చేద్దాం. " లోకేష్ మళ్ళీ ఇంగ్లీష్ వాడాడు.
" యా , సరే అయితే , రేపు వద్దాం, కాస్త చెయ్యి ఇవ్వచ్చు కదా గాయత్రి " దీపక్ అడిగాడు.
" కమ్‌ " గాయత్రి చెయ్యి అందించినట్లే అందించి తీసేసింది. దీపక్ బయటికి రావటానికి ట్రై చెయ్యటం , క్రింద మెట్ల మీద పడి పోవటం ఒక్క క్షణంలో జరిగాయి.. అందరూ నవ్వుతున్నారు. దీపక్ మాత్రం బయటికీ రావటానికి లేస్తూ ఆ మెట్ల వంక చూసి ఆశ్చర్యపోయాడు.
" హే , ఇక్కడ ఎవో paintings వున్నాయి ..., ఇది సమ్‌ గుహ ద్వారం అనుకుంటా... రండి ...
గాయత్రి వీటిని చూడు, నీకు ఏమైనా అర్దం అవుతాయెమో , come here fast!!!!" దీపక్ అరవటంతో అందరు మెల్లగా మెట్లు దిగి వెళ్ళారు.
" అవును ఇది నిజంగా గుహ లాగానే వుంది. ఆ టార్చ్ ఇక్కడ వెయ్యి దీపక్ " గాయత్రి అంది.
దీపక్ టార్చ్ అక్కడ కనిపిస్తున్న మొదటి painting పైన వేసాడు. కొండలోకి చెక్కినట్లు వున్నాయి అవి.
చాలా మంది ఏదో గుంపుగా వెళ్తున్నట్లు వుంది ఆ బొమ్మ. మనిషుల చేతిలో ఎవో కర్రలు పట్టుకొని ఉన్నారు.
పెద్ద కర్ర,చివరన నాలుగు గీతలు వున్నాయి ఆ కర్రలకి. అది ఏ కాలం నాటి బొమ్మో , వాళ్ళు పట్టుకున్నవి
ఎమిటో ఎవరికి అర్దం అవ్వటం లేదు.
" మన కాలం చిత్రాలు కావు అవ్వి. మనుషుల బొమ్మలు 2D లో వున్నాయి. ఆకారం బట్టి మనిషని అనుకునేట్లు ఉన్నాయి. Interesting !!!" గాయత్రి అంది.
" ఇదేదో ఊలపల్లి చరిత్ర లాగా వున్నది " దీపక్ జోక్ చేశాడు.

Monday, May 23, 2005

Chapter 36

/******************************************************/

"ఎక్కడికి వెళ్లారండీ? చంద్రశేఖర్ గారు మీకోసం ఎదురుచూస్తున్నారు"
"రండి రండి మూర్తిగారూ, ఎలా ఉన్నారు?", ఖాన్ నవ్వుతూ పలకరించాడు.
నోరు ఎలా విప్పాలా అని మూర్తి ఆలోచిస్తూ ఉండగానే ఖాన్ ఫోన్ మోగింది.
"ఒక్క నిముషం, హలో...", ఖాన్ దాన్నందుకుని బయటకు వెళ్లాడు.
"మీకు చంద్రశేఖర్ అనే స్నేహితుడున్నట్లు నాకు తెలియదే", అని గొణుగుతున్న తన భార్యను లోపలికి పంపి గటగటా చెంబుడు నీళ్లు తాగాడు కృష్ణమూర్తి.

/******************************************************/

"ఊఁ, గోపాల్, చెప్పు, వీళ్లు కనపడ్డారా?"
"అవును బాస్. ఇక్కడ నేలలోపలికేవో మెట్లలా ఉన్నాయి. అందరూ అవి దిగి వెళ్లారు"
"ఐ సీ! అర్థమైంది! నేను చెప్పేది జాగ్రత్తగా విను..."

/******************************************************/

"ఈ గుహ ఎంత లోపలికి పోతోందో చూద్దామా?", అడిగింది సీత.
"అందరూ ఒక నిముషం మాట్లాడటం ఆపండి", మెల్లగా హెచ్చరించి మెట్ల దగ్గరకు వెళ్లి చెవులు రిక్కించాడు మధు.
"నాకు కూడా వినిపించింది", అంతకన్నా మెల్లగా అని మధును అనుసరించాడు విజయ్.
నీలూ విషయం అర్థం చేసుకుంది.
"వాళ్లు ఇక్కడికి కూడా వచ్చేశారన్న మాట!"
"మనమనుకున్నట్లు హరికథ సెటప్ వాళ్లనేమీ డిలే చేయలేదు. కానీ ఇప్పుడు అది కాదు ముఖ్యం. ఈ గుహకి ఇంత సీన్ ఎందుకుందో కనిపెట్టాలి", అంది గాయత్రి.
"లోకేష్, మనలో ఒకరు వాళ్లకోసం పని చేస్తున్నారని నాకనిపిస్తోంది", మెట్లవైపు తీక్షణంగా చూస్తూ దీపక్ అన్న మాటలు విని అందరూ ఉలిక్కిపడ్డారు.

/******************************************************/

(విజయ్ - తిరుపతి - 2/22/2006 - సశేషం)