Saturday, July 23, 2005

Chapter 1 - "మా" లోకం - ఒక గొలుసు కథ

"మనం కలిసి రెండు సంవత్సరాలు అయిపోయింది కదా "అన్న మధు మాటలకి ఉలిక్కి పడి లేచాడు విజయ్‌.
అసలే వేసవి కాలం, పైగా ఎర్ర బస్సు ప్రయాణం కావటం చేత చాలా అలసటగా వుంది విజయ్‌కి. సెలవలకి మధు తాతయ్య గారి ఇంటికి వెళ్లటానికి ఎందుకు ఒప్పుకున్నానా అని మనసులోనే అనుకున్నా, బయటకి మాత్రం ఒక రకమైన నవ్వు నవ్వి మళ్లీ నిద్ర లోకి జారుకున్నాడు.

"కాస్తంత చోటు ఇవ్వండయ్యా! మా చిన్నోడు గొడవ చేస్తున్నాడు"
"కనిపించటం లేదా. ఇద్దరు పట్టే సీటు లో ముగ్గురం సర్దుకున్నాం. వెనుక వెళ్లి అడుగు"
"పొనీ మీరు జరగండి బాబు..."
"గంట నుంచుంటే దొరికింది సీటు. కొంచెం ఆగి లేస్తాను"

" టికెట్ టికెట్...."
" హోల్డాన్‌...పోలవరం వాళ్ళు దిగండి. "
" రయ్ ...రయ్ ..."

బస్సు అంతా కోలాహలం గా వుంది. చల్లటి యేరు గాలి తగలటంతో బస్సు లో ఒక్క సారి నిట్టూర్పులు వినిపించాయి.
" అమ్మా ..ఏమి తాపం రా బాబు" అని ఒక పెద్దాయన చెవి దగ్గర అరవటం తో మెలకువ వచ్చింది విజయ్‌ కి. ఏదో వింత ప్రదేశం లో వున్న అనుభూతి కలిగింది. పక్కన మధు లేక పోవటం గమనించిన విజయ్‌ కి ఒక్క క్షణం గుండె జల్లుమంది. ఊరు కాని ఊరు. పైగా జాగ్రత్త తక్కువ అవటం చేత వున్న డబ్బులు మధు జేబులో పెట్టాడు. మధు దిగిపోయాడా అన్న ఆలోచన వచ్చినా ,
" ఛ! మన వాడు అంత మతి మరపు కాదు లే" అని సర్ది చెప్పుకొని ప్రక్కన కూర్చున్న ఆవిడ ని అడుగుదామని తిరిగాడు. ఆవిడ మంచి నిద్ర లో వుంది. బయట చల్ల గాలి కంటే ఎండే ఎక్కువగా తెలుస్తోంది విజయ్‌ కి. అసహనంగా వున్న వాడి కోసమే అన్నట్లు ఆవిడ కదలటంతో అడగటానికి మొహమాట పడుతూనే అడిగాడు.
" మా వాడిని ఏమన్నా చూశారా?"
"ఎవరు బాబూ. లావుగా, చామన చాయగా వున్న ఆయనేనా?"
"చామన చాయనా ", బొగ్గు కంటె కొంచెం తెల్లగా వుండే కృష్ణ నీలం గుర్తుకు వచ్చి ఇక్కడ వారి నలుపు స్థాయి గురించి నవ్వు కొని , కష్టంగా తమాయించుకొని
" అవును వాడే అనుకుంటానమ్మా....కాదు వాడేనమ్మా!"
" ఆయనే సీటు ఇచ్చారు బాబూ. అక్కడ కండక్టరు గారి పక్కన మెట్ల మీద వున్నారు" ఆవిడ మాటలు పూర్తి అవ్వక ముందే అటు తిరిగి చూశాడు విజయ్‌. జనం లో కనిపించటం లేదు. మనసులోనే మధు ని అభినందించి,
"ఉండక చస్తాడా. ఉండకపోతే చస్తాడు!" ప్రకృతి ని ఆస్వాదించటం మొదలు పెట్టేడు విజయ్. పల్లె టూరికి రావటం ఇదే మొదటి సారి. పుస్తకాల్లో చదవటమేగాని ఎప్పుడు చూసే అవకాశం రాలేదు. ఏరు గాలి కొంచెం మంద పడటం మొదలయ్యింది. ప్రచండుడు ఆడుకుంటున్నాడు. రోహిణి కార్తె గురించి బామ్మ చెప్తూ వుండేది. చిన్నప్పుడు క్రి క్కెట్టు ఆట పైన వున్న మక్కువ తో ఎండ పట్టించుకోకుండా ఎలా ఆడామా అని ఆశ్చర్యం ఇప్పుడు కలుగుతోంది విజయ్‌కి.

( వంశీ - విజయవాడ - 6/17/5 - సశేషం)

Friday, July 22, 2005

Chapter 2

ఇంతలో ఒక బామ్మగారు వచ్చి
"ఏరా అబ్బిగా కాసంత జరుగు నేను కూర్చుంటాను" అని అన్నారు.
ఈ మధుగాడు ఎక్కడ చచ్చాడో అని మనసులో అనుకొని పాపం ముసలి ఆవిడ అని జాలిపడి లేవబోయాడు.
" ఆ...నువ్వు లేవక్కర్లేదురా అబ్బీ ...సర్దుకొని కూర్చుందాము లే..."
" పరువాలేదండి ..మీరు కూర్చోండి "
" మంచిదిరా మనవడా...వెయ్యేళ్ళు సంతోషంగా ఉండు నాయనా"
ఈ బామ్మలు అందరినీ మనవడు అని ఎందుకు పిలుస్తారో అని బ్రహ్మసందేహం కలిగింది.
సీటు లో నుంచి లేచి వొస్తుంటే, బస్సు ఒక్క సారి గా బ్రేక్ వేయడం తో తల వెళ్ళి ఒక అమ్మాయి తల కి తగిలింది.
" సారీ అండి. " అన్నాడు విజయ్ .
" పరువాలేదండి " అంది ఆ అమ్మాయి అసలైన పల్లెటూరు అందాలు ఇప్పుడు కనిపించాయి విజయ్ కి. బహుశా బామ్మగారి మనవరాలు అయ్యి ఉండొచ్చు. లంగా వోణి ధరించి ఒక చేతిలో మర చెంబు మరో చేతిలో చేతి సంచి.
" ఏ ఊరు రా మీది మనవడా?" అంటు బామ్మగారు వెనుక ప్రశ్నలు మొదలు పెట్టారు. అవి ఏమి విజయ్ కి వినిపించడం లేదు. మనసు ఆ అమ్మాయి నే చూస్తూ ఉండి పోయింది. పల్లెటూరు లో కూడా ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారని ఇప్పుడు అనిపించింది విజయ్ కి. మధు గాడు ఎప్పుడూ పల్లెటూరు అమ్మాయిల గురించి తెగ చెప్పేవాడు. అది అంతా డబ్బా వేస్తున్నాడని అనుకొనే వాడు విజయ్. జీవితం అంతా పట్నం లో గడపడం చేత పట్నం అంటేనే మక్కువ ఎక్కువ. కాని ఇప్పుడు మాత్రం అలా అనిపించడం లేదు.
" అమ్మా నీలు... కాసింత మంచి నీళ్ళు ఇవ్వమ్మా.."
" నీలు...బావుంది పేరు.." అని అనుకొని బామ్మ గారి సరైన వరసకి ఆనందించాడు.

(సూరి - విశాఖపట్టణం - 6/18/5 - సశేషం)

Thursday, July 21, 2005

Chapter 3

ఇంతలో ముందు వరసలో ఉన్న ఇద్దరూ లేచి వెళ్ళడంతో , నీలు కూర్చొని పక్కకి జరిగి కూర్చుంటూ విజయ్ ని కూర్చోండి అంది.

"Thanks." అన్నాడు విజయ్.
"పర్వాలేదు" చిరునవ్వుతో అంది , నీలు.
ముత్యాల పలువరస , చిన్నగా బుగ్గ మీద పడే సొట్ట , ప్రశాంతతని వెదజల్లే కళ్ళు. క్షణం పాటు తాను అమ్మాయిని తదేకంగా చూస్తున్నానని మర్చిపోయాడు విజయ్. వెంటనే తల పక్కకు తిప్పు కున్నాడు.
"ఇక్కణ్నించి ఊలపల్లి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది ?"
"ఇంకో ఇరవై నిమిషాలు."
బయటకు చూశాడు, పచ్చని చేలు , పల్లె వాతావరణం, దూరంగా ఉన్న తాడి చెట్లు, భూమి ఆకాశం కలిసిందా అనిపించే దృశ్యం
,చాలా బావుంది అనుకున్నాడు విజయ్।
తల పక్కకు తిప్పేసరికి కనబడింది, రిలయన్స్ ఇండియా మోబైల్ ప్రకటన, గ్లోబలైజేషన్ అంటే ఇదేనేమో చిన్నగా నవ్వుకున్నాడు.
కునుకు తీశాడు మళ్లీ,
ఈ సారి కలలో అన్ని రిలయన్స్ ప్రకటనలూ కనపడుతున్నాయి.గట్టిగా వినిపించిన శభ్దానికి లేచాడు.
ఏదో జాతర జరుగుతూంది,పెద్ద ఊరేగింపు,పులిరంగు వేసుకుని కొంతమంది కొరడాలతో కొట్టుకుంటూ వెళ్తున్నారు.
డండ డరడ డండ డరడ డం - డండ డరడ డండ డరడ డం (2)

"నూకాలమ్మ జాతర" అడక్కుండానే చెప్పింది నీలు.
"Excellent. Awesome" అనేశాడు తడబడకుండా, భలే నిద్ర చెడ గొట్టారు అనుకుంటూ.
"Do you mean it ?" అడిగింది నీలు, విజయ్ వంక చూస్తూ , కళ్ళు చిట్లించి.
ఒక్క క్షణం ఆగి నవ్వేశాడు , అమె కూడా తోడయ్యింది.

"ఊరికి కొత్తా ?"
"అవును, మా స్నేహితుడు మధు తో వచ్చా, రెండు రోజులు ఉంటాను ఇక్కడ , కాలక్షేపం కాదేమో అనిపిస్తూంది"
"సాయంత్రం ఖాళీ దొరికితే జాతర చూడడానికి రండి , మంచి కాలక్షేపం, నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయి"
"సినిమా పాటలూ, కుప్పి గంతులూ కాదు కదా ? "
"కాదు , కూచిపూడి నృత్యం , కర్ణాటిక సంగీతం" కోపంగా చెప్పింది.
"ప్రదర్శన కోసం కళాకారులు వేరే ప్రాంతం నించి వస్తారా ?"
"ఏం, సినిమా వాళ్ళు లేక పోతే మీరు రారా ? " వ్యంగ్యంగా అంది.
"అదేం కాదు, సహజంగానే నాకు సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం, చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం"
ఇంకా ఏదో చెప్పుదామనుకున్నాడు, కాని మళ్లీ డప్పుల శబ్దం అయ్యేసరికి మానుకున్నాడు.

"వెనక్కి జరగండి" అని ఎవరో అనడంతో కునుకు లోంచి బయటికి వచ్చాడు విజయ్.
"ఇంకెంత సేపు పడుతుంది ?"
"20 నిముషాలు " ప్రశ్నార్ధకంగా చూసిన విజయ్ తో చెప్పింది,
"మీరు ఇదివరకు అడిగిన దగ్గరే ఉన్నాం మనం, జాతర వెళ్లిపోయింది , ఇక బస్సు కదులుతుంది ", నవ్వుతూ చెప్పింది నీలు.
రిలయన్స్ ప్రకటన అక్కడే ఉంది. తన నిద్రని తలుచుకుని తనలోనే నవ్వుకున్నాడు.
ఇంతలో వచ్చాడు మధు, అయాస పడుతూ.
"ఎక్కడున్నావ్, ఏమై పోయావ్ ? "
"జాతరలో పులి డాన్స్ చేస్తున్నా"
"నీలాంబరి, సాయంత్రం నీ నృత్య ప్రదర్శన ఉందటగా ?" నీలుని అడిగాడు మధు.
"అవును" ఓరకంట విజయ్ ని చూస్తూ అంది.

(కళ్యాణ్ - కాకినాడ - 6/19/5 - సశేషం)

Wednesday, July 20, 2005

Chapter 4


విజయ్ కి మళ్లీ నిద్ర పట్టింది।
సాయంత్రం జాతర లో నీలాంబరి కూచిపుడి నృత్యప్రదర్శన కి ముందు వరసలో కూర్చున్నాడు। ఎవరో వచ్చి "తుండు గుడ్డ వేసి వెళ్ళాను" అంటే, తగాదా పడి మరీ కూర్చున్నాడు। మధు పక్కనుంచి తగ్గుదామని అంటున్నాసరే, వినిపించుకోడే॥ కావాలంటే మధుని వెనక్కి వెళ్లమని సలహా పారేసి, తను మాత్రం ముందు వరసలోనే కూర్చుంటాను అని పంతం పట్టాడు।

"తరువాత కార్యక్రమం మన గ్రామ అమ్మాయి నీలాంబరి కూచిపుడి నృత్య ప్రదర్శన - భామా కలాపం" అని పెద్దగా మైకులో చెప్పారు।

అంతే, విజయ్ ఆ తెర ఎప్పుడు తెరుస్తారా అని ఆతృతగా చూస్తున్నాడు। తెర తెరిచారు। నీలాంబరి, కాదు కాదు, భామ, సత్యభామ, వయ్యారంగా, "భామనే, సత్యాభామనే ....." అంటూ జడని ఒక చేత్తో పట్టుకుని, వయ్యారంగా ముందుకి నడుస్తూ వచ్చింది। "ఆ నడకలో ఏమి సొగసు, ఏమి హొయలు.... పొగడటానికి ఇంకొన్ని పదాలు వుంటే బాగుండు" అనుకున్నాడు విజయ్।

ఇంతలో, భామ వెదుకుతూ,
" నల్లని వాడు, పద్మ నయనంబుల వాడు, కృపారసంబు పైజల్లెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చె, నో మల్లియలార! మీ పొదలచాటున లేడు గదమ్మ! చెప్పరే", అంటూ తెగ ఆరాట పడి పోతోంది।

అంతే, ఒక్క సారి భామ మొహంలో చెప్పలేని ఆనందం।
ఎందుకు?
ఇంకెందుకు, కృష్ణుడు, మన విజయ కృష్ణుడు, కనిపించాడు।
నీల మేని ఛాయ, అంటే నల్లకి కొంచెం తక్కువగా,
తలపై ఒక నెమలీక పెట్టి,
చేతిలో మురళి పట్టి,
పట్టు పీతాంబరాలు కట్టి,
చిరునవ్వు నవ్వుతూ,
కుడి కాలు ఎడంకాలు పక్కన పెట్టి అదో రకంగా కృష్ణుడిలా వంగి, భంగిమలో ప్రత్యక్షమయ్యాడు।
భామ కృష్ణుడు చుట్టూ మూడు నాలుగు సార్లు నాట్యం చేస్తూ తిరిగింది।
అంతలో," ఏంటో, ఈ కూచిపూడి, వెదికనంత సేపు ఓ తెగ వెతికేస్తారు, మళ్లీ కనపడగానే, వచ్చి మీద పడిపోవాలిగాని, ఇలా చుట్టూ తిరగడాలేమిటి !!!! తిరిగింది చాల్లేవమ్మ, దగ్గరకు రా", అని అనుకున్నాడు కృష్ణుడు।
తిరిగాల్సిందంతా తిరిగి భామ కృష్ణుడి దగ్గరకి వచ్చి భుజం మీద చెయ్యి వెయ్యబోయింది......
అంతే, "కీ..............చ్" మని శబ్దం వినిపించింది। కృష్ణుడు పట్టు తప్పి కిందపడబోయాడు...."
విజయ్ ఒక్క సారి ఉలిక్కి పడి లేచాడు। బస్సు డ్రైవరు ఒక సడన్ బ్రేక్ వేశాడు। సీటు లోంచి ఇంచుమించు పడిపోబోయాడు విజయ్। పక్కకి చూసాడు। నీలాంబరి చిత్రంగా తన వైపే చూస్తోంది।
"మీరు భలే నిద్ర పోతారండీ...." పొగడ్త కి దూరంగా, వెటకారానికి దగ్గరగా అనిపించింది విజయ్ కి
అదో రకమయిన నవ్వు నవ్వాడు విజయ్
"నిద్రలో మళ్లీ నవ్వు కూడాను, ఎం కలొచ్చిందండీ....... " ఇది పూర్తిగా వెటకారమే
" అబ్బే, ఏం.....ఏం..... లేదండీ...." తడబడుతూ విజయ్
వెనక సీట్లోంచి మధు అందుకున్నాడు।

"ఆ వాడంతేలే నీలు। ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అలా నిద్ర పోయే వరంతో పుట్టాడు। ఇందాకా నే చెప్పాగా, వాడు ఇప్పుడే లేవడని...."
"ఛా.. విజయ్ గారు, ఇంత బండ నిద్రేమిటండీ బాబు..."
"ముందు, డబ్బు తీయాలి, వాణ్ణి తాపీగా తిడుదువుగానీ..."
విజయ్ మొహం లో question mark చూసి, నీలు, "మీరు పది నిమిషాల్లో నిద్ర లేస్తారని నేను, లేవరని మధు పందెం కట్టామండి। ఇంత కుదిపేసే బస్సు లో, ఇంత ఎండలో ఐదు నిమిషాలు కూడా నిద్ర పోవటం కష్టం కదా, నేనే గెలుస్తాను అని అనుకున్నాను.../ మధు అంత గట్టిగా పందెం కట్టినప్పుడే ఏదో వుంది అనుకున్నాను కాని...పందెం కట్టాను ఛా నేను ఓడిపోయాను"

"నేను పడుకున్నప్పుడు మా వెనుక సీట్లో కూర్చుని,
కూర్చుంటే పర్వాలేదు, నీలు తో మాట కలిపి,
మాట కలిపితే పర్వాలేదు, కాని నా నిద్ర గురించి మాట్లాడి, bet కట్టి నా image ని damage చేస్తావా మధు। చూస్తా మధు, నాకూ టైము రాక పోతుందా ..."

(శ్రీ హర్ష - 6/19/5 - సశేషం)

Tuesday, July 19, 2005

Chapter 5

"మీకు మధు ఎలా పరిచయం?"
"ఇంజినీరింగ్ కలిసి చదివామండీ. రెండేళ్ల క్రితం ఉద్యోగాలకోసం వేరేవేరే ఊర్లకెళ్లాల్సొచ్చింది. ఆ తర్వాత ఇదే కలవడం"
"మంచి స్నేహితులన్నమాట"
"అన్నమాటే. కానీ సిగరెట్లూ, మందూ అలవాటు చేస్కున్నాడు కాలేజీలో. అప్పట్నుంచీ కొంచెం దూరంగా ఉంటున్నాను"

ఉప్పూకారం వేసిన పచ్చిజామకాయని ప్రశాంతంగా మింగుతూ కిటికీలోంచి ఏటి అలలని చూస్తున్నవాడల్లా గిరుక్కున ముందుసీటువైపు తలతిప్పాడు మధు.

"ఏంటి మధూ? నిజమేనా"
"అలాంటిదేమీ లేదు నీలూ, రేయ్!"
"నీలు నీకు బాగా పరిచయమేగా, తన దగ్గర దాయడమెందుకు మధూ? ఇంతకీ కనీసం డ్రగ్స్ తీస్కోవటమన్నా మానేశావా లేక గుర్రపు రేసులకెళ్లిన ప్రతిసారీ ఆ మాఫియావాళ్లకి నీ రెండో భార్య నగలమ్మి డబ్బిస్తూనే ఉన్నావా? ఎన్నిసార్లని చెప్తామండీ నీలూగారూ"

కంగారుపడటం మొదలుపెట్టిన నీలుకి విషయం అర్థమైంది. కష్టపడి నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ, "అవునవును, ఎన్నని చెప్తాం".

"బాబూ విజయ్, ఇంకాపెయ్. తప్పిదారి నీలూతో ఆ నిద్ర పందెం కట్టాను. అసలే ఈ ఊర్లో మనం కొంచెం ఫేమస్. డీసెన్సీ విపరీతంగా మెయిన్ టెయిన్ చెయ్యాలి. నువ్విలాంటి గండాలు పెట్టకు. అదిగో, మలుపుకూడా వచ్చేస్తోంది, నేనా ముందుకెళ్తాను, మీరు తర్వాత తీరిగ్గా దిగండి"

(విజయ్ - తిరుపతి - 6/19/5 - సశేషం)

Monday, July 18, 2005

Chapter 6

ఊలపల్లిలో వేంకట్రామయ్య గారు రచ్చబండ వద్ద పచార్లు చేస్తున్నారు. పన్నెండింటికల్లా రావల్సిన బస్సు వచ్చే సూచనలు కనబడటం లేదు.

"ఏమయ్యా సూర్యం, నువ్వు కూడా బస్సు కోసమేనా?"
"అవునండీ, మా అమ్మగారు మా పెద్దన్నయ్యగారి అమ్మాయిని తీసుకువస్తున్నారు సెలవలకని"
"నీలాంబరే కదా? లక్షణమైన పిల్ల. ఈ ఊరంటే ఎంత ఆపేక్షో! ఎప్పుడు వీలు దొరికినా వచ్చిపోతుంటుంది. మా మనవడు మధు నీకు తెలుసుగా. సంవత్సరంగా పోరుతుంటే ఇప్పటికి వీలు చిక్కిందన్నాడు. చిన్నప్పుడైతే ప్రతి రెండు మూడు నెలలకీ వచ్చి బస్సు దిగీదిగగానే మా ఇంట్లో ఉన్న ఉయ్యాల ఊగేందుకు పరుగుతీసేవాడు. చిన్నపిల్లలు పెరక్కుండా అలాగే మనదగ్గరే ఉంటే బాగుండుననిపిస్తుందయ్యా ఒక్కోసారి"

"!!!ఐగోరూ !!!"
"ఏంట్రా ఆ పొలికేక! చిన్నగా పిలవలేవూ?", గోపాలుడి వైపు తిరిగారు వేంకట్రామయ్య గారు.
గోపాలుడు పక్కగా వంగి రచ్చబండకి కుడి చెవిని ఆనించి, రెండోచెవిని ఎడమచేత్తో అదిమిపెట్టి, కళ్లుగట్టిగా మూసుకొని ఉన్నాడు, "బస్సొత్తాందయ్యా".

"పర్లేదే, శుక్రవారం రోజు అరగంటే ఆలస్యమంటే గొప్పే. అవునూ, మధు ఎన్ని రోజులుంటాడండీ?"
"వాడు రెండురోజులన్నాడయ్యా. కానీ మూడు, నాలుగు వారాలన్నా ఉండకపోతే నా ముసిల్ది ఒప్పుకోదు. ఎలాగో సర్దిచెప్పాలి. సంవత్సరమైంది వాణ్ని చూసి. ఆ పట్నం గోల భరించడం నా వల్లకాదు. అందువల్ల ఎవరు ఎవరిని చూడాలన్నా వాడిక్కడికి రావలసిందే"
"ఈసారి జాతర కూడా ఉందిలెండి. దానికి కూడా వెళ్లినట్లుంటుంది"
"జాతరా, వనభోజనాలూ, పిండివంటలూ, ఇలాంటివెన్నో ఎరవేయాల్సొచ్చిందయ్యా. అదీ ఒకందుకు మంచిదయిందిలే. వాడి స్నేహితులకి కూడా ఈ విషయాలు చెప్పాడు. వాళ్లు కొందరు ఈ బస్సుకి, కొందరు ఈ సాయంత్రం బస్సుకీ..."

"!!!ఐగోరూ !!!"
"ఈ పొలికేకలతో నాకు సరీపోయింది. ఏరా, బస్సు మలుపు తిరుగుతోందా?"
"మొత్తానికి క్షేమంగా చేరారండీ. అదిగో, మీవాడు తలుపు దగ్గరే ఉన్నాడు"

బస్సు దుమ్మురేపుకుంటూ వచ్చి, రచ్చబండని సగం చుట్టు చుట్టి ఒక్క ఆఖరి కుదుపుతో ఆగింది.

(విజయ్ - తిరుపతి - 6/19/5 - సశేషం)

Sunday, July 17, 2005

Chapter 7

" ఏమే సీతా,, బావా వాళ్ళు వచ్చే టైము అవుతొంది. త్వరగా కానీ. ఎర్ర నీళ్లూ అవ్వీ దగ్గర పెట్టుకో"
" పొద్దున్నెప్పుడో తిని ఉంటాడు బిడ్డ!"
" ఈ గోపాలుడు ఎక్కడికి తగలడ్డాడో"
" రచ్చబండ దగ్గరకి వెళ్ళాడే" , " ఈ మంగమ్మ గారి మనవడి రాక ఏమిటో గాని, ఊరినంతా చంపేస్తుంది ఈవిడ", మనసులో
చాలా కాలం తర్వాత చూడబోతున్న బావని తలచుకొని నవ్వుకొంది సీత.

* * * * * * * * * * *



మామిడి తోరణాలు, పసుపు, కళ్లాపి కలిసిన సుగంధం, ఊరిలో పండగ వాతావరణం అన్ని కొత్తగా వున్నాయి విజయ్ కి.

" నువ్వు చాలా లక్కీ రా మధూ"
" ముందు రానన్నావు కదరా. ఇప్పుడు అంత లాగా నచ్చిందా!"
" ఈ ప్రశాంత వాతావరణం చూస్తే ఇక్కడే ఉండి పోవాలి అనిపిస్తోంది రా"
" నాకు తెలుసులే రా, నా దగ్గర ఎందుకు దాస్తావు చెప్పు"

పల్లెటూరి అందాలన్నీ చూస్తూ పోతున్న విజయ్ కి అసలు అలుపు, ప్రయాణం బడలిక తెలియటం లేదు.
కవులు అంత గొప్ప కావ్యాలని రాజులు వుండే పట్టణాలలో ఉండి ఎలా రాయగలిగారో అని మొదటి సారి ధర్మ సందేహం కలిగి ఆలోచన లో పడ్డాడు.

" మీరు మావాడికి ఎప్పటినుండి తెలుసు బాబూ" వేంకట్రామయ్య మాటలకి మామూలు లోకం లోకి వచ్చి,
" తాతయ్య గారూ, మీరు అని పిలవకండి. కొంచం ఇబ్బంది గా వుంది. మధు నాకు ఆరేళ్లుగా తెలుసు"
" ఈ రోజు మా ఊరి జాతర. సాయంత్రం చాలా కాలక్షేపంగా వుంటుంది. పడుకోక వచ్చి తప్పక చూడండి ఇద్దరు. రేపు నిద్ర పోవచ్చు. "
" తెలుసండి. ఇందాక బస్సు ఆగినప్పుడు చూశాను. జాతర చూడటం ఇదే మొదటి సారి. అందుకని తప్పకుండా వస్తాము..ఏరా
మధూ..ఏమంటావు.. "
" అతిధి దేవో భవ! మీరు ఎలా చెప్తే అలాగే సార్"

మాటల్లోనే ఇల్లు వచ్చేసింది.

" ఉండండి. ఉండండి. అమ్మాయి దిష్టి తీశాక వద్దురు గాని"
" ఏమిటే, నీ చాదస్తాలూ నువ్వునూ. వాడు ఎండని పడి వస్తే. పైగా వాళ్ళు ఇంజనీరు పిల్లలు " వేంకట్రామయ్య విసుక్కున్నారు.
" ఏ, అయితే కొమ్ములు గానీ ఉంటాయా..వాళ్ళు తినేది అన్నం కాదా! ఏ గాలి అయినా చెప్పి వస్తుందా ఏంటి "

మొహమ్మీద కొట్టిన అనుభూతి కలిగింది అక్కడి అందరికి. విజయ్ కి అర్థం అయ్యింది బామ్మ గారి మాట తీరు, పద్ధతి.

"ఏకసంథాగ్రాహి" అని ఎవరో గొణిగిన శబ్దం విని పైకి చూశాడు. సీత నవ్వుతూ పరిగెత్తి చెంగున లొపలికి వెళ్ళి పొయింది.
ఏమీ అర్థం కాలేదు విజయ్ కి.

మెల్లిగా లోపలికి అడుగు పెట్టి చూశాడు. వేంకట్రామయ్య గారిది చాలా పెద్ద ప్రాంగణం. పెద్ద పెద్ద అరటి చెట్లు,
చిన్న చిన్న గడ్డి బాటలతో చాలా ముచ్చటగా వుంది ఆ ప్రదేశం. వరండా, పెద్ద హాలు. హాలు కు రెండు వైపులా
గదులు. నడి ఇంట్లోకి వెలుతురు వచ్చేందుకు చిన్న అద్దపు నగిషీ కిటికీ. ఆగ్నేయంలో వంటగది. హాలు కి ఆవలి పక్క
ఒక బుల్లి భోషాణం, పక్కనే పెద్ద కాళ్ళ కుర్చీ. ఈశాన్యంలో మెట్ల ద్వారా పై అంతస్తులోకి వెళ్లే మార్గం. గోడల మీద అక్కడ అక్కడ ముగ్గులు. ఇంటికి తగ్గ మనస్సు ఆయనది అనిపించింది. ఆ చుట్టు పక్కల గ్రామాల్లో వేంకట్రామయ్య దంపతులు లేనిదే ఏ శుభకార్యమూ జరగదని మధు చెప్తూ ఉండేవాడు. చదువు మీది ఆసక్తితో వయోజన విద్య ద్వారా పదవ తరగతి పూర్తి చేశారట తన షష్టి పూర్తి తర్వాత. ఆ సర్టిఫికేట్టు కనిపించే విధంగా తగిలించారు. వంట గది మూల ఒక పెద్ద ధ్యానమందిరం.అందులో త్యాగరాజు గారి బొమ్మ చూసి ఆగలేక అడిగాడు మధు ని.
" ఇంట్లో ఎవరైనా సంగీతము నేర్చుకుంటున్నారా"
" ఆ, వుందిలే ఒక కోతి. పరిచయం చేస్తాను"
" కాస్తంత ఎంగిలి పడండి రా! తర్వాత తీరిగ్గా కబుర్లు చెప్పుకోవచ్చు. " మంగమ్మ గారి అరుపుతో కోతి పరిచయం మరుగున పడింది.

( వంశీ - 6/21/05 - సశేషం)

Saturday, July 16, 2005

Chapter 8

కాళ్లు కడుక్కుని వచ్చి ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు।
పెరట్లోంచి తెచ్చి రెండు అరిటాకులు వేశారు।. బామ్మ గారు వడ్డన మొదలెట్టారు।. బామ్మ గారి నోరే కాదు, చేయి కూడా పెద్దదని తెలుసుకున్నాడు విజయ్।. ముందుగా మామిడికాయ పప్పు, ఆపైన వంకాయకూర, చేమదుంపల వేపుడు, దోసకాయ పచ్చడి, కొత్త ఆవకాయ, వడియాలు ఒకటి తరువాత ఒకటి వడ్డించారు.। నెయ్యి అయితే వెయ్యడం లేదు, పొయ్యడమే.... మామూలుగానే కింద తినటం తక్కువ, అందులోనూ అరిటాకులో ఐతే మరీ తక్కువ, ఇంత పెద్ద ఆకులో అయితే అస్సలు తినలేదు విజయ్.। వడియాలు అందుకోవాలంటే, ముందుకి వంగి కాస్త కష్టపడ్డాడు। కాని ఏమి రుచి, మామిడికాయ పప్పులో కొత్తావకాయ నంచుకుని తింటే, దాని ముందు ఏ రుచీ నిలవలేదు.। మెల్లగా పులుసు, తరువాత పెరుగు।. పెరుగు గేదె పాలదేమో, మీగడతో, బామ్మ గరిటతో కోసి వేశారు। పెరుగులోకి పెద్ద మామిడి రసాల పండు, వద్దంటున్నా వడ్డించారు।.

భోజనాలయ్యాక, నిద్రతన్నుకొచ్చింది।. ఒక వైపు మధుచేత పరిచయం చేయించుకుందామని వుంది, కాని నిద్ర నిలవనియ్యలేదు.। మధుకయితే ఇంకా ఎక్కువ నిద్ర వస్తోంది.

। "ఎప్పుడో పొద్దున్నుంచి ఎండలో బండి ప్రయాణం చేశారు, కాస్త నడుంవాల్చండ్రా" అని బామ్మ అంది.। రోగి కోరిందీ పాలే, వైద్యుడు చెప్పిందీ పాలే అని, ఇద్దరూ ఆనందంగా ఊ కొట్టారు.।
బామ్మ వెనుక నుంచి సీత, "సాయంత్రం పెందళకడే జాతరకి వెళ్లాలి, బండ నిద్ర పోవద్దు", ఒక చురక విసిరింది.।

ఒళ్లు తెలియకుండా నిద్రపోతున్నారు ఇద్దరుూ. ఏదో గాజుల అలికిడి అయి, ఎవరో పక్కనే లేపుతున్నట్టు అనిపించింది విజయ్ కి, కలేమో అనుకున్నాడు, కాని కాదు.....
"బావా, లే బావా, జాతర కి వేళవుతోంది, లే బావా"
"బామ్మ లేపమని చెప్పింది, లే బావా"

మధుకి ఇంకా నిద్రపూర్తిగా తీరలేదు।
విజయ్ జాగ్రత్తగా నిద్ర నటిస్తున్నాడు। ఇంకాస్త దగ్గర కి వచ్చినట్టనిపించింది మనిషి।

మధుని కుదుపుతూ, "లే బావా, లెమ్మంటుంటే..... మేమంతా జాతరకి వెళిపోతున్నాము.."

మధుకాస్త కదిలాడు। కాని ఇంకా నిద్ర మత్తు వదలలేదు।.
ఈసారి, ఇంకా దగ్గరకి వచ్చినట్టు తెలిసింది విజయ్ కి। మెల్లగా ముందుకి వంగింది సీత, "బూచి బావా" అని గట్టిగా చెవులో అరిచి, మధు లేచి "కోతి పిల్లా" అని తిట్టేలోపు తుర్రు మంది.। ఈలోగా విజయ్ కూడా లేచాడు।. ఇద్దరూ ఒళ్లు విరుస్తూ లేస్తున్నారు..
బామ్మ వచ్చి, "తొందరగా తయారవ్వండర్రా॥। మొదటి నాట్యానికే అందుకోవాలి" అని అన్నారు।.
ఇంతలో సీత వచ్చి,"బామ్మా, నేను వెళ్తున్నానే, మా వాళ్లంతా వచ్చేసుంటారు"
"అంత తొందరెందుకే, కాస్సేపాగు, బావా వాళ్లు కూడా వస్తారు"
"బావ వొచ్చేసరికి చీకటడిపోతుందిలే కాని, నే వస్తా.."
"ఏంటే సీతా, మీ కోతి మూక కూడా వస్తోందేంటి..."
"ఇదిగో బూచి బావా, కోతి గీతి అన్నావంటేనా...., జాతరకి రా, నీ పని చెప్తాను" అని అంటూ బయటికి వెళ్లింది సీత।.
"ఒరేయ్ అబ్బాయ్, నేను కూడా వెళ్తున్నా, మీరు స్నానాలు చేసి, వొచ్చేయండి, సరేనా"
"సరే బామ్మా"
"జాతరెక్కడో తెలుసుకదరా, రాములారి కోవెల ఎదురుకుండా మైదానంలో"
"తెలుసులేవే, మేం వచ్చేస్తాం"

అంతా జాతరకి బయల్దేరారు। మధు, విజయ్ తయారవుతున్నారు।
"ఆ అమ్మాయి ఎవరు?"
"ఎవరు? సీతా? నా మరదలు.। ఇందాకా కోతి వుంది అన్నాను చూడు, ఇదే ఆ కోతి.। మంచి చలాకీ పిల్లలే, ఇక్కడే తాతగారి దగ్గరే వుంటుంది, ఇప్పుడు 8 క్లాస్।"
"మరి బూచి బావ..."
"అదా, చిన్నప్పుడు దాన్ని, బూచాడొచ్చాడు, బూచాడొచ్చాడు అని ఏడిపించేవాణ్ణిలే, అందుకని అలా పిలుస్తుంది॥॥"
"మంచి nick name" అని నవ్వాడు విజయ్.
బయట వాతావరణం చల్లబడింది, మంచి గాలి కూడా వీస్తోంది।.
తయారవుతుంటే, మధు వచ్చి, "విజయ్, ఇద్దరం పంచలు కడదామా?" అని అన్నాడు, "సై" అన్నాడు విజయ్।.
కష్టపడి, ఎలానో అలా తాతగారి పంచెలు కట్టి బయలుదేరారు ఇద్దరూ.।
బయట గాలికి పంచలెగురుతుంటే, ఒక చేత్తో వాటిని పట్టుకుని, ఇంకొక చేత్తో కండువా సర్దుకుంటూ, అదో కొత్త అనుభూతిని పొందుతున్నాడు విజయ్।.
గాలి ఇంకొంచెం పెరిగింది, చెట్లు గాలికి ఊగుతున్నాయి, మెల్లగా మేఘాలు కమ్ముకున్నాయి, రెండు మూడు
చినుకులు పడ్డాయి।. మంచి ఎండలవల్ల వేడిగా వున్న నేల మీద చినుకులు పడీ పడంగానే ఇంకి పోయాయి. ఇద్దరూ వేగం పెంచారు।

"ఇంకా ఎంత దూరం"
"ఒక పదిహేను నిమిషాల నడక అంతే"
"తొందరగా నడువు, వాన పడకపోతే బావుండు"
"ఆ ఇదంతా ఆరంభశూరత్వంలే, పెద్ద గాలి, రెండు మూడు చినుకులు, ఆశ చూపించి వెళ్లి పోతాయి ఈ మేఘాలు"
మరికొన్ని చినుకులు పడ్దాయి, తొలికరి వానకి తడిసిన ఎండిన నేల నుంచి వచ్చిన వాసన గుప్పుమని తగిలింది వాళ్లకి.
"ఎప్పుడో చిన్నప్పుడు గుర్తు ఈ వాసన.... భలే వుంటుంది"
"నాకు కూడా చాలా ఇష్టం ఈ వాసన..."

ఇంకొంచెం తొందరగా నడవటం ప్రారంభించారు।.
గాలి ఇంకొంచెం ఉద్ధృతంగా వీస్తోంది, చినుకులూ పెరిగాయి।. వాన పడకపోతే బావుండు, చక్కగా జాతర చూడొచ్చు అని ఇద్దరికీ లోపల వుంది, కానీ ఆ విషయం వానకేం తెలుసు॥।?

మెల్లగా పరుగందుకున్నారు ఇద్దరూ, వాళ్ల కన్నా ఎక్కువ జోరుగా మొదలయ్యింది వాన।. ఇక కురవటం మొదలుపెట్టింది।. మొత్తం తడిసిపోయారిద్దరూ.

పరుగు ఆపి, "ఆ చెట్టు కింద వుండి, వాన తగ్గాక వెళ్దాము", మధు అన్నాడు।.
"జాతర దగ్గరకే కదా", విజయ్ ఆశగా అడిగాడు॥।.

తనకీ అక్కడికే వెళ్లాలని వుంది.॥॥। వాన మాత్రం తగ్గే సూచనలు కనపడటంలేదు.। గాలి నిముష నిముషానికీ ఎక్కువవుతోంది।. ఇదేదో మామూలుగా ఆగిపోయే వానలా లేదని వాళ్లకి ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది.। ఉన్నట్టుండి ఒక్క సారి ప్రచండంగా గాలి వీచింది, వాళ్లు నుంచున్న చెట్టు పడిపోయిందేమో అన్నంత భయం కలిగింది ఇద్దరికీ.। పక్కన వున్న పూరిపాకల కప్పు వూడి తాటాకులు ఎగిరిపోయాయి, ఇంకో పాక గోడ కూలి పోయింది।.

జాతరకి వేసిన పందిరి ఒక్క పదినిమిషాలు మాత్రమే కాసింది వానని, అంతే, తరువాత నీళ్లు కారటం మొదలుపెట్టింది।. ఈ గాలితో, సగం పందిరి పడిపోయింది।. వేంకట్రామయ్యగారినీ, భార్యనీ, మనవరాలినీ పక్కనే వున్న రాముల వారి కోవెెలలోకి చేర్చారు కష్టం మీద.। మూడు వందల ఏళ్ల నాటి పాత గుడి అది, అదే ఆఛ్చాదన ఇచ్చింది అప్పుడు వాళ్లకి.। ఆ గుడి మాత్రం ఎంతమందికి ఆశ్రయం ఇవ్వగలదు।? పందిరి దగ్గర ప్రజలు చెట్టుకొకళ్లు పుట్టకొకళ్లు అయిపోయారు।. పశువుల కొట్టంలో పశువులు బంధాలను తెంచుకుందామని విశ్వప్రయత్నం చేస్తున్నాయి, గట్టిగా అరుస్తున్నాయి।. ఈ తుఫాను జోరులో, గాలి హోరులో వాటి గోడు ఎవడికి వినిపిస్తుంది?

"పిల్లలు ఏమయ్యారో॥।"మంగమ్మ గారు భర్తని ఆతృతగా అడిగారు॥॥.
"ఊరికే ఖంగారు పడకు, వాళ్లింకా బయల్దేరుండరు ॥॥" వేంకట్రామయ్య గారు సముదాయించారు.
"ఇంతసేపయ్యింది, ఎప్పుడో బయల్దేరుంటారు॥।. ఎక్కడున్నారో, ఏమిటో?"
"బయల్దేరుంటే ఎక్కువ దూరం వచ్చుండరు, ఇంటికి వెనక్కి వెళ్లిపోయుంటారు॥॥, అనవసరపు ఆలోచనలు చేయకు॥॥।"
"రామయ్య, మా పిల్లలకి ఏమీ కాకుండా చూడవయ్యా, నీకు శ్రీరామనవమికి నూటెంది కొబ్బరికాయలు కొడతాను॥॥ ఆపదామప హర్తారం, దాతారం సర్వ సంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం॥॥" ఇంతకన్నా ఏమీ చేయలేకపోయింది ఆరాటపడుతున్న ఆవిడ మనసు.।


"ఇక్కడ లాభంలేదు విజయ్, దగ్గరే ఒక పాత రాతి మండపం వుంది, అక్కడికి వెళ్దాము" మధు అన్నాడు.
"ఈ వాన లో వెళ్లగలమా?"
"ఈ చెట్టు కింద అసలు వుండలేము"
పరిగెట్టారు ఇద్దరూ, పంచె తట్టుకుని పడబోయాడు విజయ్.। మధు పట్టుకున్నాడు.। అప్పటికే, నీళ్లు కాలవలై పారుతున్నాయి. ॥॥ఎలానో అలా మండపం చేరారు.।
"అక్కడ జాతర దగ్గర తాతగారు వాళ్లకి ॥॥।", వొణుకుతూ విజయ్.
"అక్కడ కోవెల దగ్గరేగా, తాతగారు వాళ్లు తప్పకుండా అందులో వుంటారు॥॥", మధుకి కూడా చలికి వొణుకు పుట్టింది॥॥.

వాన మాత్రం ఆకాశానికి చిల్లు పడినట్టు కుండపోతగా కురుస్తూనే వుంది.। ఇంతలో, ఆకాశం చీలిందా అన్నట్లు మిరుమిట్లు గొలిపే ఒక మెరుపు। ఒక్క క్షణం గొప్ప వెలుతురు, లక్ష దీపాలతో వెలిగించినట్లు గ్రామమంతా కనిపించింది, ఏమయిందో తెలుసుకుని తేరుకునే లోపు భూమి బద్దలయ్యిందా అన్నట్టు, దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో ఒక పెద్ద పిడుగు॥॥॥.
పిడుగు ఊలపల్లిలోనే పడింది॥॥॥
(శ్రీ హర్ష - 6/21/5 - సశేషం)

Friday, July 15, 2005

Chapter 9

" ఏమోయ్ ..నీ పేరంటాలు అయినట్టేనా, లేదా ఇంకా మీ అమ్మలక్కల ఇళ్ళకి ఇంకా తిరగాలా?"
" చాలు లెండి. మీరు రోజూ సాయంత్రం మీ స్నేహితులతో హస్కు వేసుకుంటుంటే నేను ఏమైనా అన్నానా?"
" ఇంతకీ అత్తయ్యగారూ, నీలూ క్షేమంగా చేరారో లేదో కనుకున్నారా?"
" ఆ, కనుకున్నాను..ఇప్పుడే సూర్యం తో మాట్లాడాను. క్షేమంగానే చేరారట. ఇవాళ అసలే అమ్మాయి dance programme ఉంది కదా, కాస్త చక్కగా చెయ్యమని ధైర్యం చెప్పాను."
" మరిది గారు, చెల్లెమ్మ అందరూ కులాసాయేనా?"
" ఆ, అందరూ బాగానే ఉన్నారు. అందరూ జాతర కి బయలుదేరుతున్నారు. కొంచెం వర్షం పడేటట్టుంటే, హడావిడి గా ఉన్నారు. నీలు ఇప్పుడే లేటు అయ్యింది అనుకుంటూ బయలుదేరింది. అమ్మ, సూర్యం బయలదేరబోతున్నారు. మన అమ్మాయి కి ఊలపల్లిలో మంచి పేరే ఉన్నట్లుంది. జాతర కి బాగా జనం వస్తున్నారని సూర్యం చెప్పాడు."
" అవును మరి, ఎంత చక్కగా చేస్తుంది కూచిపూడి. పైగా దానికి ఊలపల్లి అంటే ఇష్టం కుడా ఎక్కువే. ఎప్పుడు సందు దొరికినా రయ్యి మని పారిపోతుంది."
" అవునవును. ప్రొద్దున్న అమ్మా వాళ్ళని తీసుకుందుకు రచ్చబండ దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు వేంకట్రామయ్య గారు కలిశారట. వారి మనవడు మధు తన స్నేహితుడితో పాటు ఊలపల్లి వచ్చాడట. మనం ఎటూ నీలు కి సంబంధాలు చూస్తున్నాము కదా. మన నీలు కి మధు ని ఇచ్చి చేస్తే బావుంటుంది అని సూర్యం అభిప్రాయం. అబ్బాయి software ఇంజినీరు అట. హైదరాబాదు లో పని చేస్తున్నాడట. మంచి గుణవంతుడు. ఏ చెడు అలవాట్లూ లేవు. పైగా వేంకట్రామయ్య గారి కుటుంబం అంటే మనం అసలు ఆలోచించక్కర్లేదు. నీ అభిప్రాయం ఏమిటి?"
" మంచి సంబంధమే. మరి ఇంతకీ వెంకట్రామయ్యగారు ఏమంటారో?"
" ఉదయం మాటలు బట్టి మన అమ్మాయి అంటే మంచి అభిప్రాయమే ఉంది అని సూర్యం అన్నాడు. ఇవాళ సాయంత్రం జాతర చూడడానికి వాళ్ళంతా వస్తునారట. అలా కలిసినప్పుడు ఓ మాట కలుపుతానని చెప్పాడు. అడిగి చూడమని చెప్పాను. అన్నీ కుదిరితే మంచిదే కదా. ఇంతలో మన ప్రక్కింటి పురుషోత్తమరావు గారు వస్తే, మళ్ళీ ఫోను చేస్తానని పెట్టేశాను. ఆయన తో మాట్లాడి మళ్ళీ చేస్తే ఎవరు ఫోను ఎత్తలేదు. బహుశా జాతర కి వెళ్లిపోయి ఉంటారు. "

(సూరి - విశాఖపట్టణం - 22/6/05 - సశేషం)

Thursday, July 14, 2005

Chapter 10

రాతి మండపం దగ్గరికి వెళ్ళడం మంచిదయ్యింది.

అప్పటి వరకూ వాళ్ళు నించొని ఉన్న చెట్టు కూలిపోయింది.అక్కడే ఉంటే ఏం జరిగేదో ఊహించడానికే వణికి పొయాడు మధు.
ఊరవతల పడిన పిడుగుకు ఊరంతా వణికి పోయింది. భోరున కురుస్తోంది వాన , అరగంటకే ఊర్లో లోతట్టు ప్రాంతాలు మోకాలి లోతు వరకూ మునిగి పోయాయి.గాలి ఉద్ధృతం క్షణక్షణానికీ పెరుగుతూ ఉంది.
ఇవి చాలవన్నట్లు వడగళ్ళు. ఉన్న చోటు నించి ఎటూ కదలకుండా చేశాయి.

వెనక్కి తిరిగి చూశాడు విజయ్, చిన్న వినాయకుని విగ్రహం. ఎవరికీ ఏ ఆపదా రాకూడదు అని కోరుకున్నాడు, గుడికి వెళ్లి , దేవుడిని ఏమన్నా కోరుకుని చాలా రోజులయ్యింది అనిపించింది.గుండె కొట్టుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎడమ కన్ను అదురుతోంది,అది కీడు శంకిస్తోందా, మేలు చూపిస్తోందా, తెలీదు.

"ఈ వడగళ్ళ వాన చాలా ప్రమాదకరం, మనం ఇక్కడే కాసేపు ఉండడం శ్రేయస్కరం." పంచె సరిచేసుకుంటూ అన్నాడు మధు.
"మనవాళ్ళంతా క్షేమంగా ఉన్నారంటావా?"
"భయపడకు , ఏమీ జరగదు."
"తాతయ్యగారు, బామ్మ గారు, సీత ..."
"ఏం కాదురా , tension పడకు."
"నీలు ..."
"ఒక మనిషి పక్కన లేనప్పుడే , వాళ్ళెంత కావాలో తెలుస్తుంది." అంత వాన లోనూ వేదాంతం మాట్లాడాడు మధు.
"అవున్రా" గాల్లోకి చూస్తూ అన్నాడు విజయ్.
"నీ కళ్ళలో ఆమె పై అభిమానం ఎప్పుడో గమనించా."

ఎదురుగాలికి కొన్ని వడగళ్ళు మండపం లోకి వచ్చి పడ్డాయి, ఒకటి సూటిగా మధు నుదిటి మీద పడింది.
"అబ్బా..." బాధతో గట్టిగా అరిచాడు మధు.
ఇద్దరూ కాస్త లోపలికి వచ్చారు,వడగళ్ళు ఇంత గట్టిగా తగులుతాయని అనుకోలేదు విజయ్.
కారుతున్న రక్తం ఆపడానికి జేబురుమాలు అడ్డు పెట్టాడు విజయ్.

అరగంట అలానే ఏం మాట్లాడకుండా కూర్చున్నారు,వర్షం సద్దుమణిగింది.
కరంటు రాలేదు, ఊరంతా చీకటిగానే ఉంది. నెమ్మదిగా రోడ్డు మీదకి వచ్చారు ఇద్దరూ.

"బానే ఉన్నారుకదా నాన్నా మీరు ?" పరిగెత్తుకుంటూ వచ్చింది మంగమ్మ గారు.
"బానే ఉన్నాం బామ్మ గారు, తాతయ్య గారు ఏరి ?" అడిగాడు విజయ్ .
"ఇదిగో ఇప్పుడే సీతను తీసుకుని ఇంటికి వెళ్లారు."

ఇంతలో సూర్యం కంగారుగా వచ్చి బామ్మ గారిని అడిగాడు.
"మా నీలు ని చూశారా మంగమ్మ గారూ? నీలు కనపడడం లేదండీ... " వస్తున్న దుఃఖం ఆపుకోలేకపోయాడు సూర్యం.

(కళ్యాణ్ - కాకినాడ - 6/19/5 - సశేషం)

Wednesday, July 13, 2005

Chapter 11

"అయ్యో, లేదండీ, వర్షం వల్ల నాట్యం కుదరదని వాళ్లు మాట్లాడుకోవటం విన్నాను అంతే"
"నేనూ, విజయ్ ఇప్పుడే ఇంటి నుండి వస్తున్నామండీ, మాకూ కనపడలేదు"

"!!!అమ్మగోరూ!!!"
గోపాలుడు ఆయాసంతో పరుగులు తీస్తూ వచ్చాడు, "నీలమ్మ పైన పిడుగు పడ్డాదమ్మా!!!"

సూర్యం అవాక్కయ్యాడు.
మధు వాడిని నిలదీశాడు, "ఎక్కడ పడిందిరా? నీలూ ఎలా ఉంది?"
"నీలమ్మ సంగతి తెలీదు బాబూ, ఊపిరి లేదంట, ఈడ్నేకోనేటి తోటలో ఉండారు"
"సూర్యం గారూ, ఈ ఊర్లో డాక్టరెవరన్నా ఉంటే గోపాలుడిని పంపి తీసుకురమ్మనండి. విజయ్, మనమా తోటకి వెళ్దాం పద"

సూర్యం తేరుకున్నాడు, "అయ్యో, ఊలపల్లిలో ఎవరూ లేరే? భగవంతుడా!"
"సూర్యం గారూ, అనర్థం జరక్కపోయుంటే అవసరమే రాకపోవచ్చు.పిడుగు పడి రెండు నిముషాలు కూడా కాలేదు కాబట్టి ఇంకా సమయం ఉంది. మేమేదైనా ప్రథమ చికిత్స చేయటానికి కుదురుతుందేమో చూస్తాం. ఎందుకన్నా మంచిది, పోలవరం నుంచైనా డాక్టర్ని పిలిపించే ప్రయత్నం చేయండి. పద మధూ"

మధు, విజయ్ లు తోట చేరుకునేసరికి జనం గుమిగూడి ఉన్నారు.
"తప్పుకోండి, తప్పుకోండి, కొంచెం గాలి ఆడనివ్వండి", అంటూ ఇద్దరూ గుంపు మధ్యకి చేరారు.

చుట్టూ జనం ఉన్నా, నీలూ దగ్గరగా ఎవ్వరూ ఎందుకు లేరో నీలూని ఒకసారి చూడగానే వారికర్థమైంది. స్పృహతప్పి, చలనం లేకుండా, ఊపిరి ఆగిపోయి, ఒక పక్కగా పడిపోయి ఉంది నీలూ. సరిగ్గా తన పైన్నే మెరుపు పడ్డట్టుంది, ఆ విద్యుత్తు వల్ల ఆమె నాట్యం దుస్తులన్నీ పీలికలైపోయి ఉన్నాయి. అదీగాక, తనని తాకితే షాక్ కొడుతుందేమోనన్న అనుమానం కూడా వారి భయానికి కారణం అయ్యుండొచ్చు.

"విజయ్, నీకు CPR గుర్తుందా?"

నీలూని మెల్లగా వెల్లకిలా పడుకోబెట్టాడు విజయ్.
"ఇందాకటి నుండీ గుర్తుచేసుకుంటూనే ఉన్నాను మధూ. ఆ వెనుకగా కూర్చొని నీలు తల ఎత్తి, మెడ కొంచెం వెనక్కి ఉండేలా ఇలా పట్టుకో "
"కార్డియాక్ అరెస్ట్ అయిందా?"
"గుండె బాగానే కొట్టుకుంటోంది. ఒకవేళ అరెస్టయినా రికవరైనట్లుంది. గాలిమాత్రం ఆడటంలేదు. ఉండు..."

విజయ్ నీలూ మొహాన్ని దగ్గరకు తీసుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచించి, గట్టిగా గాలి పీల్చి, నీలూ ముక్కు మూసిపట్టాడు. నీలూ నోటిని తన నోటితో సీల్ చేసి రెస్క్యూ బ్రీథింగ్ మొదలుపెట్టాడు. రెండు, మూడుసార్లు అలా చేసిన తర్వాత నీలూలో చలనం కనిపించింది. తనంతట తానే ఊపిరి తీసుకోసాగింది. మెల్లగా కళ్లు తెరిచింది.

"ఏమీ కాలేదు లెండి. నెమ్మదిగా కూర్చోండి. పడినప్పుడు దెబ్బలేమీ తగల్లేదు కదా"
"థాంక్సండీ, చనిపోతాననుకున్నాను"
"అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగితే ఇంకేముంది నీలూ, బాగానే ఉంది కదా ఇప్పుడు? లేవగలవా?"
"థాంక్స్ మధూ, ఎలా ఉన్నానో ఇంకా నాకే తెలియడం లేదు"
"వద్దు వద్దు, డాక్టరు వచ్చేవరకూ మీరు ఎక్కువ కదలకుండా ఉంటే మంచిదండీ"
"ఆయన పోలవరం నుంచి వచ్చేసరికి ఇంకో అరగంటైనా పడుతుందిరా"
"అయితే ఈలోపు జాగ్రత్తగా గుడి మండపానికైనా చేరుద్దాం. అక్కడ కనీసం పొడిగానైనా ఉంటుంది"
"సరే, నేను సూర్యంగారికి, తాతయ్యకి విషయం చెప్పివస్తాను మరి. మండపానికి దారి గుర్తుందిగా? కాస్త సాయపడండయ్యా వాళ్లకి", ఊరివైపు బయలుదేరాడు మధు.

(విజయ్ - తిరుపతి - 6/26/5 - సశేషం)

Tuesday, July 12, 2005

Chapter 12

అనకాపల్లి లో నీలు ఇంట్లో ఆ రోజు రాత్రి....

ప్రభాకరంగారు పడుకున్నారు.
శశికళ గారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు,"ఏవండీ, ఏవండీ.. మిమ్మల్నేనండీ.."
"అబ్బ, ఏమిటోయ్ ఇంత రాత్రి పూట.."
"అంత మొద్దు నిద్ర పోకపోతే, కాస్త వినచ్చు కదా.."
"ఇప్పుడు అంత వెంటనే కూర్చుని మాట్లాడకపోతే, రేపు పొద్దున్న తాపీగా మాట్లాడచ్చు కదా॥॥"
"మన నీలు పెళ్లి విషయం గురించండీ॥॥"
"దానికింకా తొందరేమొచ్చిందే॥॥।"
"అది కాదండీ, ఒక్కగానొక్క అమ్మాయి, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం మన బాధ్యత కదండీ॥॥।"
"అవును, ఇప్పుడు నేనేమయినా కాదన్నానా?॥॥"
"అబ్బా వినండీ॥॥"
"నీలు అంటే మనకే కాదు, మీ అమ్మ గారికీ, అందరికీ అభిమానమే, వాళ్లందరికీ కూడా అదే ధ్యాస సాయంత్రమే చూశావు కదా, అవకాశం దొరికిందో లేదో పెళ్లి విషయం మాట్లేడేస్తున్నారు"
"అందుకే, నేను కూడా తొందర పడుతున్నది॥॥। "
"సరే, నీ తొందరేమిటో కూడా సెలవియ్యి, విని పడుకుంటాను॥॥"
"అదిగో మళ్లీ నిద్ర॥॥ "
"సర్లేవోయ్, చెప్పు శ్రద్ధ గానే వింటున్నాను॥॥।"
"ఇప్పుడు అంతా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు। అందులో తెలుగువాళ్లు బోల్డుమందున్నారు, అమెరికాలో అయితే డాలర్లలో సంపాయించచ్చు, బోల్డు దేశాలు చూడచ్చు॥॥ నెలకి దగ్గరదగ్గర లక్ష రూపాయలు ఇండియాకి పంపుతారుటండీ॥॥।మనకి తెలిసిన వాళ్లని కూడా చూస్తున్నాము కదా,"
"ఇప్పుడు ఈ దేశంలో కూడా అమెరికా లో చేసే ఉద్యోగాలే చేస్తున్నారే పిచ్చి మొహమా, అంతే సంపాయిస్తున్నారు కూడాను॥॥"
"అదేంకాదుట, వాళ్లు వొదిలేసిన పని, చిన్నా చితకా పనులు ఇండియాకి పంపుతారుట, అదికూడా చవకగా పనవుతుందనిట॥॥ అక్కడ హోదాయే వేరు, అందరికీ కార్లు, పెద్ద పెద్ద ఇళ్లు, ఎక్కడికయినా విమానాలు, షికార్లు"
"అవంతా పైపై షోకులే॥॥।, అక్కడ కూడా బొలెడు కష్టాలు ఉంటాయి"
"మీరేమయినా చూసొచ్చారా? ఎందుకలా వాగడం॥॥"
"అబ్బో, నువ్వు చూసొచ్చావేమిటి,॥॥।"
"చూడాక పోవచ్చు, కాని అమెరికాలో ఉంటున్న వారి బంధువుల ద్వారా తెలుసుకున్నాను, వారి ఇళ్లలో ఆనందం, ఆర్భాటం చూశాను॥॥"
"ఓహో, ఇదంతా ఆ సావిత్రమ్మ గారు, అదే ఇద్దరు పిల్లలు అమేరికా లో వుంటారు, మొన్నే ఒచ్చి వెళ్లారు, ఆవిడ చలవేనా॥॥"
"మీరెలా అనుకున్నా సరే, నా నిర్ణయం మాత్రం మారదు॥॥"
"అసలు ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటో॥॥।"
"నా కూతురికి అమెరికా సంబంధమే చెయ్యాలి, ॥॥।"
"అదేం!!! అమెరికాని పొగిడావు, అంతవరకూ బానే వుంది, ఈ అమెరికా పిచ్చి ఎందుకు, ఇప్పుడు ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ బోల్డు సంపాయించే మంచి కుర్రాళ్లు వున్నారు॥॥"
"ఎంత ఉద్యోగంచేసినా, అమేరికా కుర్రాడయితేనే నాకు సమ్మతం॥॥"
"శంఖంలో పోస్తేనే తీర్థం అయినట్టు, అమెరికా వెళ్తేనే నీకు అల్లుడయ్యే అర్హత అందుకుంటారా ఏమిటే॥॥"
"మీరేవిధంగా చెప్పినా సరే, నేను వినను॥। నేనెలాగూ సుఖ పడలేదు, నా కూతురయినా సుఖ పడాలని నా తాపత్రయం॥॥। ఏం తప్పంటారా"
"తప్పుకాదనుకో, అయినా సాయంత్రమేనా, ॥।పక్కింటి పిన్ని గారితో "మంచి భర్త, మంచి కూతురునిచ్చాడు భగవంతుడు, ఎదో ఈ జీవితం ఇలా సుఖంగా గడిచిపోతే చాలని అనుకుంటాను పిన్నిగారు" అని అన్నావు॥॥"
"నేనా??? ఏమో అప్పుడు అలా అనుంటాను॥॥ ఇప్పుడు మాత్రం ఇంతే"
"మళ్లీ ఇంతలో ఏమయిందే, సాయంత్రం నేను బయటికి వెళ్లాకా సావిత్రమ్మగారు ఇంటికొచ్చారా ఏమిటి???"
"ఊరికే ఆవిణ్ణెందుకు ఆడి పోసుకోవడం॥॥।"
"అయినా ఆవిణ్ణి కాదు, సత్యనారాయణ గారిననాలి॥॥"
"మధ్యలో ఆయనేం చేశారు???"
"ఏం చెయ్యలేదు కాబట్టే నా బాధ॥॥।"
"నేను ఇంత ఇది గా మాట్లాడుతుంటే, మీకు అలుసుగా వుందా॥॥। అనవసరమయిన మాటలు మాట్లాడుతారు, అసలు విషయం చెప్పండి॥॥"
"అలాగే, అసలు విషయానికే వస్తాను, ఇప్పుడు నీ సుఖానికేం తక్కువొచ్చింది? "
"ఓయబ్బో తెగ సుఖ పెట్టేశారని॥॥। "
"సరే, అమెరికా అంటావా॥॥ పోనీ నీకు చూడాలనుందా చెప్పు, తల తాకట్టు పెట్టి తీస్కెళ్తాను॥॥। "
"అదొక్కటే తక్కువ నాజీవితానికి, ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికెక్కునా అన్నట్టు, అమెరికా తీసుకెళ్తారుట, అమెరికా॥॥ మండల అధికారిని పెళ్లి చేసుకున్నందుకు, తిప్పారుగా నన్ను, అంబాజీపేట, ఆకివీడు, అల్లవరం, అమలాపురం, ఇదిగో ఇప్పుడు అనకాపల్లి॥॥।"
"ఆముదాలవలస మర్చిపోయావోయ్॥॥।"
"ఛా పైగా గుర్తు చేస్తున్నారు కూడాను॥॥, ఏదో వెర్రి దాన్ని కాబట్టి, మా అమ్మ వాళ్లు పెద్ద ఉద్యోగస్తులని చెప్తే తలొంచుకుని తాళి కట్టించుకున్నాను॥॥।"
"ఒహొ, flash back లోకి వెళ్లావా॥॥। "
"మీకెప్పుడు వెటకారమే, అరచేతిలో స్వర్గంచూపించి, నన్ను వెర్రిదాన్ని చేసి ఇన్నాళ్లు ఆడించేశారు॥॥"
"ఇప్పుడు సావిత్రమ్మ గారు జ్ఞానోదయం చేశారు కాబోసు॥॥।"
"అదిగో మళ్లీ మాట మారుస్తారు॥॥।"
"సరే, అమ్మాయి సుఖ పడటమే నాకూ కావాల్సింది, మనమే అన్నీ అనుకుంటే ఎలా, అమ్మాయికి ఎలాంటి భావాలున్నాయో కనుక్కోవాలి కదా??"
"అమ్మాయికి మనం లోకం గురించి చెప్తే, అదీ తెలుసుకుంటుంది, మంచి సంబంధం తెస్తే చేసుకుంటుంది॥॥"
"సరే, అలాగే, నువ్వన్నట్టే కానీ, ఇప్పుడు ఆనందమేనా, రేపు పొద్దున్న మిగతావి మాట్లాడుదాము॥॥"
"సరే, ఇప్పుడు కాస్త మనసు కుదుట పడింది। ఇప్పటికే బాగా ఆలస్యమయిపోయింది॥॥ పడుకోండి॥॥"

ఒక నవ్వు నవ్వి, ప్రభాకరంగారు అనుకున్నారు, "నా నీలు మంచి సంస్కారం ఉన్న పిల్ల। మన సంస్కృతి, కళల పట్ల మంచి గౌరవం, అవగాహన కలిగిన వ్యక్తి, తన చుట్టూ కూడా వాటిని పంచగల, వాటిపట్ల గౌరవం పెంచగల వ్యక్తి, కాబట్టి అమెరికా వెళ్లినా, భారతదేశంలో వున్నా తన వ్యక్తిత్వం నిలుపుకుంటుంది॥। నాకా ధీమా వుంది॥॥" అని ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు॥॥

ఇంకా పూర్తిగా తెల్లారినట్లు లేదు।
మంచం పక్కన సెల్ ఫోను మోగుతోంది। ప్రభాకరంగారికి నిద్ర పాడయింది॥॥ "ఏమోయ్ కాస్త ఫోను చూడచ్చు కదా॥॥।"శశికళగారు వంటింట్లోంచి వస్తూ, "మీ పక్కనే వుంది కదా, నేను వంటింట్లోచి వచ్చి చూడాలి॥॥।"
సెల్ ఊలపల్లిలో సూర్యం నంబరు చూపిస్తోంది।
ఆవిడ ఫోను ఎత్తారు
.....
...
........
"ఆ, నీలు కి, మా నీలుకి, అయ్యో భగవంతుడా॥॥ ఇప్పుడు నీలుకి ఎలా వుంది॥॥॥।" అని ఏడ్చేశారు
ఆవిడ గొంతులో భయం, ఆందోళన చూసి, వెంటనే ఆవిడదగ్గరికి వొచ్చారు ప్రభాకరంగారు॥॥
(శ్రీ హర్ష - 6/27/5 - సశేషం)

Monday, July 11, 2005

Chapter 13

" సూర్యం గారూ , మీ అన్నయ్య గారికి కబురు చేశారా! ఎన్నింటికి వస్తున్నారు.."
" చేశానండి , ముందు కబురు చేయకూడదు అని అనుకున్నాను. కానీ అమ్మాయి పెళ్ళి సంబంధం గురించి కూడా మాట్లాడాల్సి వుండటంతో కబురు చేయాల్సి వచ్చింది. ఇంతకీ మా నీలు కోలుకోవటానికి ఎన్నాళ్ళు పట్టచ్చు డాక్టరు గారూ"
" నీలుకి పెళ్ళా!!!... నేను కూడా దాని గురించే మాట్లాడదామని అనుకున్నాను. ఎందుకంటే నీలు ఆరోగ్యము గురించి కొన్ని విషయాలు మీకు తెలియాలి.."
" ఏమిటండీ మీరనేది .... నీలు ఆరోగ్యానికి ఇప్పుడు ఏమైందని .....ఏమన్నా serious కాదు కదా", ఆందోళనగా అడిగారు సుర్యం.
" నిన్న పిడుగు పడినప్పుడు షాకు బాగా తగిలింది నీలుకి. దీని వల్ల Dementia వచ్చే అవకాశము చాలా ఎక్కువ.....ఇది కేవలము నా అనుమానము మాత్రమే అనుకోండి...కాని నా అనుమానమే నిజమైతే అమ్మాయి పెళ్ళి విషయములో కొంచెము ఆలోచించి నిర్ణయము తీసుకోవటము మంచిది అని నా అభిప్రాయము. "
"Dementia నా ,, ...అంటే ఏమిటి డాక్టరు గారూ "
" పిడుగు పడటము వల్ల అమ్మాయి మెదడు లో కొన్ని కణాలు దెబ్బతిన్నాయి. మన అదృష్టము బావుండటము వల్ల అవి కొద్దిగానే పాడై వుంటాయి.. అమ్మాయి మనల్ని గుర్తించింది కాబట్టి పెద్ద ప్రమాదమేమీ జరగనట్టే . ఈ Dementia వల్ల ఇబ్బందులు ఏమీ వుండవు గానీ కొంచెము మతిమరపు, ఏదైనా నేర్చుకొనేటప్పుడు ఏకాగ్రత కొరవడటము లాంటివి జరగవచ్చు. ప్రస్తుతము దీనికి మన దేశము లో నయము చేయగల డాక్టరు ఎవరూ లేరు "
" అవునా ఈ మాయదారి రోగము మా అమ్మాయికే రావాలా!! ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. మా చిట్టి తల్లికి నయమవ్వాలంటే , ఏ దేశానికి అయినా వెళ్తాము. చెప్పండి డాక్టరు గారు.."
" చూడండి సుర్యం గారు.. మీ బాధని అర్థము చేసుకోగలను , కానీ నేను డాక్టర్ని మాత్రమే.. . నీలు అంటే మీకు , మీ అన్నయ్య గారి కి ఎంత ఇష్టమో నాకు తెలియంది కాదు.. ఈ వ్యాధి వైద్యము కోసము అమెరికాలో ఒక ఇంస్టిట్యూట్ వారు రిసెర్చు చేస్తున్నారని ఎక్కడో చదివాను.. వాళ్ళు చెప్పటము ప్రకారము దీనిని 5 నుండి 10 సంవత్సరాలలో పూర్తి గా తగ్గించ వచ్చట. పెద్దగా ఖర్చేమి వుండదు. పైగా రిసెర్చు కాబట్టి వీసా కూడా తేలికే. కాకపోతే, ఓపిక ఎక్కువ అవసరమైన వైద్యము ఇది. ఎటూ, మీ అమ్మాయికి సంబంధము చూస్తున్నారు కాబట్టి , ఒక మంచి అమెరికా అబ్బాయిని చూడండి. స్వామి కార్యము , స్వకార్యము కలసి వస్తాయి... సలక్షణమైన పిల్ల , ఎవరు చేసుకోరు..? చెప్పండి...? పైగా ఈ కాలము అమ్మాయిలు మన వాళ్ళ కంటే అమెరికా సంబంధము చేసుకోవటానికే ఎక్కువ ఇష్ట పడతారు లేండి.."

" మీరు చెప్పింది నిజమే కానీ,,,,,"......... " మన వేంకట్రామయ్య గారు తెలుసు కదా , ఆయనతో నిన్న సాయంత్రమే, సంబంధం గురించి మాట్లాడాను .. వాళ్ళ మనమడు మధుకి అడిగాము..ఆయన కూడా ఒప్పు కున్నట్లు గానే అన్నారు.. ఇదిగో ఈ వర్షం ఇంత గొడవ చెయ్యకపోతే మా అన్నయ్య వాళ్ళని పెళ్ళిమాటలకే పిలిపించే వాడిని..ఇప్పుడేమో ఇలా అయ్యింది .. మనము ఊహించినవి అన్నీ సరిగ్గా జరుగుతాయా చెప్పండి!...."
" ఏది ఏమైనా బాగా ఆలోచించి నిర్ణయము తీసుకోండి. అమ్మాయి ఆరోగ్యము కూడా ముఖ్యము కదా" డాక్టరు గారు లేస్తూ అనటంతో, సూర్యం డాక్టరు గారి పెట్టె తీసుకొని " నేను మీతో వస్తాను వుండండి రచ్చబండ దగ్గరకి.. మా అన్నయ్య , వదిన వచ్చే వేళ అయ్యింది..కాస్త మీరు కూడా వాళ్ళకి నాలుగు ముక్కలు ధైర్యము చెప్తే కుదుటపడతారు.. పదండి నడుస్తూ మాట్లాడుకుందాము.. "

" మా ప్రభాకరం అన్నయ్యకి అమెరికా సంబంధాలు అసలు ఇష్టం లేదు డాక్టరు గారు.. నాకు కూడా లేదనుకోండి . మా రెండు కుటుంబాలకి ఒక్కతే నలుసు... నీలు అమెరికా వెళితే మేము ఇక్కడ వుండలేమనుకోండి.. . ఇప్పుడీ పరిస్థితుల్లో, మావాడు దాని అనారోగ్యము గురించి తెలిస్తే తట్టుకోలేడు ...ఏమి చెయ్యాలో అర్ధం కావటం లేదు డాక్టరు గారూ .."

' ఆడపిల్ల అంటే "ఆడ" పిల్ల .. ఎప్పటికైనా పంపవలసినదే కదా. అమెరికా అయితే కాస్త బావుంటుంది ..ఆలోచించండి. కాకపోతే కట్నము కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సి రావచ్చు .. "
" మా అమ్మాయిని కట్నం తీసుకొనే వాళ్ళకి ఇవ్వమండీ." అంత బాధలోనూ కోపం కనిపించింది సూర్యం మొహం లో
" ఈ రోజుల్లో కట్నము తీసుకోని సంబంధము అంటే కాస్త కష్టమేమో"
" చదువుకున్న మీరు కూడా అలా అంటే ఎలాగండీ డాక్టరు గారూ " సూర్యం మాటలు తూటాల్లా తగిలాయి డాక్టరు గారికి ..

( వంశీ - విజయవాడ - 04/Jul/05)

Sunday, July 10, 2005

Chapter 14


" వొరేయ్ మధు ...నీకు dementia అంటే తెలుసా?"
"dementia నా? అదేమిటి?"
" నీలు మీద పిడుగు పడింది కదా..డాక్టరు గారు ఇలా పిడుగు దెబ్బ తగిలినప్పుడు dementia వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నారట. ఈ వ్యాధి వల్ల కొంచెం మతిమరుపు గా ఉంటారట. దీని నివారణ కే్వలం అమెరికా లో మాత్రమే సాధ్యమట."
" ఏమిటీ? ఆ డాక్టరు ఎవరో సరిగ్గా పరీక్షలు చేసే ఈ వ్యాధి గురించి తేల్చి చెప్పాడా? అసలు హైదరాబాదు కి తీసుకువచ్చి మంచి హాస్పిటల్ లో చూపించచ్చు కదా. ఇక్కడ ఊలపల్లి లో ఎంత మంచి డాక్టర్లు ఉంటారు చెప్పు.." చాలా కోపం గా అన్నాడు విజయ్. విజయ్ మనసు లో ఉన్న ఆవేదన మధు కి అర్థం అయింది. కొద్దిపాటి పరిచయం లో నే విజయ్ మనసు నీలు కి దగ్గర కావాలను కుంటోంది. ఇప్పుడు ఈ dementia విషయం మరీ బాధాకరం గా ఉంది. కాసేపు క్రితం సూర్యం గారు ఈ విషయం చెప్పినప్పుడు విజయ్ ముఖం లో భావాలు మధు గమనించాడు. నీలు తనకు చిన్నప్పటి నుంచి తెలుసు. విజయ్ నీలు మంచి జోడి అని తన మనసు లో అనుకున్నాడు.

" బావా...బావా.. తాతయ్య గారు నిన్ను పిలుస్తున్నారు. త్వరగా క్రిందకి రా.." అంటూ సీత పరిగెట్టుకు వచ్చింది.
" విజయ్.. నేను ఇప్పుడే వస్తాను. తాతయ్య ఎందుకో పిలుస్తున్నట్టున్నారు. " అని మేడ దిగి వేంకట్రామయ్య గారి దగ్గర కు వొచ్చేడు మధు.
" ఏమిటి తాతయ్యా ? పిలిచారట? "
" అవును రా మధూ. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీలు ని పరామర్శించి వచ్చావా?"
" ఆ. ఇప్పుడే కలిసి వస్తున్నాము తాతయ్యా. సూర్యం గారితో కూడా మాట్లాడాము. నీలు కి ఇప్పుడు బాగానే ఉంది."
" నిన్న సూర్యం గారు నాతో నీ గురించి మాట్లాడారు. వాళ్ళ నీలు కి సంబంధాలు చూస్తున్నారంట. నీలు కి నిన్ను ఇచ్చి చేద్దామని వాళ్ళ అభిప్రాయం. నీలు నువ్వు చిన్నప్పటినుంచి కలిసితిరిగినవాళ్ళు. నీలు మీద నీ అభిప్రాయం ఏమిటి? సూర్యం గారికి ఏమి సమాధానం చెప్పమంటావు? "
తాతయ్య మాటలు మధు కి కరెంటు షాకు లా తగిలాయి. కాసేపు క్రితమే నీలు గురించి మధు మనసు లో ఆలోచించి ఇప్పుడు తాతయ్య వాళ్ళు ఇలా అడుగుతారని అసలు ఊహించలేదు.
" తాతయ్యా..అసలు నాకు ఏమి చెప్పాలో అర్థం కావటం లేదు. నీలు నాకు కేవలం స్నేహితురాలు మాత్రమే. నా మనసు లో ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. అసలు నీలు ని అడిగే, సూర్యం గారు మీతో మాట్లాడారా? విషయం మీరే ప్రస్తావించారు కాబట్టి నేనూ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా విజయ్ కి నీలు అంటే ఇష్టం అని వాడి చేష్టలని బట్టి నాకు అర్థం అయింది. వాడిని నేను దీని గురించి అడగ లేదు కాని, ఇందాక నీలు ని కలిసినప్పుడు వాడి మనసు లో ఆవేదనని నేను గమనించాను. నేను విజయ్ నాలుగు సంవత్సరాలు కలిసి చదువుకున్నాము. నాకు వాడి గురించి చాలా బాగా తెలుసు. నీలు వాడికి కేవలం రెండు రోజులు గానే తెలుసు అని మీరు అనచ్చు. నీలు కి కూడా విజయ్ అంటే ఇష్టం ఉంటే, వీడికంటే మంచి అబ్బాయి నీలు కి దొరకడం కష్టం అని నేను కచ్చితంగా చెప్పగలను.
పైగా నీలు కి ఈ పిడుగు పడటం వలన dementia అనే వ్యాధి వొచ్చే అవకాశాలు ఎక్కువ గా ఉండచ్చు అని డాక్టరు అన్నారు. విజయ్ త్వరలో అమెరికా వెళతాడు. వాళ్ళ ఆఫీసు వాళ్ళు onsite పంపిస్తారు. దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అమెరికా లోఉండొచ్చు. కాబట్టి నీలు కి అమెరికా లో మంచి వైద్యం కూడా చేయించచ్చు. ఈ విషయం గురించి విజయ్ ని అడిగి మీతో మాట్లాడదామనుకున్నాను. ఇంతలో మీరే ఇలా అడిగారు. "

( సూరి - విశాఖపట్టణం - 09/Jul/05 )

chapter 25

మధు, విజయ్ మిద్దె పైకి వెళ్ళారు। అప్పటికే అక్కడ లోకేష్, దీపక్ ఉన్నారు। వీళ్ల వెంబడే ప్రభాకరం, శశికళ కూడా పైకి చేరారు। సూర్యం ఓ పక్కగా ఏదో అలోచనలో నిమగ్నమయ్యున్నాడు। అందరి చూపులూ మిద్దె పైనున్న అందరినీ ఒక్కక్కరిగా పరికించాయి।కొందరి చూపులో అయోమయం, కొందరి చూపులో జాలి, కొందరి చూపులో బాధ, కొందరి చూపులో బెదురు, కొందరి చూపులో తప్పుచేశామన్న వేదన॥॥ ఎవ్వరికీ ఏమిటీ అర్థం కావటం లేదు। అసలు అక్కడ ఎందుకు చేరారో, ఎవరు రమ్మన్నారో కూడా తెలియదు। అందరినీ అక్కడికి రమ్మని చెప్పింది మాత్రం సీత। ఇంతలో సీత చలాకీగా మధ్యలో కి వచ్చింది। చేతిలోని వార్తా పత్రికని గట్టిగా చదవటం మొదలెట్టింది। హెడ్ లైన్స్ కింద ఏదో రోడ్డు ప్రమాదం గురించిన వార్త ఉంది।


"నిన్న అర్థ రాత్రి ఒంటిగంటన్నరకు రాజమండ్రి నుంచి ఊలపల్లి వచ్చేదారిలో ఒక జీపుని, ఇసుక లారీ ఢీకొని ఘోర ప్రమాదం సంభవించింది। జీపు పూర్తిగా దెబ్బతింది। ప్రమాదంలో ఒక ప్రాణ నష్టం జరిగింది। మిగిలినవారు కొన ఊపిరితో రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు। చనిపోయిన వ్యక్తి, పలు చీటింగ్ కేసులలో నిందితుడు, real estate మాఫియా లీడర్ గా చెలామణి అవుతున్న "జెలగలపూడి పిచ్చయ్య" అలియాస్ "జెపి" అని తెలిసింది"


ఇంతలో కృష్ణమూర్తి గారు పెద్ద పెద్ద అడుగులతో అందరి మధ్యకీ వచ్చాడు। ఆయన ముఖంలో అదో తెలియని భావం కనిపించింది। పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, ఏదో పెద్ద బరువుని దింపుతున్నట్టుగా ఆయన మాట్లాడ్డం మొదలెట్టారు


"మీ అందరికీ ఇవాళ నేనో విషయం చెప్పాలి। గత కొన్ని రోజులుగా మీరందరూ గురైన మనోవేదనకు ముఖ్య కారకుడిని నేనే !!!!!"


అందరి ముఖాల్లో ఆశ్చర్యం॥॥। ఆ వెంటనే అది కోపంగా మారబోతోంది। ఆయన మాటలు ముందుకు సాగాయి।

"అయితే, ఎన్నో రోజులుగా నేను కూడా ఇంతకన్నా ఎక్కువగా రగిలిపోయాను। అది ఒక విధంగా స్వయంగా కొని తెచ్చుకున్నదే। ఇందాక సీత చదివిన వార్తతో దీనికి సంబంధం ఉంది। చనిపోయిన ఆ జెపి చేతిలో నేను నరకయాతనకు గురయ్యాను। నేను రెండేళ్ల క్రితం చేసిన ఒక తప్పుకి తగిన ఫలం అనుభవించాను। నా ఆసుపత్రి విషయంలో స్వార్థం కోసం, డబ్బుకోసం శరీర అవయవాల వ్యాపారం చేశాను। మా ఆసుపత్రి ఉన్న స్థలానికి సరైన కాయితాలు లేకపోతే, వాటిని కప్పిపుచ్చటానికి జెపి ని ఆశ్రయించాను। ఆ సమస్య గట్టెక్కినా, నా వ్యాపారంలో వస్తున్న డబ్బు చూసి, జెపి నన్ను black mail చేయడం మొదలుపెట్టాడు। వాడి కన్ను మనూరిలోని రాతిస్తంభం ఆ చుట్టు పాక్కల స్థలాల మీద పడింది। ఇక్కడ మొన్న తవ్వకాలలో బయట పడిన కొన్ని పురాతన వస్తువులే దానికి కారణం। వాటిని ఇతరదేశాలలో అమ్మి చాలా డబ్బు చేసుకుందామని, ఆ స్థలాలు చాలా మట్టుకు ప్రభాకరంగారి కుటుంబం ఆస్తి అని తెలుసుకుని, నా చేత ఇంత నాటకం ఆడించాడు। ఇది ఇంతవరకూ రావడం నా తప్పే। అయితే ఇప్పుడు వాడి పీడ విరగడయ్యింది। నీలూకి ఏ జబ్బూ లేదు। మా వాడు అమెరికా నుంచి రావడం కూడా నా మూలంగానే। అయితే, ఈ దీపక్ సంగతి మాత్రం నాకు తెలియదు। " అని భోరుమన్నాడు కృష్ణమూర్తి।

అందరికీ ఇప్పుడిప్పుడే పరిస్థితి కొద్ది కొద్దిగా అర్థమవుతోంది। లోకేష్ అందుకుని,"మా నాన్న నీలుకి dementia అని చెప్పినప్పుడే నేను ఏదో తేడా ఉందని గ్రహించి, దీపక్ తో ఇక్కడికి వచ్చి ఈ పెళ్లి హడావుడి చేశాను। ఇందులో మీ మనసుల్ని కష్ట పెట్టుంటే క్షమించండి"।

"అవును, లోకేష్ నాతో, ఏదో తిరకాసు ఉంది, కాస్త సహకరించమంటే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను" అని లోకేష్ ని సమర్ధించింది నీలు।

విజయ్ ఒక్కసారి "హమ్మయ్య" అనుకున్నాడు।

శశికళ "నా కూతురే దొరికిందా ఈ నాటకాలకి, ఇప్పుడు దానికి పెళ్లెలా అవుతుంది?" అన్నారు ఆవేదనగా॥॥॥।

"నువ్వూరుకోవే, మనమ్మాయికి ఏ రోగం లేదని, గండం గడిచిందని ఆనందించక, పెళ్ళో అని మళ్లి ఆ ఏడుపు మొదలెట్టకు॥॥॥" ప్రభాకరం ఓదార్చారు।

"అమ్మా.... మళ్లీ పెళ్లి మాటేమిటే, ఇంకో సంవత్సరం దాకా అసలా మాటే ఎత్తద్దు నాతోటి" అని మెట్లు దిగి వెళ్లి పోయింది నీలు।


విజయ్, మధు ఒకరినొకరు చూసుకున్నారు।
లోకేశ్, దీపక్ కూడా ఒకరినొకరు చూసుకున్నారు।


(శ్రీహర్ష , 17/08/05, సశేషం)

Saturday, July 09, 2005

Chapter 15


"అవునా, ఈ సంగతి నేను గమనించలేదే? పరవాలేదులే బాబూ, కొంచెం ఆలస్యంగానైనా విషయం తెలిసినందుకు
సంతోషం. కానీ వాళ్లిద్దరూ దీని గురించి మాట్లాడుకోలేదన్నావు కాబట్టి నేనూ సూర్యంతో ఇప్పుడే ఏమీ అనను. నీలూ
తల్లిదండ్రులు వచ్చేవరకూ దాటవేద్దాం. నువ్వు వీలైతే విజయ్ ని ఒకసారి కదిలించి చూడు."
"నిజమే తాతయ్యా, ఇంకా అడగకుండా ఉండడం మంచిది కాదు. నేను తప్పకుండా విజయ్ తో మాట్లాడుతాను."

* * * * * * * * * * *

"మీరేమీ భయపడకండన్నయ్యా, నీలూ కోలుకుంది", శశికళ దగ్గరనుంచి సూట్ కేసు తీసుకుంటూ చెప్పాడు
సూర్యం.
"త్వరగా వెళ్దాం పదరా", అంటూ బస్సుదిగి, వడివడిగా బయలుదేరాడు ప్రభాకరం.

మూడు నిముషాల్లో ఇల్లు చేరారు ముగ్గురూ.

"డాక్టరు గారూ, మా అన్నయ్య ప్రభాకరం..."
"నమస్కారమండీ, నీలూకేమీ ప్రమాదం లేదుకదా?"
"భయపడకమ్మా, నీలూకు ప్రాణప్రమాదమైతే తప్పింది. అంతవరకూ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ,
సూర్యంగారికి మీకు చెప్పే సమయం ఉండిందో లేదో నాకు తెలియదు కాబట్టి నేనే చెప్తాను, ఆమెకి తర్వాత్తర్వాత కొన్ని
చిన్న చిన్న మానసిక సమస్యలు కలిగే అవకాశముంది. నథింగ్ సీరీయస్ లెండి. ఈ సంగతి సరిగా తెలియాలంటే
హైదరాబాదు లాంటి చోట్ల కానీ టెస్ట్లు కుదరవు. ఒకవేళ నిజంగానే అవకాశముంటే మాత్రం నాకు తెలిసి మనదేశం లో
చికిత్సలేదు. అమెరికా వెళ్లాలి"
"ప్రాణప్రమాదం లేదన్నారు. అది చాలు. డాక్టరుగారూ, ఈ వ్యాధి గురించి మీరు దయచేసి ఇంకొన్ని వివరాలు
కనుక్కుని చెప్పగలరా? మీకు రుణపడి ఉంటాను."
"తప్పకుండానండీ. కానీ, ఇదసలు మీరనుకునేంత, మీరనుకునేలాంటి 'వ్యాధి' కాదండీ. హైదరాబాదులో,
చెన్నైలో నా స్నేహితులున్నారు. వాళ్లతో మాట్లాడి సాయంత్రమే మిమ్మల్ని కలుస్తాను. మీరు ధైర్యంగా ఉండండి."

* * * * * * * * * * *

"రేయ్, అక్కడ ఏర్పాట్లు జరగబోతున్నాయి. నువ్వు కొంచెం మూవ్ మెంట్ చూపించకపోతే కష్టం"
"ఏమేర్పాట్లు మధూ?"
"నాకూ నీలూకీ పెళ్లంట"
"ఒక్క నిముషం", మందుల ఇన్ఫర్మేషన్ షీట్లు చదవటం ఆపి, కిందపెట్టి, మధుని చూశాడు విజయ్, "ఇంకోసారి
చెప్పు?"
"అవున్రా"
"సంగతేంటి క్లియర్ గా?"
"పెద్దదేమీ కాదులే, సూర్యం వాళ్లు నిన్ననే మా తాతయ్యని అడిగారంట. మనమీ ఊర్లో కొంచెం ఫేమస్ అని ముందే చెప్పాను కదా. సగం ఇలాంటి ప్రాబ్లమ్సుంటాయనే నేనిక్కడికి రాననుకో. ఊర్లో ప్రతి అమ్మాయీ..."
"విషయం చెప్పుబాబూ"
"వస్తున్నా. నాతో ఇందాకే తాతయ్య మాట్లాడారు. నాకొక్కటి సరిగ్గా చెప్పు. నీ సంగతేంటి? నువ్వూ నీలూ మంచి
జోడీ అని తాతయ్యతో చెప్పేశాను. నాకు వేరే సెటప్పులున్నాయని చెప్తామనుకుంటున్నాను సూర్యంగారితో."
"నేనొకసారి నీలూతో మాట్లాడాలి. ఎలా కుదురుతుందంటావ్? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా"
"నువ్వదేమన్నా కష్టమనుకుంటున్నావేమోగానీ, actual గా కాదు. చూడు కావాలంటే. సీతా..."
"ఏంటి బావా, తిండి కావాలా?", కింది నుంచి అరిచింది సీత.
"దీనికి రోజురోజుకీ లోకజ్ఞానం ఎక్కువౌతోంది. అదేం లేదుగానీ ఇలారా"
"త్వరగా చెప్పు, మేమంతా గుడికి వెళ్తున్నాము సూర్యం వాళ్లతో", వేగంగా మెట్లు ఎక్కుతూ వచ్చింది.
"వాళ్లందరూ వెళ్తున్నారా? ఇంట్లో ఎవరుంటున్నారు నీలూతో?"
"వాళ్ల బామ్మ, అయినా నీకెందుకు?"
"ప్రశ్నలడక్కు, పది నిముషాలు టైమిస్తున్నా, నువ్వక్కడుంటానని చెప్పి ఆమెను వాళ్లతో గుడికి పంపించాలి. నీకు తగిన మొత్తం సమర్పిస్తాలే"
"తుచ్ఛమైన డబ్బు కోసం..."
"నా బ్లూ సూట్ కేసులో సోనీ సీడీ ప్లేయ..."
"ఐదు నిమిషాలు చాలు. ప్లేయర్ మధ్యాహ్నం కలెక్ట్ చేసుకుంటా. బై."
"లోకజ్ఞానముంది, నిజమే", అన్నాడు విజయ్, పరుగుతీస్తున్న సీతని చూసి.

విజయ్ - తిరుపతి - 7/July/2005 - సశేషం

Friday, July 08, 2005

Chapter 16

కొన్ని వేల మైళ్ల దూరంలో (కార్నెల్ యూనివర్సిటీ, న్యూ యార్క్)

హడావిడిగా ఉంది కాలేజి కేంటీన్, ఇద్దరు మెడికల్ స్టూడెంట్లు మాట్లాడుకుంటున్నారు.

"ఈ పాటికి మన వాడు పూర్తి చేసి ఉంటాడంటావా ? "
"వాడి సంగతి నీకు తెలీదు, FM రేడియో వింటూ ఆపరేషన్ చేస్తాడు,
మనిషి ఎంత సరదాగా ఉంటాడో , పని చేసేటప్పుడు అంత సీరియస్", కాఫీ తాగుతూ అన్నాడు దీపక్.
ఇంతలో చిన్నగా విసిల్ వేస్తూ వచ్చాడు లోకేష్,
"How was it ?"
"Good. Went pretty well."
"అవును, ఆ పేషంట్ కి అనెస్తీషియా అంటే ఎలర్జీ అన్నావు కదా , లోకల్ అనెస్తీషియా ఇచ్చావా ? "
"నా సంగతి నీకు తెలుసు కదా , నో లోకల్ నో స్మగుల్డ్, వోన్లీ ఇంపోర్టెడ్!"
"ఒరే, ఆపరా నీ జోకులు, అహ్ అహ అహ్" చిన్నగా దగ్గుతూ ..
"ఇక్కడ కాఫీ తాగినప్పుడల్లా గొంతు పట్టినట్టు ఉంటుంది" అన్నాడు దీపక్,
"ఈ సారి కాఫీ తాగేటప్పుడు , స్పూన్ అవతల పడెయ్"
"ఒరేయ్ , " ఈ సారి ఇద్దరూ లోకేష్ ని కొట్టడానికి లేచారు!


* * * * * * * * * * * * *

వంట చేస్తున్న లోకేష్ హాల్ లోకి వస్తూ అన్నాడు,
"వంట చెయ్యడం అనేది సైన్స్ కి తక్కువ , ఆర్ట్ కి ఎక్కువ."
హాల్ లో F.R.I.E.N.D.S సీరియల్ ని సీరియస్ గా చూస్తున్న దీపక్ విరక్తిగా అన్నాడు,
"నిజమే, కొంపదీసి ఈ మధ్య పోస్ట్ మోడెర్నిజం, abstract ఆర్ట్ గురించి ఏమీ చదవట్లేదు కదా ?"
"ఛీ, ఐనా ఆర్ట్ నీ కళ్లకెలా కనిపిస్తుంది? పబ్ లో సరైన లైటింగ్ ఉండదు,డిస్కోలో తలకి బేలన్స్ ఉండదు, ఇంతకీ నిన్న నీ డేట్ ఎలా ఉంది ? "
"She is damn good. I think I'm in love with her".
"ఒరే, మొన్న ఇదే మాట వేరే అమ్మాయి గురించి చెప్పావు కదరా ? ఒక్క రోజులో ప్రేమ ఎలా పుట్టుకొస్తుందిరా ?"
"ప్రేమ గుడ్డిది రా "
"ఐతే , వచ్చే వారం , వేరే గుడ్డి అమ్మాయి కనిపిస్తుందా ?"
"ఒరే ...."
తిట్టు మధ్యలోనే ఆగి పోయింది, ఫోన్ రింగ్ అవ్వడంతో!

"చూడరా , నా డేట్ అయ్యివుంటుంది."

లోకేష్ ఫోన్ లిఫ్ట్ చేశాడు.
"You want to speak to Deepak ? He is on vacation. Would you like to hold the line ?"
"ఒరే ..."
పరిగెడుతూ వెళ్లి ఫోన్ లాక్కున్నాడు దీపక్.

కాసేపు గోడకి ఆనుకుని
కాసేపు బీన్ బేగ్ మీద కూర్చోని
కాసేపు వాటర్ బెడ్ మీదకి ఫోన్ లాక్కొని
కాసేపు నడుస్తూ ,
కాసేపు నవ్వుతూ
కాసేపు గుండ్రంగా తిరుగుతూ మాట్లాడుతున్నాడు దీపక్.

టిక్ టిక్ పావు గంట
టిక్ టిక్ అర గంట
టిక్ టిక్ గంట
టిక్ టిక్ గంటన్నర

సాగుతూనే ఉంది సంభాషణ.

ఇక లాభం లేదని వెళ్లి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు లోకేష్.
"ఏం చేస్తున్నావ్ "
"చాల్లేరా, కాలేజి నించి ఇంటికి వచ్చిన అర గంట గురించి రెండు గంటలు చెప్తున్నావ్ "
ట్రింగ్ ట్రింగ్ , ఫోన్ మళ్లీ మోగడంతో స్టెల్లా అయి ఉంటుంది అనుకుంటూ లిఫ్ట్ చేశాడు దీపక్.
"స్టెల్లా , What happened was ... "
"ఎవరు స్టెల్లా ? మా అబ్బాయి కి ఫోన్ ఇవ్వు", గాటుగా వినిపించింది కంఠం.
"లోకెష్, నీకు ఫోన్, ఊలపల్లి నించి!"
పరిగెడుతూ వచ్చి ఫోన్ తీసుకుని అన్నాడు "నాన్న గారు..."
"ఏరా మాలోకం, ఈ స్టెల్లా ఎవరు ? "
"నాన్నా , ఎన్ని సార్లు చెప్పాను నన్ను అలా పిలవద్దని, నా పేరు లోకేష్"
"పాలు కాచి తోడు పెట్టరా అంటే ఇల్లంతా పొగ పెట్టిన మాలోకానివి"
"అది అప్పుడు నాన్నా , ఇప్పుడు నేను పెద్ద ని chef ని,రెస్టారెంట్ పెడదామని చూస్తున్నా"
"నీ తిండి తిన్న వాళ్లందరికీ నువ్వు వైద్యం చెయ్యగలిగితే చాలు, సరిపడే డబ్బులు , ఏం తెలివి రా ?"
"ఎంతైనా డాక్టర్ కృష్ణమూర్తి గారి కొడుకును కదా ?"
"సరి , సరి , నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి "
"దేని గురించి నాన్నా ?"
"నీలు గురించి"

సశేషం [బెంగుళూరు, (జూలై 11, 2005) , కళ్యాణ్(కాకినాడ)]

Thursday, July 07, 2005

Chapter 17

అంతా గుడికి బయల్దేరారు।
బామ్మ గారు, నీలు ఇంట్లో ఉన్నారు। నీలు గదిలో మంచంమీద విశ్రాంతి తీసుకుంటోంది। ఇంతలో సీత "బామ్మ గారూ" అంటూ వచ్చింది।
"అదేమిటే సీతా, నువ్వు ఇక్కడున్నావు... అంతా గుడికి బయల్దేరిపోయారే..."
"లేదు బామ్మగారు, నేను గుడికి వెళ్లట్లేదు। నేను నీలక్క దగ్గర ఉంటాను, మీరు గుడికి వెళ్లిరండి"
"పర్వాలేదులేవే, నేను ఉంటాను, ముసల్దాన్ని నాకేంటి చెప్పు, నీలు దగ్గర నేతోడుంటాలే, నువ్వు గుడికి వెళ్లు"
"అబ్బ బామ్మగారూ, నేను నీలక్కతో మాట్లాడి చాలా రోజులయింది కూడాను, మేమిద్దరము చక్కగా కబుర్లు చెప్పుకుంటాము, మీరు వెళ్లిరండి..."
ఇంతలో లోపలనుంచి నీలు "బామ్మా నువ్వు గుడికి వెళ్లవే, సీత ఉంటానంది కదా॥॥"
"అలాగేలేవే, నే వెళ్తున్నా॥॥ ఇల్లు జాగ్రత్తే పిల్లా, తలుపు గడీ పెట్టుకోండి॥॥"
"అవంతా మేము చూసుకుంటాంలేండి బామ్మగారు॥॥, మీరు త్వరగా బయల్దేరండి, వాళ్లని అందుకోవద్దూ॥॥"

--------------------

"ఏమిటే సీతా విశేషాలూ, చాలా రోజులయింది మనం మాట్లాడి॥॥ మీ మూక అంతా ఓకే నా॥॥।"
"అదుగో నీలక్కా నువ్వు కూడా అలా మూక, ఊక అన్నావంటే నేను నీతో మాట్లాడను పో॥॥॥"
"సర్లేవే, అననులే కానీ, కబుర్లు చెప్పు మరీ॥॥॥"
"ఆ, ఏముంటాయి కబుర్లు ఈ బుల్లి ఊలపల్లి లో, రెండావులు ఈనాయి, ముగ్గురు ఆడపిల్లలు పెద్దమనుషులు అయ్యారు, వెంకన్న రెండో భార్యకి మూడో పురుడు, ఇంకా..."
"ఛా, ఊరుకోవే, నీకింకా పెంకితనం పోలేదు... పోనీ ఊలపల్లివి కాకపోతే వేరే కబుర్లు చెప్పచ్చు కదా..."
"వేరే కబుర్లేముంటాయి చెప్పు..."
"నీ బావేం కబుర్లు చెప్పలేదా ఈసారి, నీకేం తీసుకురాలేదా??"
"ఆ మా బావా, ఓ పెద్ద ఫోజు కొడతాడు.. ఈ సారి వాళ్ల friend కూడా తయారయ్యాడు కదా, ఓ తెగ మాట్లాడేసుకుంటారు... ఇంక నాకేం కబుర్లు చెప్తాడు..."
"అవునా, ఏం మాట్లాడుకుంటారే వాళ్లు.. చెప్పు చెప్పు..."
"ఆ ఏదోబాబు, మాట్లాడితే, computer అంటారు, language అంటారు, C, C++, Java అంటారు.. అయినా నీకెందుకే నీలక్కా???"
"ఆ ఏంలేదు, ఊరికే అడిగా..."
"సర్లే, మధ్య, మధ్యలో నీలు నీలు అనికూడా వినిపిస్తుంటుంది.."
"నీకు మరీ వెటకారం ఎక్కువయి పోయిందే...."
"ఆ.. ఉన్న మాటంటే ఉలుకెక్కువనీ, అయినా వాళ్లొస్తారుకదా, వాళ్లనే అడుగు..."

--------------------------------
బామ్మగారు రిక్షా కట్టించుకుని గుడికి బయల్దేరారు...
శశికళ గారు ప్రభాకరంగారి తో, "నాకు కొంచెం నీరసంగా వుంది, నేను గుడిదాకా రాలేను, వెనక్కి ఇంటికి వెళ్తాను।"
"అదేమిటే, ఇందాక దాక బాగానే ఉన్నావు కదా, పోనీ నేను కూడా నీతో ఇంటిదాకా రానా...."
"అక్కర్లేదు, నే వెళ్లగలను... మీరు గుడికి వెళ్లి అర్చన చేయించండి...."
శశికళ గారు అడ్దదారి గుండా ఇంటికి బయల్దేరారు।
------------------------------------------------------
మధు, విజయ్ సూర్యం గారి ఇంటికొచ్చారు। నీలు ఉన్న గదికి వెళ్లారు.
"ఇప్పుడెలా ఉంది నీలూ నీకు", మధు అడిగాడు।
"బాగానే ఉంది మధు...."
సీత ముందు గదిలో tv చూడడానికి వెళ్లింది।
విజయ్ అందుకుని, "మళ్లీ చూడడం కుదరలేదు, అందుకని ఎలా ఉన్నావో కనుక్కుందామని వచ్చాము॥।"
"మీరు చేసిన సహాయం వల్ల ఇప్పుడు బాగా ఉన్నాను॥॥। నేను కూడా మిమ్మల్ని కలిసి మనస్పూర్తిగా thanks చెప్దామనుకున్నాను॥॥ ఇదిగో మీరే వచ్చారు"
"సరే formalities అయిపోతే, అసలు విషయానికి వద్దామా" మధు ఇద్దరినీ చూసి అన్నాడు।
శశికళ గారు ఇంటికి చేరుకున్నారు। "ఏమిటే సీతా, ఇక్కడున్నావు।"
"నీలక్కతో మాట్లాడదామని వచ్చానండి...."
"నీలు లోపల ఉందా॥॥"
"అవును, లోపల ఉంది, బావా వాళ్లు నీలక్కతో మాట్లాడుతున్నారు..."
"అలాగా, నేను కూడా వాళ్లకి thanks చెప్పాలనుకున్నాను... సమయానికి మా నీలుని కాపాడారు"
శశికళ గారు నీలు గదివైపు వెళ్లారు।
"నీలూ, అమ్మా నీలూ...."

(శ్రీ హర్ష - 7/12/5 - సశేషం)

Wednesday, July 06, 2005

Chapter 18

"శశికళ గారూ఍఍!!!", సీత ఇంచుమించు కెవ్వున పిలిచింది.
శశికళ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది, "ఏమిటే సీతా, అంత బిగ్గరగా అరిచావూ?"
"బయటనుండి వస్తే కాళ్లూచేతులూ కడుక్కునిగానీ నీలక్కగదిలోకి వెళ్లొద్దని డాక్టరుగారు అన్నారండీ"
"సమయానికి గుర్తుచేశావమ్మా, బావి బయటే ఉందిగా, ఇప్పుడే వస్తాను"
సీత పరుగందుకుంది.

*******

"నీతో కొంచెం మాట్లాడాలి నీలూ"
"నీలూ, అమ్మా నీలూ...."
"వాళ్లమ్మగారు వచ్చినట్లున్నార్రా"
"అదేంటి, వాళ్లంతా గుడికెళ్లారు కదా", కిటికీ పక్కన ఉన్న కుర్చీలోంచి లేస్తూ అంది నీలు.
"నీలూ, నీకు తేలిగ్గా ఉంటే కొంతసేపు ఏటిగట్టుపైన నడిచివద్దామా. ఈ టైం లో అక్కడ చాలా బాగుంటుంది. నీక్కూడా కొంచెం రిలాక్స్ అయినట్లుంటుంది. ఏరా విజయ్?"
"ఏమంటావు నీలూ?"
"వచ్చేశారు఍! వచ్చేశారు఍! శశికళగారు వచ్చేశారు఍!"
"ఏదో దేశస్వాతంత్ర్యం వచ్చేసిన లెవల్లో చెప్తున్నావే. ఆవిడ పిలవడం మేముూ విన్నాంలే "
"డీల్లో లేకపోయినా రక్షించినందుకు ఇదీ ఫలితం. ఇంకోసారి చూడు"
నీలూ నవ్వాపుకుంది, "నాకు బాగానే ఉంది. డాక్టరుగారుకూడా సజెస్ట్ చేశారు. పదండి"
"ఏరు గుడివైపులేదు కదా?", మధుని మెల్లగా అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు విజయ్.
"లేదులేరా. దారికడ్డులే఍!"
"ఖలుడికి ఒళ్లంతా విషమని పెద్దలు ఎప్పుడో చెప్పారు బావా, వాళ్లమాట సరిగ్గా వినుండాల్సింది"
"ఓయబ్బో, ఇలాంటి మాటలు దశాబ్దాలుగా వింటున్నాను. నీలూ, మేము మీ అమ్మగారిని పలకరిస్తుంటాం మరి. పదరా. అడ్డులెమ్మన్నానా!"

విజయ్ - తిరుపతి - 14/July/2005 - సశేషం

Tuesday, July 05, 2005

Chapter 19


"నీలు మీద పిడుగు పడింది", నెమ్మదిగా చెప్పారు కృష్ణమూర్తి గారు.
" ఏంటి? పిడుగా? నీలు ఎలా ఉంది ? పిడుగు మీద పడడం ఏంటి?", కంగారుగా అడిగాడు లోకేష్.
"కంగారు పడకు, నీలు క్షేమంగానే ఉంది, అంతా చాలా కంగారు పడ్డారు,
పిడుగు పడ్డ సమయంలో కోనేటి తోటలో రావి చెట్టు కింద ఉంది నీలు.
పిడుగు పడ్డ శభ్దం, అంత దగ్గరనించి పిడుగు చూసేసరికి మూర్ఛపోయింది.
ఆ తర్వాత కురిసిన వడగళ్ళ వాన వల్ల ఊపిరి తీసుకుపోలేకపోయింది.
ఒక ఇద్దరు కుర్రాళ్ళు సరైన సమయంలో first aid చేశారు. ఇప్పుడంతా బానే ఉంది, నార్మల్ కండిషన్ లో ఉంది,
"Oh, God! ఎప్పుడు జరిగింది, నాకు ఎందుకు చెప్పలేదు?"
"రెండు రోజులయ్యింది, నీకు చెప్తే కంగారు పడతావని చెప్పలేదు, అసలే పరీక్షలు కదా ,"
"hmm.."
" ఇంకో విషయం, నీలు ఇంట్లో చిన్న అబద్ధం చెప్పాను."
" ఏంటి ??"
"నీలు కి dementia అని చెప్పాను, అమెరికా లో మాత్రమే దానికి వైద్యం ఉందని , 5-10 సంవత్సరాలు పడుతుందని..."
"Dementia ?? ఎందుకు నాన్నా ?" ఏమీ అర్ధం కాలేదు లోకేష్ కి.
" నీకు తెలుసు కదా, నీలు వాళ్ళ ఇంట్లో అమ్మాయిని అమెరికా పంపించడం ఇష్టం లేదు.
ముఖ్యంగా ప్రభాకరం గారికి. ఈ వంక తో నువ్వు పెళ్లి చేసుకొని అమెరికా తీసుకువెళ్లి పోవచ్చు."
" కాని వాళ్లింట్లో అబద్ధం చెప్పటం నాకు ఇష్టం లేదు...."
"ఒరే మాలోకం, చెప్పాల్సినవన్నీ నేను చెప్పేశాన్లేరా."
" కాని నాన్నా, నువ్వు ఈ మధ్య వస్తున్న యూత్ సినిమాల్లో ఉండే too-good-to-believe నాన్న అవుతున్నావే ?"
" నేనెప్పుడూ అలాగే ఉన్న కదరా "
" ఒక్క నిమిషం ... కట్నం, నీలు ఆస్తి దీనికి కారణం కాదు కదా ?"
" ఏం కాదురా, నువ్వు నీలుని ఎలాగో పెళ్లి చేసుకుంటావు,
నీలుని అమెరికా పంపకపోతే, నువ్వు ఊలపల్లి వచ్చేస్తావు, అందుకే ..."
"ఏం తెలివి నాన్నా, ఇంతకీ వాళ్లంట్లో నమ్మారా ? వేరే చోట మళ్లీ టెస్ట్ చేయిస్తే ?"
" ఇంట్లో నమ్మారు, కాని ఆ విజయ్ నమ్మలేదు, హైదరాబాద్ తీసుకెళ్దాం అంటున్నాడట."
" ఎవరీ విజయ్ ? "
"మధు ఫ్రెండ్, హైదరాబాద్ నించి వచ్చాడు, అదే నీలుకి first aid చేశాడని చెప్పాకదా ?"
" ఆఁ, చెప్పావు."
"నీతో తర్వాత మాట్లాడతా, సూర్యం గారు వస్తున్నారు ఇక్కడికి."



ఫోన్ పెట్టి అక్కడే కూర్చుండిపోయాడు లోకేష్, ఒక్కసారి భారంగా ఊపిరి తీసుకుని organizer తెరిచాడు.
ఇండియా వెళ్లదానికి ఇంకా ఎన్ని రోజులుందో లెక్క పెట్టాడు.

నీట్ గా తయారయ్యి బయటకు వచ్చాదు దీపక్,
"ఏరా , మళ్లీ తెరిచావా organizer , మళ్లీ పగటి కలలా ?"చిన్నగా స్వదేస్ పాటపాడడం ప్రారంభించాడు దీపక్.
"నా సంగతి సరే, ఎవరితో ఈ రోజు డేట్, స్టెల్లా నా చార్లీ నా ?", చిన్నగా మాట మార్చాడు.
" అక్కడే మరి, దాల్ ఫ్రై లో కాలు వేశావ్" కళ్లు ఎగరేస్తూ చెప్పాడు,
"మరి... కొత్త డేటా ? "
"అంత లేదు రా బాబు", లోగొంతుకతో, తలవంచుకుని, కాస్త వంగి చెప్పాడు,
"నాకు రేపు ఎగ్జాం ఉంది, లైబ్రరీ వెళ్లి కొంచెం చదువుకుంటా."
బాగ్ తీసుకుని వెళ్లిపోయాడు దీపక్.
మళ్లీ నీలు గుర్తుకు వచ్చింది లోకేష్ కి, ఫోన్ తీసి నీలు సెల్ ఫోన్ కి డైల్ చేశాడు, నాట్ రీచబుల్ అని వచ్చింది .
ఇంటి నంబర్ కి చేశాడు, ఇప్పుడే విజయ్, మధు లతో కలిసి బయటకు వెళ్లిందని చెప్పింది పనిమనిషి.
వచ్చినతర్వాత లోకేష్ ఫోన్ చేశాడు అని చెప్పమన్నాడు.


* * * * *


నీలు, మధు, విజయ్ ఏటి గట్టు మీద నడుస్తున్నారు.
" చాలా థేంక్సండీ, మీరు చాలా హెల్ప్ చేశారు." కృతజ్ఞతగా అంది నీలు.
" ఐనా , అంత పెద్ద వాన లో చెట్టు కింద ఎందుకు నించున్నారు" అడిగాడు విజయ్.
"అబ్బా , డాన్స్ ప్రోగ్రాం ఉంది కదా, తడవడం ఎందుకులే అని చెట్టు కిందే ఉండి పోయాను."
" ఇప్పుడు అంతా బానే ఉంది కదా ?"
" ఆ, అంతా బానే ఉంది, తలనొప్పి మాత్రం కాస్త ఎక్కువగా ఉంది."
"నాక్కూడా. " మనసులో అనుకున్నాడు మధు.
చిన్నగా గిల్లాడు విజయ్ ని , "చెప్పరా", గుసగుసగా అన్నాడు.
"నీలు ఒక చిన్న విషయం, ఈ ఊలపల్లి డాక్టర్లను ఏం నమ్మచ్చు ?
హైదరాబాద్ వెళ్లి ఒక సారి చూపించుకోవచ్చు కదా ?"
"విజయ్ గారు, మీకు ఊలపల్లి అంటే అంత చిన్న చూపు ఎందుకు ?"
"అహఁ, నా ఉద్దేశం అది కాదు...."
" సరే ఆ సంగతి వదిలేయండీ, ఏదో చెప్పాలన్నారు."

సశేషం [బెంగుళూరు, (జూలై 23, 2005) , కళ్యాణ్(కాకినాడ)]

Monday, July 04, 2005

Chapter 20

" నాకు ఒక చిన్న పని వుంది, ఇప్పుడే వస్తాను...ఇంతలో మీరు మాట్లాడుతూ వుండండి..
అవసరమైతే సెల్ కి కాల్ చెయ్యరా" మధు మాటలు పట్టించుకోలేదు విజయ్ , " నాతో ఇంకేమి అవసరం వుంటుంది లే" అనుకొని అక్కడి నుంచి ఆనందంగా జారుకున్నాడు మధు.

" నీలు , నీతో ఒక ముఖ్య విషయం గురించి మాట్లాడదామని పిలిపించాను , కాని మాట్లాడాలి అంటే ధైర్యం చాలటం లేదు." విజయ్ మాటల్ని ఇప్పుడిప్పుడే అర్దం చేసుకొంటోంది నీలు..
చాలా సేపు అలా నడుస్తూనే వున్నారు ఇద్దరూ. మాటలు లేవు. అడుగుల శబ్దం తప్ప...
" పర్వాలేదు చెప్పండి .." నీలు సైలెన్స్ బ్రేక్ చేసింది.
" నీలు నిన్ను నిన్న చూసినప్పుడే చెబ్దామని అనుకున్నాను . కాని ఎందుకో సమయం సందర్భం కాదు అనిపించి చెప్పలేదు . ఇందాక మధు గాడు చెప్పిన మాటవిని నీతో అసలు విషయం చెప్పేద్దామని అనుకుంటున్నాను..."
" విజయ్ గారు, మీరు ఇందాకటి నుంచి ఇదే విషయము చెప్తున్నట్లు వున్నారు... ఏమిటి టెన్షన్‌ గా వుందా?" అమాయకంగా అడిగింది నీలు...
" నాకూ ఊలపల్లి చాలా నచ్చింది. చిన్నప్పటినుంచి పల్లెటూరు ఎప్పుడూ చూడలేదు.. ఈ గాలి , వాతావరణము , జాతర సంబరాలు , ఇవన్నీ నచ్చాయి. నువ్వు కూడా........
..................

మధు గాడి తో స్నేహం మూలాన ఈ రోజు రాగలిగాను కానీ ఇక ముందు ఈ ఊరు రావాలంటే కష్టం కదా! అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. కాని నువ్వు ఒప్పుకుంటేనే..." నీలు వైపు చూడాలంటే భయం వేసింది విజయ్ కి..

SAD exam ముందు రోజు రాంబాబు గాడి తో " ప్రేమ, పెళ్ళీ " group discusssion , " ప్రేమా , దోమా, ఇవన్నీ infatuation..............., trash................, bs, " మొదలైన డైలాగులు గుర్తుకు వచ్చి " ఛా! టైము చాలా వేస్టు చేసే వాళ్ళం కాలేజ్ లో !!!" అంత టెన్షను లోను flashback గుర్తుకొచ్చింది.

" విజయ్ గారు, మీరు నాతో చెప్పిన ఈ మాట నేను ఇంకొకరితో ఇంతకు ముందే చెప్పాను " ...నీలు మాట్లాడింది ..

" ప్రేమా , దోమా, ఇవన్నీ infatuation....... trash.........bs...... " నిజమే అనిపించాయి విజయ్ కి ,, అయినా తేరు కొని " ఏమిటి నీలు నువ్వు చెప్పేది.. ఇంతక ముందే చెప్పావా? ఎవరితో ? " కొంచెం కోపం , కొంచెం ఈర్ష్య , కొంచెం బాధతో అడిగాడు.. ఇన్ని అనుభూతులు ఎప్పుడూ అనుభవించని వాడిలా ...

" విజయ్ గారు, నాకు మధు అంటే చాలా ఇష్టం..మధుకి ఒక సారి చెప్పాను కూడా, కాని పట్టించుకోలేదు.." నీలు కూడా బాధ పడుతోందిప్పుడు ..

విజయ్ కి అర్థం అయ్యింది. బాధ విలువా తెలిసింది ...
" నీలు , నీకు మధు గురించి తెలియదు , వాడు చాలా ఈజీ గా తీసుకుంటాడు ప్రతీది .. నువ్వు చెప్పిన విషయం వాడు ఇప్పటి వరకు ఎప్పుడూ నాతో చెప్పలేదు, పైగా ఈ రోజు మనం ఇలా మాట్లాడుకొనేటట్లు arrange చేసిందీ వాడే .. ఇంకొక విషయం ఏమిటంటే మధు వాళ్ళ తాతగారితో మీ బాబాయి గారు నిన్ననే మీ సంబంధం గురించి మాట్లాడారుట .. ఇంత జరిగినా వాడు ఏమీ పట్టనట్లు వున్నాడు అంటే నీ మీద వాడికి ఇష్టం లేదేమో ! "
" ఏమో "
" నన్ను ఏమన్నా మాట్లాడమంటావా ? ",
" వద్దులేండి ... నేనే మళ్ళీ అడుగుతాను మధు ని ...
........మీరు ఊలపల్లి రావటానికి ఇంకేదైనా కారణం ఆలోచించుకుంటున్నారా ? ", నీలు చిలిపితనం కొంచెం కష్టంగానే వున్నా , నవ్వువచ్చింది ..హాయిగా నవ్వుకున్నారు ఇద్దరూ .. దూరంగా మధు రావటం చూసి అటు వైపు చూశారు ..

" మీ హీరో వస్తున్నాడు .. మరి చెప్పేది చెప్పేసెయ్ . మీ నాన్నగారూ వాళ్ళూ వున్నారు కాబట్టి పప్పన్నం ముహూర్తం డిసైడ్ చేసేస్తారు ... "
సిగ్గు కనిపించింది నీలు మొహంలో ..........

(వంశీ - విజయవాడ - 23/07/2005 - సశేషం)

Sunday, July 03, 2005

Chapter 21

లోకేష్ ఫోన్ కిందపెట్టి ఆలోచించడం మొదలుపెట్టాడు. మెల్లగా ఒక plan రూపుదిద్దుకుంది అతని మనసులో. దీపక్ కి కాల్ చేశాడు, "ఒరేయ్, నీకు వచ్చే రెండు, మూడు వారాల్లో రాచకార్యాలేమీ లేవుకదా?"
"అలాంటివేమీ లేవు, ఉంటే గింటే ఏమన్నా అన్నీ చెలికత్తెలతోనే"
"మనం ఇండియా వెళ్తున్నాం"
"ఓకే. లంచ్ కి ఏమి చేద్దాం ఈరోజు?"
"..."
"నువ్వు ఇందాక ఇండియా అన్నావా?"
"ఆఁ"
"కొంచెం alert చేసి చెప్పొచ్చు కదా?"
"నీ కోసం ప్రతి విషయానికీ ముందూ వెనకా ఈల వేసి చెప్తార్రా? జాగ్రత్తగా విను. వచ్చేవారం మనం ఇండియా వెళ్తున్నాం. చెలికత్తెలతో పని కాదు, రాచకార్యానికే. ఈ విషయం మా ఇంట్లోకూడా తెలియదు"
"సీక్రెట్ మిషనన్నమాట"
"నీకు ఓకేనే కదా"
"మనం రెడీ. నాకసలు ఇలాంటి విషయాలంటే ఒక పులకరింత గా ఉంటుంది "
"టికెట్స్ బుక్ చేస్తున్నామరి"
"చేసెయ్! .... ఆగాగు, ఇంతకీ ఇండియాలో ఎక్కడికి? కేరళా? సిమ్లా? గోవా? ఖజురహో?"
"ఊలపల్లి"
"..."
"..."
"ఏమిటీ???"
ఫోన్ పెట్టేశాడు లోకేష్.

***************

మధు జామకాయ తింటూ వచ్చాడు వాళ్ల దగ్గరకి.
"ఏంట్రా, మాట్లాడుకున్నారా?"
విజయ్, నీలూ మౌనంగా ఉండిపోయారు.
"ఏం జరిగిందిరా?"
"ఏమీలేదు మధూ, నేను మీ ఇద్దరినీ మళ్లీ కలుస్తాను", గట్టు మీదనుంచి లేచాడు విజయ్.
"ఇంక చాలు మధూ, మీ జోకుల పుణ్యమా అని నాకు మాత్రం పుట్టెడు టెన్షన్ మిగులుతోంది. విజయ్ గారూ, ఇందాక మాట్లాడినవంతా మధు చెప్పమన్నమాటలే. దయచేసి ఏమీ అనుకోకండి. మీ అందరికి ఇలాంటివి light అని చెప్పే మధు నా చేత అలా జోక్ చేయించాడు .."
"ఏమీ అనుకోకుండా ఎలా ఉంటాడు, నువ్వు average గా ఏమన్నా నటించావా ?? వాడి మొహం చూస్తేనే అర్దం అవుతోంది నువ్వు ఎంత బాధపెట్టావో "
"ముందే గెస్ కొట్టుండాల్సింది", విజయ్ కి మళ్లీ " ప్రేమా , దోమా, ఇవన్నీ trash" మొదలైన డైలాగులు గుర్తొచ్చాయి.
"మీరు గెస్ కొట్టనందుకు నేను చాలా బాధపడుతున్నానండీ"
"అంటే, ఏమిటి నీలూ నీ ఉద్దేశం? అక్కడ సీత నా పరువు తీసి, ఇక్కడ నువ్వుతీసి, నా పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందిరా విజయ్" మధు బాధ, బాధ లాగా లేదు.
పైసాచిక ఆనందాన్ని అస్సలు ఓర్చు కోవటంలేదు విజయ్ మనస్సు ... "పర్లేదులేరా, బాధపడకు, ఐనా, నీకు ఇంట్లో ఏదో పనున్నట్లుంది?"
"హుఁ, పని. ఇంట్లో. ఇప్పుడు. ఆహా, ఎంతటి subtle message? వెళ్లిపోతున్నాలే, కంగారుపడకండి."

విజయ్ - తిరుపతి - 23/07/2005 - సశేషం

Saturday, July 02, 2005

Chapter 22

నీలు కి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు విజయ్ కి.
వాళ్లిద్దరూ అలాగే మౌనంగా ఉండిపోయారు.
చల్ల్లటి గాలి వీయడం మొదలయింది.
"వర్షం వచ్చేలా ఉందండీ. ఇంటికి వెళ్దామా?"
మధు కోసం అటు ఇటు వెతికి, " మధూ మధూ " అని గట్టిగా అరిచింది నీలు.
వెనక్కి చూసి నీలు, విజయ్ తన వైపు రావటం చూశాడు మధు.
" ఏమయ్యిందిరా ? " విజయ్ ని అడిగాడు మధు.
అప్పుడే అకస్మాత్తుగా వర్షం రావడం మొదలయ్యింది. నీలు వాళ్ల ఇంటికి పరిగెత్తారు ముగ్గురూ.
మధు నీలు ఇంటి గేటు తీస్తూండగా, గట్టిగా పిడుగు పడ్డ శబ్దం వినిపించింది.
నీలు భయంతో గట్టిగా విజయ్ ని పట్టుకుంది.
"calm down నీలు calm down"

....

" అమ్మా నీలూ , లోకేష్ నుంచి phone వచ్చింది. " అని గట్టిగా అరిచింది శశికళ.
నీలు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది.

" ఇంట్లోకి తొందరగా రండి బాబూ. వర్షం లో తడిస్తే జలుబు వస్తుంది,,,
రండి , రండి . తల తుడుచుకోండి,,,
మా నీలుని కాపాడినందుకు థాంక్స్ బాబు విజయ్..........
వేడి వేడిగా coffee తీసుకువస్తాను ఆగండి. "

" బావా, మరి నా సీడీ ప్లేయర్ ??"
" నీలు వాళ్ళ అమ్మగారు ఉన్నారుగా ... అందుకే తూచ్ ...నీకు ఇవ్వను, ఎవరితో చెప్పుకొంటావో చెప్పుకో పో !!! "
" మీరు బయటకు వెళ్ళే టైము ఇచ్చానుగా .. "

వాళ్ల గోల భరించలేక హాల్లోకి వెళ్ళాడు విజయ్.
నీలు phone లో మాట్లాడుతోంది. సంస్కారం కాదని తెలిసినా వినటం మొదలుపెట్టాడు ...
ఒక్క వైపు మాటలే వినిపిస్తున్నాయి.

" మరీ ఇంతలా నాటకం ఆడతావు అనుకోలేదు లోకేష్."
" ......"
" అమ్మకు తెలుసా ??"
" ......"
" అవునా ?"
" ....."
" సో , ఎల్లుండి నా పుట్టినరోజున ఇక్కడికి వస్తున్నావన్నమాట !!"


" ఇదిగో బాబూ coffee " అని శశికళ గారు విజయ్ కి coffee ఇచ్చారు.
నీలు ఉలిక్కి పడి వెనక్కిచూసింది.

( వికేష్ రాజ్ - తిరుపతి - 24th July 2005 )

Friday, July 01, 2005

Chapter 23

అలికిడి విని ఫోను పెట్టేసింది నీలు. కాని మనసు వుండనివ్వడం లేదు లోకేష్ కి ఆ విషయం చెప్పనందుకు. మరి లోకేష్ తనని తీసుకుని వస్తాడో లేదో!

......

లోకేష్ కు ఇంకా టైము వేస్టు చెయ్యడం ఇష్టంగా లేదు. ఇంకా ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది అనిపించింది. మరి ఆలస్యం చెయ్యకుండా టికెట్లు బుక్ చెయ్యించాడు.

శుక్రవారం సాయంత్రమే ప్రయాణం అని తెలిసినవారందరికి తెలియచేశాడు. ఇంకోరోజు మాత్రమే ప్రయాణానికి ఉండడంతో తోడుగా వచ్చే దీపక్ కు సర్దుకోవటానికి సమయం సరిపోలేదు.

......

అక్కడ ఆందరూ వచ్చి సాగనంపారు కానీ ... ఇక్కడ ఎవరూ రాకపోవటం వింతగా అనిపించింది దీపక్ కు.


'ఏరా ... ఎవరూ రాలేదేమిటి? ... మరీ ఇంత సీక్రెట్టా నీ ట్రిప్పు?... మీ అమ్మకు నాన్నకు కూడా తెలియదా ఏమిటి? ... నేనేమో నీకు బ్రహ్మాండమైన ఆహ్వానం వుంటుంది అనుకున్నాను ... ఏమిటి ఈ సారి ఏమి చెయ్యాలి అనుకు..'

'మరీ అంత తొందర ఎందుకు? తినబోయే ముందు రుచి ఎందుకూ? ఇంకో రెండు గంటలలో తెలుస్తుందిగా.'

వీడు నన్ను కూడా సస్పెన్స్ లో పెడుతున్నాడు. ఏమిటి విషయం అని ఆలోచించటం మొదలుపెట్టాడు.

......

అంతలోనే వచ్చింది ఊలపల్లి. ముందుగా నీలుని కలవాలని ఉంది, కాని ముందు ఇంటికి వెళ్ళాలి.

ఇంట్లో అందరికీ అసలు విషయం చెప్పాడు. వీడిని 'మా'లోకం అని ఎందుకు అంటారో ఇప్పుడు గుర్తుకు వచ్చింది అందరికీ.

కాని వాడు వినే రకం కాకపోయేసరికి ఆ విషయం గురించి మాట్లాడానికి బయలుదేరారు.

......

నీలుకి తెలిసింది ఆ విషయం చివరికి వాళ్ళ బామ్మ ద్వారా. చాలా ఆనందించింది నీలు.

నీలుకి నచ్చిన వాడు దీపక్ అని పరిచయం చేశాడు అందరికి మన 'మా'లోకం.

ఇలా ఇంత తొందరగా సంబంధం కుదురుతుందని అనుకోలేదు నీలు వాళ్ళ ఇంట్లో.

పంతులు గారిని పిలిచి ముహుర్తం చూపిస్తే ఇంకో మూడు రోజులలో అదీ సరిగ్గా నీలు పుట్టిన రోజున కుదిరింది.

Chapter 24

గది తలుపు గట్టిగా వేశాడు దీపక్.
"ఏంట్రా ఇది? నాకు పెళ్లేంటి? ఏంటసలిదంతా? చూసేవాళ్లకీ, అప్పుడప్పుడూ నాకూ, తెలియదుగానీ, నాకు కూడా మనసనేది ఉంది తెలుసా? కానీ పిల్ల బాగుందిలే. మంచి డెసిషన్"
"ఎహె. ఆపరా గోల. పెళ్లిలేదు గిళ్లిలేదు. ఎక్కువ ఆశలు పెట్టుకోకు. విషయం చెప్తా విను."
"చెప్పు"
"మొన్న నాకు మా నాన్న నుంచి కాల్ వచ్చిందా?"
"నేను మాట్లాడిందా?"
"ఆఁ. నీలూ మీద పిడుగు పడిందని అప్పుడే తెలిసింది నాకు. కానీ మా నాన్న మరో విషయం చెప్పాడు. నీలూకి Dementia అని వాళ్ల family కి చెప్పాడట."
"వచ్చే chances ఉన్నాయి, నిజమే కదా?"
"కానీ తనకి లేదట. నాకూ నీలూకీ పెళ్లి జరిపించటం కోసం అలా అన్నాడట."
"WHAT!?!?! లేని జబ్బు ఉందని చెప్పాడా పెళ్లికోసం? ఇది ఘోరం. One minute, అంటే నీలూకి Dementia లేదన్నమాట. నాకిప్పుడు మా పెళ్లికి ఏ అభ్యంతరమూ లేదు. నాకోకే. నేను చేసుకుంటా."
"విషయం వినరా బాబూ. నేను నిజంగా సీరియస్. మా నాన్న ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు."
"నేను కూడా సీరియస్, చెప్పు."
"ఇవన్నీ ఇక్కడెవరికీ తెలియవు. పట్నంలో మా నాన్న పనిచేసే hospital illegal గా human body parts ని traffic చేస్తుందని rumors ఉన్నాయి. నేను ఎన్నోసార్లు కదిలించాను ఆయన్ని ఈ విషయంపైన, ఎప్పుడూ దాటవేసేవాడు"
"ఆ hospital గురించి నేనూ విన్నాను"
"కానీ ఆ పుకార్లు నిజమేనని ఈమధ్యనే నాకు అర్థమైంది. వాళ్ల storage facilities కి ఆ మధ్య రెండు రోజులపాటు power cut అయింది. పక్కరోజున ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేశారు. కారణం ఆ రెండు రోజుల్లో కోట్ల విలువ చేసే అవయవాలు చెడిపోవటమేనని నాకు కొంతమంది ద్వారా తెలిసింది. ఈ వార్త ఎక్కడా బయటికి రాలేదు. మా నాన్న కూడా ఏమీ అనలేదు."
"Oh my god!"
"ఈ పెళ్లి నీలూ ఆస్తికోసమేమో అని అనుమానించాను. జరిగిన నష్టంలో మా నాన్న part పూడ్చడానికేమో. అది confirm చేసుకోవడానికే హుటాహుటిన రావాల్సొచ్చింది."
"మరి ఈ పెళ్లి?"
"రేయ్, ఇంకా అర్థం కాలేదా? సాయంత్రం నీ విషయం చెప్పగానే ఎంత tense అయాడో చూశావుగా? ఇప్పుడు నీలూ ఆస్తి చిక్కే అవకాశం లేదని తెలిస్తే desperate అవుతాడు. మనం అసలు విషయం తెలుసుకోవచ్చు. నీకిక్కడ ఇంకో పనికూడా ఉంది. మా ఫోన్ tap చేయాలి."
"Multi-purpose అన్నమాట. రకరకాలుగా వాడండి నన్ను."
"That's the spirit! బాధపడకురా, సాయం మర్చిపోనులే"

***

పోలవరం బస్ స్టేషన్. అన్ని చిన్న టౌన్లలోలానే కోలాహలంగా ఉంది.
ఫోన్ బూత్ లో గోపాలుడున్నాడు,
"నేను అరగంటనించీ ఇక్కడే ఉన్నాను. అంతా మామూలుగానే ఉంది. డాక్టర్ ఇందాకే వచ్చాడు. వెంట ఎవరూ లేరు."
"గుడ్. ఫోన్ డాక్టర్ కి ఇవ్వు"
"ఓకే నర్సింగ్. వీలుదొరికినప్పుడు బాస్ కి నా సంగతి గురించి చెప్పు. డాక్టర్, మాట్లాడు"
"హలో"
"హలో డాక్టర్, నేను నర్సింగ్. పెళ్లి ఏర్పాట్లంట?"
"నర్సింగ్, అదంతా ఏమీలేదు. నేను handle చేయగలను. జేపీని కొంచెం ఓపిక పట్టమని చెప్పు"
"అయితే జేపీతోనే మాట్లాడు"
"బాస్ లైన్లో ఉన్నారా?"
"ఏమిటి డాక్టర్, ఎవరీ దీపక్?"
"జేపీ, నాకు కొంచెం టైం ఇవ్వు. ఈ దీపక్ ని మావాడు అమెరికానించి తీసుకొచ్చాడు. ఊర్లో ఎవరికీ వాడు తెలియదు"
"త్వరగా డాక్టర్, త్వరగా. నా దగ్గరలేనిది టైం ఒక్కటే. ఆ రాతిమండపం ఉన్న భూమి నువ్వు ఎంత త్వరగా hand over చేస్తే అంత మంచిది. లేకపోతే మా వాళ్లని దింపమంటావా?"
"వద్దు వద్దు, నేను ముందు ఎలాగోలా ఈ పెళ్లి ఆపుతాను. నాకు ఇంకొంచెం టైం..."
"బాస్ వెళ్లిపోయారు. రేపు మళ్లీ ఏదో ఒక టైం కి గోపాలుడు నిన్ను పిలుచుకొస్తాడు. అంతవరకూ పని చూడు"

కృష్ణమూర్తి ఈ ఊబిలో ఎందుకు చిక్కుకున్నానా అని బాధపడుతూ ఫోన్ కిందపెట్టాడు.

***

"ఏంటి మధూ ఈ కొత్త గోల, దీపక్ ఎవరు?"
"నేనూ ఇదే వినటం"
"నీలూకీ తనకీ ఎలా పరిచయం?"
"బావా...", సీత కాఫీ తీసుకొచ్చింది.
"కాఫీ తీసుకోరా"
"మిమ్మల్నిద్దర్నీ నీలక్క మిద్దెపైకి రమ్మంది. ఇదిగోండి", విజయ్ కి కాఫీ అందించి ఇంకో కప్పున్న ట్రే ని మధు పక్కన పడేసింది సీత.
"అబ్బో, గెస్ట్ కి కాఫీ అందించటం కూడానా, ఇంటికి ఎవరన్నా వస్తేమాత్రం ఎక్కడలేని వినయ...", తాగిన గుక్కెడు వేడి కాఫీని బట్టలమీద పడకుండా అవస్థపడి ఉమ్మేశాడు మధు, "ఒసేవ్, ఉప్పు కలుపుతావా కాఫీలో, తాగకురోయ్!!", సీత క్షణంలో మాయమైంది.
"ఈ కాఫీ చాలా బాగుంది"
"అదన్నమాట అతిథి మర్యాదకు కారణం"
"పద మరి"

***